అవును, విఫల ప్రత్యామ్నాయమే!

ABN , First Publish Date - 2021-03-09T06:51:50+05:30 IST

ఆంధ్రజ్యోతిలో జనవరి 31 నాటి ‘విఫల ప్రత్యామ్నాయం బోస్’ అనే నా వ్యాసం మీద మార్చి 3 న మంగెన గంగాధరరావు, అంతకు ముందు బాపూజీ...

అవును, విఫల ప్రత్యామ్నాయమే!

ఆంధ్రజ్యోతిలో జనవరి 31 నాటి ‘విఫల ప్రత్యామ్నాయం బోస్’ అనే నా వ్యాసం మీద మార్చి 3 న మంగెన గంగాధరరావు,  అంతకు ముందు బాపూజీ  చేసిన వ్యాఖ్యలు చూశాను. గాంధీకి కాదు బోస్ కు భయపడే స్వాతంత్ర్యం ఇచ్చాం అని క్లెమెంట్ అట్లీ 1956 పర్యటనలో బెంగాల్ చీఫ్ జస్టిస్, యాక్టింగ్ గవర్నర్ పిబి చవ్రవర్తి తో జరిపిన వ్యక్తిగత సంభాషణల్లో అన్న మాటలు చర్చకు నిలిచేవి కావు. బహిరంగంగా అనడానికి నైతికశక్తి లేని అంశాలే ఇటువంటి సంభాషణల్లో దొర్లుతాయి. ఇందులో గాంధీ పాత్ర లేదా అన్న తన ప్రశ్నకు అట్లీ మూతి ముడిచి 'minimal' అని సణిగినట్టు కూడా జస్టిస్ చక్రవర్తి చెప్పారు. సణగడం ఈ బ్రిటీష్ మాజీ ప్రధాని వ్యక్తిత్వం లోనే ఉందనే విషయం అటుంచి సణగడం ఎందుకు, తన అభిప్రాయాన్ని ధైర్యంగా ప్రకటించవచ్చుగా అనే ప్రశ్నకు ప్రకటించలేడు అనేదే సమాధానం. ఎందుకంటే గాంధీ వెనుక మూడు దశాబ్దాలు, అంతకు ముందు మరో మూడు దశాబ్దాల స్వాతంత్ర్యోద్యమం ఉంది. బోస్ కు భయపడే స్వాతంత్ర్యం ఇచ్చి ఉంటే క్రిప్స్ మిషన్, వేవెల్ ప్లాన్, కాబినెట్ మిషన్ లు ఎందుకు ? బ్రిటిష్ పార్లమెంట్ లో స్వాతంత్ర్య ప్రకటన చేయక ముందే దేశంలో ఎన్నికలు జరిపి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఎందుకు ? బోస్ బతికి ఉన్నప్పుడే ఆయనతో మంతనాలు జరిపి ఉండవచ్చు కదా !? బతికి ఉన్న గాంధీకి కాక చనిపోయిన బోస్ కు భయపడి స్వాతంత్ర్యం ఇచ్చామనడం మెరమెచ్చు మాట. యుద్ధానంతరం అజాద్ హింద్ సేన ప్రభావంతో భారత సైన్యం లో అసంతృప్తి పొడచూపిందనీ దాన్ని అణచే శక్తి బ్రిటిష్ సైన్యానికి లేదని అట్లీ అనడం గోరును గొడ్డలిగా చూపించడమే. అది భారత సైన్యానికే కాదు, ప్రపంచ వ్యాపితంగా యుద్ధం లో పాల్గొన్న దేశాల సేన లన్నిటిలో ఉన్న నిరసనే. అది తిరుగుబాటు రూపం తీసుకునే స్థాయిలో లేదు. దానికి నాయకత్వమూ లేదు. అప్పటికి అజాద్ హింద్ సేనా నాయకుల మీద దేశద్రోహ నేరం మోపబడి రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ పేరుతో జరుగుతున్న విచారణ పట్ల సైన్యం లో వ్యతిరేకత కనిపించడం మాత్రం వాస్తవం. అది ఒకనాటి సహచరుల పట్ల సైన్యం చూపిన అభిమానం. ఇక బొంబాయి లో 1946 లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ  తిరుగుబాటును బోస్ ఖాతాలో వెయ్యడం కుదరదు. అది సరైన వేతనాలు భోజనసదుపాయాలు లేవనీ జాతి వివక్షకు గురౌతున్నామనీ నావికులు చేసిన తిరుగుబాటు. పటేల్ చొరవతో అది సద్దుమణిగింది.


ఇక్కడ గుర్తు తెచ్చుకోవలసింది అట్లీ మాటలు కాదు , గాంధీ బయోగ్రాఫర్ లూయీ ఫిషర్ అన్న మాటలు. ‘బ్రిటన్ భారతదేశం నుంచి నిష్క్రమించింది పరిపాలించే భౌతిక బలం లేక కాదు, కొనసాగే నైతిక బలం లేక’ అన్నాడాయన. అవి పైపై మాటలు కావు. ఒక ప్రత్యామ్నాయ పోరాట మార్గ తాత్విక సారాన్నీ, నాగరికతనీ నింపుకున్న మాటలు. అది అటుంచి, గాంధీ, నెహ్రూ లు మాత్రమే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఇప్పుడెవరూ అనడంలేదు. ఆ మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇది సమిష్టి కృషి ఫలితం. అందులో బోస్ పాత్ర కూడా ఉండి ఉండవచ్చు. అయితే ఏ అహింసాయుత, ప్రజస్వామిక, లౌకిక, సామ్యవాద భావనలు ఉద్యమాన్ని నడిపి స్వతంత్ర భారత రాజ్యాంగానికీ మనుగడకూ దిక్సూచీ లయ్యాయో అవి ముఖ్యం. వాటికెవరు ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నది ముఖ్యం. ఇట్లా చూసినప్పుడు గాంధీకి బోస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాజాలడు. బోస్ మొదటినుంచీ టొటాలిటేరియన్ దృక్పథం ఉన్నవాడు. 1921 లో ఇంగ్లండ్ లో ఐసియస్ ను మధ్యలో వదలి బొంబాయి రేవులో దిగిన రోజే గాంధీతో జరిపిన భేటీలో తను శరపరంపరగా కురిపించిన ప్రశ్నలకు ఒకటొకటిగా మాత్రమే గాంధీ నుంచి వచ్చిన సమాధానాల్లో తమ దారులే కాదు స్వాతంత్ర్యానంతరం దేశంలో ఏర్పడాల్సిన వ్యవస్థ కూడ వేరైనదని గుర్తించాడు. అది బోస్ లో ఎప్పుడూ సమసిపోలేదు. బోస్ ను సైనిక దుస్తుల్లో చూడడానికి మనం 1943 దాకా ఆగనవసరం లేదు. 1928 లోనే చూడవచ్చు. ఆ సంవత్సరం కలకత్తా లో జరిగిన కాంగ్రెస్ సమావేశ నిర్వహణ లో వలంటీర్ దళపతిగా తను సైనిక దుస్తులు ధరించి అనుచరులకూ అటువంటి యూనిఫామే ఇచ్చాడు. ఆ సందర్భంగా ఆ పెరేడ్లూ, ఇనుప బూట్ల చప్పుళ్లూ, శాల్యూట్లకూ విసిగిన గాంధీ దాన్ని ఇంగ్లండ్ లో అప్పట్లో ప్రసిద్ధి చెందిన బెట్రాం మిల్స్ సర్కస్ తో పోల్చి ఈసడించాడు. (అప్పుడు కూడా బెంగాలీలకు కోపం వచ్చిందనుకోండి) బోస్ సామ్యవాదం శాస్త్రీయ సామ్యవాదం కాదు. కనీసం నెహ్రూ సోషలిజం కూడా కాదు. అది వివేకానందుడి సోషలిజం. దాన్ని పక్కన పెడితే, ఆయన 1940 తర్వాతే హఠాత్తుగా ఫాసిస్ట్ శక్తులతో చేతులు కలిపాడనుకోవడం పొరపాటు. 1930 లోనే దేశానికి సోషలిస్ట్ ఫాసిస్ట్ భావజాలాల మిశ్రమ వ్యవస్థ కావాలన్నాడు. 1944 లో మరింత స్పష్టంగా మన సిద్ధాంతం నేషనల్ సోషలిజం (నాజీ) కమ్యూనిజం ల సమ్మిళితం అని ప్రకటించాడు. 1944 లోనే టోక్యో విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల్లో ప్రజాస్వామిక వ్యవస్థలు విఫలమైనాయనీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను బాగు చెయ్యడానికి అథారిటేరియన్ లక్షణాలున్న ప్రభుత్వం రావాలనీ అన్నాడు. కాబట్టి సైనిక మార్గం లో సాధించిన స్వతంత్ర భారత దేశంలో బోస్ స్థాపించబూనుకున్నదేమిటో స్పష్టమైంది. అది ఏదైనా ప్రజాస్వామ్యం మాత్రం కాదు. కాబట్టి చరిత్ర తెలియడం వేరు. చరిత్రను ఎవరు ఏ ప్రయోజనాలు ఆశించి వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవడం వేరు.

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Updated Date - 2021-03-09T06:51:50+05:30 IST