Abn logo
Jul 22 2021 @ 01:20AM

ఔను.. ఉప ఎన్నిక ఉన్నందుకే

 • హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ ఎందుకు పెట్టొద్దు?
 • టీఆర్‌ఎస్‌ ఏమైనా సన్నాసుల పార్టీయా!
 • రాజకీయంగా లాభాన్ని ఎందుకు కోరుకోము?
 • అంత స్వార్థం ఉంటే గజ్వేల్‌లోనే పెట్టుకునేవాడిని
 • దళితబంధు నిధులను పప్పు పుట్నాలు కానివ్వం
 • ప్రభుత్వం, లబ్ధిదారుల భాగస్వామ్యంలో.. 
 • ప్రతి జిల్లాకూ ఒక రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం
 • రేపటి భవిష్యత్తు, నిర్మాణ బాధ్యత యువతదే
 • ఎన్టీఆర్‌ అవకాశమిస్తేనే ఎమ్మెల్యేనయ్యాను
 • కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తుంది: సీఎం కేసీఆర్‌ 
 • కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డి


హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఉన్నందుకే దళిత బంధు పథకాన్ని అక్కడ పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలకు సీఎం కేసీఆర్‌ అంతే స్థాయిలో బదులిచ్చారు. రాజకీయ పార్టీగా రాజకీయ లాభాన్ని కోరుకుంటామని, ఉప ఎన్నిక ఉన్నందుకే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ సన్నాసుల పార్టీ కాదని, తామేమీ హిమాలయ పర్వతాల్లో కూర్చోలేదని అన్నారు. హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ మాజీ నేత పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.


‘‘దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే పైలట్‌గా తీసుకున్నం. ఎన్నికలున్నందుకే అక్కడ పెట్టినమని కొందరు అంటున్నరు. మరి పెట్టమా? టీఆర్‌ఎస్‌ ఏమైనా సన్నాసుల పార్టీయా? రాజకీయ పార్టీయే కదా? టీఆర్‌ఎ్‌సకు అధికారం ఉంటేనే కదా దళిత బంధు నడిపేది! మనమేమైనా హిమాలయ పర్వతాల్లో కూర్చున్నమా? ప్రజల్లో ఉన్నం.. కచ్చితంగా మనది రాజకీయ పార్టీ. పథకం పెట్టినప్పుడు రాజకీయంగా లాభం జరగాలని ఎందుకు కోరుకోము?’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తాను అంత స్వార్థపరుడినే అయితే ఈ పథకాన్ని గజ్వేల్‌లోనే పెట్టేవాడిని కదా! అన్నారు. 


రైతుబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్‌లోనే ప్రారంభించామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా తనకు సెంటిమెంట్‌ జిల్లా అని, మొట్టమొదటి సింహగర్జన సభ కూడా అక్కడ జరిగిందని అన్నారు. రైతుబీమా పథకాన్ని కూడా కరీంనగర్‌ టౌన్‌లోనే రైతు సదస్సులో ప్రకటించానని గుర్తు చేశారు. 


దేశవ్యాప్తంగా దళితులపై అణచివేత..

కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా దేశవ్యాప్తంగా దళితులు అణచివేతకు గురవుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాల్లోనూ పేదరికం ఉన్నా.. దళితుల్లో పేదరికంతోపాటు సామాజిక వివక్ష అనే బాధ కూడా ఉందన్నారు. దళిత బంధు పథకంతో లబ్ధిదారుడు రూ.10 లక్షలకు యజమాని అవుతాడని, తనకు చేతనైన పని చేసుకుంటాడని అన్నారు. ప్రభుత్వం మార్గనిర్దేశకత్వం మాత్రమే చేస్తుందన్నారు. ఈ పథకంలో భాగంగా సపోర్టివ్‌ స్ట్రక్చర్‌ కూడా ఏర్పాటవుతుందని తెలిపారు.


‘‘దళిత బంధు లబ్ధిదారులకు స్పెషల్‌ కార్డు ఇస్తాం. ఆ కార్డుకు ఒక చిప్పు, బార్‌ కోడ్‌ ఉంటాయి. ఇచ్చిన డబ్బును లబ్ధిదారుడు ఏం చేస్తున్నడు? ఉన్నయా, పప్పు బెల్లాలయిపోయినయా.. అన్నదీ చూస్తం. లబ్ధిదారుడు మళ్లీ కిందకు జారిపోని విధంగా ఈ పథకం రూపొందుతోంది’’ అని వివరించారు. లబ్ధిదారునికి ఏదైనా జరిగి ఆ కుటుంబం మళ్లీ కిందకు పోకుండా ప్రత్యేక రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు రక్షణ నిధి ఉంటుందని, దానికి ప్రభుత్వంతోపాటు లబ్ధిదారుని కాంట్రిబ్యూషన్‌ ఉంటుందన్నారు. ఇది ఎవరికి, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుందని చెప్పారు. 


కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు..


టీఆర్‌ఎ్‌సలో చేరిన కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి తండ్రి తనకు చిరకాల మిత్రుడని, 2001లో గులాబీ జెండా ఎగరేసినప్పుడు తనతో పాటు భుజం కలిపిన వారిలో ఆయన కూడా ఒకరని తెలిపారు. అందరూ కౌశిక్‌రెడ్డి వెంటే ఉండాలని ఆయనతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన నియోజకవర్గ నేతలకు సూచించారు.


‘‘రాజకీయం అన్నాక.. గెలుపోటములు సహజం. ఏ ఒక్క పూట కోసమో రాజకీయాలు చెయ్యకూడదు. ప్రస్థానంలో ఉండి కొనసాగుతున్నప్పుడు మన కాంట్రిబ్యూషన్‌ ఉంటది. అన్న ఎన్టీఆర్‌ నాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యాను. అధికారం శాశ్వతంగా ఎవరికీ ఉండదు. ఒక సందర్భంలో మేము ప్రతిపక్షంలోనూ ఉన్నాం’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి పథకాన్ని రూపొందిండంలోనూ ఒక మదింపు, ఆలోచన ఉన్నాయని అన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని కొందరు తేలిక చేసి మాట్లాడారని, కానీ.. ఇప్పుడు దేశంలోనే గొర్రెల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.


తెలంగాణ వచ్చేనాటికి ఆత్మహత్యలు చేసుకుని ఆగమైన రైతాంగం.. ఇవాళ 3 లక్షల కోట్ల టన్నుల వడ్లు పండించే స్థాయికి చేరుకుందన్నారు. ఎఫ్‌సీఐకి దేశంలోనే అత్యధికంగా 92 లక్షల టన్నుల బియ్యం జోకిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతు బంధు లక్ష్యం నెరవేరి.. తెలంగాణ రైతుకు ధీమా వచ్చిందని, ఇప్పుడు ఆత్మహత్యలు చోటుచేసుకోవడంలేదని పేర్కొన్నారు.


‘‘మనకు పంటలు పండించడం రాదని, తినడమూ రాదని ఆనాడు ఆంధ్రావాళ్లు ఎక్కిరించినరు. కానీ, ఇప్పుడు అక్కడ గల్లంతైంది. ఇక్కడ గట్టిగైంది. ఇవాళ ఆంధ్రాలో పండించిన పంట ఎంత? మన దగ్గర పండిన పంట ఎంత? ఎఫ్‌సీఐకి ఏపీ జోకిన బియ్యం ఎంత? మనం జోకిన బియ్యం ఎంత? ఇదొక్కటే గీటు రాయి. ఎక్కువ అవసరం లేదు’’ అని కేసీఆర్‌ అన్నారు. ఎప్పుడో 40ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వచ్చాక.. ఇంకా ఆంధ్రావాళ్లమని చెప్పుకోవాల్సిన అవసరం లేదని, హైదరాబాదీయులుగా చెప్పుకోవాలని సూచించారు. 


దేవుడు నోరిచ్చాడని మొరుగుతున్నారు! 


దేవుడు నోరు ఇచ్చాడు కదా అని కొందరు కుక్కలు మొరిగినట్లు మొరుగుతున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు మాత్రం వాస్తవాలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలకు అవసరమైనవి ప్రభుత్వం చేసుకుంటూ పోతోందని, ప్రజలు ఎప్పటికప్పుడు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లోనూ వరుసపెట్టి గెలిపిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తు యువతదేనని, తెలంగాణ నిర్మాణ బాధ్యతా వారిదేనని అన్నారు. ప్రతి దానినీ విమర్శించి, వక్రీకరించి, కోడుగుడ్లపై ఈకలు పీకేవారు ఎప్పటికీ ఉంటారని అన్నారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన కురుమ సంఘం నేతలు!


గొర్రెల యూనిట్‌ ధరను పెంచడమే కాకుండా, రూ. 6 వేల కోట్లతో రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తున్నందుకు... రాష్ట్ర కురుమ సంఘం నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వర్గం, ప్రతి కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరమే గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించామని, అప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని ప్రశ్నించారు. బుధవారం దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. 2021కిగాను దాశరథి సాహితీ పురస్కారానికి ఎంపికైన ఎల్గూరి శివారెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు.