నిండాముంచిన యస్‌బ్యాంక్‌.. నెల్లూరులో ఖాతాదారుల బెంబేలు

ABN , First Publish Date - 2020-03-09T21:45:09+05:30 IST

యస్ బ్యాంకు.. ఖాతాదారుల లావాదేవీలు నిలిపివేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏపీలో యస్‌బ్యాంకుకు

నిండాముంచిన యస్‌బ్యాంక్‌.. నెల్లూరులో ఖాతాదారుల బెంబేలు

యస్ బ్యాంకు.. ఖాతాదారుల లావాదేవీలు నిలిపివేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏపీలో యస్‌బ్యాంకుకు ఏడు శాఖలు ఉన్నాయి. ఒక్క నెల్లూరు శాఖలోనే ఐదు వేల మంది ఖాతాదారులు నిత్యం నగదు లావాదేవీలు చేస్తుంటారు. ఆ ఒక్కశాఖలోనే 50 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఒక్కసారిగా బ్యాంకు ఏటీఎం పనిచేయకపోవడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యస్‌బ్యాంక్‌ ఖాతాదారుల కష్టాలపై ఏబీఎన్ స్పెషల్‌ స్టోరీ....


నెల్లూరు వైఎంసీ గ్రౌండ్‌ సమీపంలో ఐదేళ్ల కిందట యస్ బ్యాంకు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించి డిపాజిట్లు సేకరించారు. ఇప్పటికే 50 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లను సేకరించారు. ప్రజలను నమ్మించి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. లక్ష రూపాయలలోపు అరవై శాతం, లక్షరూపాయలకు మించి ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఇంకా ఎక్కువ వడ్డీలు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మించారు. గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ వస్తుండటంతో ఎక్కువ మంది ఈ బ్యాంకులో డిపాజిట్లు చేశారు. రిటైర్ అయ్యాక వచ్చే డబ్బు.. పిల్లలు పంపిన డబ్బు.. ఆస్తులు అమ్మిన డబ్బు పొదుపు చేశారు. పొదుపు చేసిన డబ్బుకు వచ్చే వడ్డీతో అనేకమంది జీవనం సాగిస్తున్నారు.


వ్యాపారలావాదేవీలకి అనేక వెసులుబాట్లు ఉన్నాయంటూ ప్రచారాలు చేయడంతో.. చాలా మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఖాతాలు తెరిచారు. లక్షల రూపాయల్లో నగదు లావాదేవీలు చేస్తూ వచ్చారు. ఈ శాఖలో ఐదు వేల మంది ఖాతాదారులు ఉంటే.. ఒక్కసారిగా అన్ని ఖాతాలు నిలిపివేశారు. దీంతో ఖాతాదారులకు ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ బ్యాంకు వద్దకు పరుగులు తీశారు.

 

వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు నిత్యం లక్షల రూపాయల చెక్కులు డిపాజిట్‌ చేస్తుంటారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఖాతాలు నిలిపివేయడం వల్ల ఇతర బ్యాంకులకు తీసుకెళ్లిన చెక్కులు బౌన్స్ అయ్యే పరిస్థితి నెలకొంది. అకౌంట్లలో డబ్బు డ్రా చేయడానికి కూడా వీలులేదు. ఒక్కో ఖాతాదారుడికి నెలలో యాభై వేల రూపాయలు మాత్రమే డ్రా చేసే వెసులుబాటు కల్పించారు. ఆ యాభై వేల రూపాయలు తమకు ఎలా సరిపోతాయంటూ ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. అది కూడా చెక్కులు తీసుకువచ్చి ఇస్తే.. రెండు, మూడు రోజుల్లో ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.


యస్ బ్యాంకు ఓ ప్రైవేటు బ్యాంక్.. అధిక వడ్డీ ఆశచూపి జనం నుంచి భారీ ఎత్తున నగదు పోగుచేసిందని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. బడాబాబులను పిలిచి రుణాలు ఇవ్వడం, వారిలో ఎక్కువ మంది తిరిగి చెల్లించకపోవడం, ప్రకటనలకు అధికంగా ఖర్చు చేయడం తదితర కారణాల వల్ల బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు రిజర్వు బ్యాంకు.. యస్‌ బ్యాంకులోని సగం షేర్స్‌ను  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసికి అప్పగించే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. అలా చేయడం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నష్టాలు చవిచూస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఏటీఎంలు, ఏటీఎం కార్డులు పనిచేయకపోవడం, బ్యాంకులకు వెళ్లినా నగదు ఇవ్వకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు త్వరితగతిన సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఖాతాదారులు కోరుతున్నారు. ప్రస్తుతం మార్చి నెల కావడం.. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యులకు చిన్నమొత్తాల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వంద ఆంక్షలు విధిస్తాయని.. అదే బడాబాబులకు అయితే వారి ఇళ్లకు వెళ్లి.. బతిమిలాడి వేల కోట్ల రూపాయలు రుణాలు పంచేస్తాయని పలువురు ఆరోపిస్తున్నారు. అలా వందలు, వేల కోట్లల్లో రుణాలు పొందిన వారు రాత్రికి రాత్రే విదేశాలకి చెక్కేస్తే.. ఆ భారం సామాన్యులు మోయాలా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. 


దేశంలో ఇలాంటి ప్రైవేటు బ్యాంకులు గంటల వ్యవధిలోనే బోర్డులు తిప్పేస్తుంటే.. ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకు పట్టించుకోదా?.. చట్టాలను కఠినం చేయవా?.. అని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-09T21:45:09+05:30 IST