ఎరువుల ధరవు!

ABN , First Publish Date - 2022-08-20T04:51:28+05:30 IST

జిల్లాలో 48,881 హెక్టార్లలో ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి పెట్టుబడి బాగా పెరిగింది.

ఎరువుల ధరవు!

రూ.975 నుంచి 1500 చేరిన కాంప్లెక్స్‌

ఈ పొటాష్‌ రేటూ రూ.500 పెంపు

ఏటా సేద్యంలో పెరుగుతున్న పెట్టుబడి

అన్నదాతలపై తప్పని ఆర్థిక భారం


అన్నదాతకు అత్యవసరమైన ఎరువుల ధరలు మండిపోతున్నాయి. ఏడాదికేడాది అందనంత ఎత్తుకు చేరిపోతున్నాయి. విత్తన కొనుగోలు నుంచి నుర్పిళ్లు దాకా.. ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు చేర్చే వరకు ఇలా వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతుండటంతో కర్షకుడు గగ్గోలు పెడుతున్నాడు. ఇంత ఖర్చు చేసి పంటలు పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, ధాన్యానికి గిట్టుబాటు ధర కరువవుతోంది. అన్నిటికిమించి ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను నష్టాలబాట పట్టిస్తూ అప్పులపాలు చేస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో రైతులపై కాంప్లెక్స్‌ ఎరువుల భారం పడింది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


నెల్లూరు (వ్యవసాయం), ఆగష్టు 19 : జిల్లాలో 48,881 హెక్టార్లలో ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి పెట్టుబడి బాగా పెరిగింది. విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. అంతేగాక దుక్కిలో, మొక్కలు నాటిన తర్వాత నుంచి కోత కోసే సమయం వరకు రైతు పంటను రక్షించుకునేందుకు రకరకాల ఎరువులు, పురుగు మందులకు రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలను పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంది. దీంతో రైతన్నపై అదనపు భారం పడింది. నత్రజని, భాస్వరం కలిగిన ఈ ఎరువును దుక్కిలో వేస్తారు. దీని ధర గతేడాది సుమారు రూ.1225 నుంచి రూ.1275 వరకు కంపెనీని బట్టి విక్రయించగా ప్రస్తుతం రూ.1350లకు చేరింది. అదేవిధంగా కాంప్లెక్స్‌ ఎరువుల రూ.950 నుంచి రూ.975 వరకు కంపెనీలను బట్టి ధరలు ఉండగా ప్రస్తుతం రూ.1500లకు చేరింది. ఇంకా ఎంవోపీ. ఈ పొటాష్‌ ఎరువును మొక్కల ఎదుగుదలకు, పురుగులను తట్టుకునేందుకు రైతులు వాడతారు. పంట ప్రారంభంలో ఒక విడత, చివరి దశలో రెండో విడతగా ఈపొటా్‌షను వినియోగిస్తారు. ఒక బ్యాగు ధర రూ.1000 నుంచి రూ.1250 వరకు ఉండగా ప్రస్తుతం రూ.1700లకు వరకు చేరింది. ఎకరా వరి దుక్కిలోకి డీఏపీ బస్తా, కాంప్లెక్స్‌ ఎరువులు మోతాదును బట్టి ఒకటి నుంచి మూడు బస్తాలు వినియోగించాల్సి ఉంటుంది. ఎరువుల కోసమే రూ.5వేల నుంచి రూ.6వేల వరకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన సమయంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు లభించకపోవడంతో ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పెట్టుబడి వ్యయం పెరిగింది!


ఒక ఎకరాలో వరి సాగు చేయాలంటే విత్తనాల కొనుగోలు నుంచి నాట్లు, మందులు, కోతలు మొత్తం కలిపి దాదాపు రూ.22వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చయ్యేది. పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరల కారణంగా  ఇప్పుడు రూ.30వేలకు చేరింది. అంత ఖర్చు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా ధాన్యం నగదు ఎప్పుడిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు ఆలోచించి రైతులకు న్యాయం చేయాలి.

- కోటిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు



వ్యవసాయమంటే భయమేస్తుంది


ఎరువుల ధరలు ఇలా పెంచుకుంటూపోతే  సాగు అంటేనే భయపడాల్సి వస్తోంది. రైతులు వ్యవసాయం మానుకొని కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. అవసరం లేని వారికి కూడా ఉచితాలు ఇస్తున్నారు. దేశానికి వెన్నెముఖ అయిన రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ఆర్బీకేల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు.

- చీమల తాతయ్య, నాగసముద్రం, కలిగిరి మండలం


 

ఎరువుల ధరలు మరింత భారం


డీజిల్‌ ధరలు పెరిగి పాలుపోని స్థితిలో ఉన్న మాకు పెరిగిన ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లే. డీఏపీ బస్తాకు రూ.150 పెరగ్గా పొగాకు సాగులో తప్పనిసరిగా వినియోగించాల్సిన పొటాష్‌ అయితే ఏకంగా బస్తాకు రూ.700 పెంచేశారు. అలాగే 20-20-0-15 రకం కాంప్లెక్స్‌ ఎరువుపై కూడా రూ.300 పెంచారు. గత ఏడాది ధరతో పోలిస్తే ఇది 25 శాతం వరకు పెరిగింది. అలాగే సల్ఫేట్‌, ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.  

- ఇంటూరి వెంకటేశ్వర్లు, రైతు, కాకుటూరు, కందుకూరు మండలం 



 సాగు వ్యయం పెరిగింది..

ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులను అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అందుబాటులో లేవు. బయట బ్లాక్‌ మార్కెట్‌లో ప్రతి ఎరువుమందుకు రూ.100 నుంచి రూ.150 అదనంగా అమ్ముతున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ఎరువులు, పురుగుమందులను అందించి మెట్టప్రాంత రైతులను ఆదుకోవాలి.

 - నాయుడు హజరతరెడ్డి, ఏపిలగుంట, మర్రిపాడు మండలం


Updated Date - 2022-08-20T04:51:28+05:30 IST