ఎరువు.. అరువు

ABN , First Publish Date - 2022-08-20T05:38:26+05:30 IST

ఆర్బీకేల్లో ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు అందజేస్తున్నామని పాలకులు ఘనంగా చెబుతున్నారు.

ఎరువు.. అరువు

అప్పుగా ఇస్తున్న వ్యాపారులు 

ఆర్బీకేల్లో నగదు చెల్లిస్తేనే ఎరువులు

నగదుకు కొనుగోలు చేయలేకపోతోన్న రైతులు

ఫర్టిలైజర్స్‌ వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్న వైనం

ఇదే అవకాశంగా రైతులను దోచుకుంటున్న వ్యాపారులు

జిల్లాలోని ఆర్బీకేల్లో 6,500 టన్నులకు 1500 టన్నులే విక్రయం 

 

వ్యవసాయం అంటే అష్టకష్టాలు.. అప్పులు. సాగు పనులు మొదలు పెట్టినప్పటి నుంచే రైతుకు నగదు లేనిదే పని జరగదు. రైతుకు అవసరమైన సేవలు అన్నీ స్థానికంగా రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్బీకే) అందుబాటులోకి తెచ్చామని పాలకులు ప్రకటించారు. ఎక్కడికక్కడ ఆయా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో తక్షణావసరమైన విత్తనాలు, ఎరువులు తదితరాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా నూటికి 80 శాతం రైతులు అప్పులతోనే సాగు పనులు మొదలుపెట్టి పంట చేతికి వచ్చాక తీరుస్తుంటారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా క్షేత్రస్థాయిలో రైతుల స్థితిగతులు అంచనా వేయకుండా ప్రభుత్వం తలపెట్టిన ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీ అనేది విఫల ప్రయోగంగా మారింది.  ఆర్బీకేల్లో రైతులకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉన్నా నగదుతో కొనుగోలు చేయాలి. అదే వ్యాపారుల వద్ద అయితే అరువు ఇస్తారు.  ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచిన ఎరువులు కొనుగోలు చేసే వారు అంతగా లేకుండాపోయారు.  


బాపట్ల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్బీకేల్లో ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు అందజేస్తున్నామని పాలకులు ఘనంగా చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో వినియోగించే ఎరువుల్లో కనీసం పది శాతం ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పజెప్పి పర్యవేక్షణకు ఆ విభాగానికి ఒక డీఎంను కూడా ప్రభుత్వం నియమించింది. దానికి అనుగుణంగా జిల్లాలోని 410 రైతుభరోసా కేంద్రాల్లో 6,500 టన్నుల ఎరువులను మార్క్‌ఫెడ్‌ అందుబాటులో ఉంచింది. ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా ప్రారంభమై ఇప్పటికే  నెలన్నర దాటింది. అయితే ఆర్బీకేల ద్వారా జిల్లా వ్యాప్తంగా రైతులు కొనుగోలు చేసిన ఎరువులు 1500 టన్నులు మాత్రమే అంటే ఆశ్చర్యం కాదు. ఇంత మందకొడిగా అమ్మకాలు జరగడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నగదు అంశమేనని తేలింది. ఆర్బీకేల్లో అయితే నగదు ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. అదే ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో అరువుగా ఎరువులు అందిస్తుంటారు. జిల్లాలో ఉన్న రైతుల్లో 80 శాతం మంది చిన్న, సన్న కారులే. దీంతో వారందరూ ప్రతి సీజన్‌లో పెట్టుబడుల కోసం అష్టకష్టాలు పడుతుంటారు. సహజంగానే అరువుకు ఎరువులు ఇచ్చే వ్యాపారుల వైపే వీరంతా మొగ్గు చూపుతుంటారు. పెట్టుబడుల వేళ చేతిలో సమృద్ధిగా డబ్బులు లేకపోవడంతో అప్పులు ఇచ్చే వ్యాపారులనే రైతన్నలు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు.   రైతుల అవసరాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ లక్షలు ఆర్జిస్తున్నారు. దిగుబడులు సమయాన తాము కేవలం ఎమ్మార్పీ ధరలు మాత్రమే రైతుల దగ్గరనుంచి వసూలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నా లోపాయకారిగా వారి దగ్గరనుంచి కొంత వడ్డీ కలిపి లాగుతుంటారు.


గ్రామాల్లో దళారీ దందా....

రైతుల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు దళారీ దందాకు తెరలేపుతున్నారు. గ్రామాల్లో అప్పుపై ఎరువులు ఇవ్వడానికి ఏజెంట్లను నియిమించుకుని అధిక వడ్డీతో పాటు నకిలీ ఎరువులను అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నగదు చెల్లింపులకు అయితే ఓ రేటు, అప్పు అయితే మరోరేటు ఫిక్స్‌ చేసి దందా సాగిస్తున్నారు. గత్యంతరం లేక దళారీలు చెప్పే ప్రతిమాటకు అంగీకారం చెబుతున్న అన్నదాతలు దిగబడులు చేతికొచ్చే సమయానికి వారు లాగేసుకునే మొత్తాలను చూసి ఆవేదన చెందుతున్నారు. ఇలా వడ్డీలకే మొత్తం చెల్లించాల్సి రావడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విజిలెన్స్‌ తనిఖీలు, టాస్క్‌ఫోర్స్‌ దాడులు అంతా మొక్కుబడే వ్యవహారమే తప్ప దళారీల ఆటకట్టించే వ్యవస్థలే లేవు. దీంతో రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు.


ఆర్బీకేల్లోనూ వెసులుబాటు ఇవ్వాలి..

ప్రైవేటు వ్యాపారులు ఇచ్చే వెసులుబాటు ఏదో ప్రభుత్వం కూడా ఇస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎటూ పంట కొనుగోలు చేసేది కూడా ప్రభుత్వమే కనుక అప్పుడు ఆ మొత్తాలను మినహాయించుకోవచ్చంటున్నారు. ఆర్బీకేల్లో ఉండే ఎరువులను కొనుగోలు చేయడం వల్ల రవాణా ఖర్చులు కలిసివస్తాయని ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషించాలని రైతులు సూచిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 60,000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ఇందులో కనీసం పదిశాతం ఆర్బీకేల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభంలో మార్క్‌ఫెడ్‌ 6,500 మెట్రిక్‌టన్నుల ఎరువులను జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్బీకేలలో అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటికీ అమ్మింది కేవలం 1500 టన్నులే. బహిరంగ మార్కెట్‌లో ఇప్పటికే 25,000 టన్నుల ఎరువులు అమ్మకాలు జరిగాయని అంచనా.  ప్రస్తుతం ఆర్బీకేల్లో అమ్మకాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం నిర్దేశించిన పదిశాతం లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అనే అభిప్రాయం అధికారుల నుంచే వ్యక్తమవుతోంది.


Updated Date - 2022-08-20T05:38:26+05:30 IST