Abn logo
Dec 2 2020 @ 02:15AM

ఎరుపురంగు పావురం

గేరి పక్కా గేరివోడ

గెట్టు గెట్టు మనసు మనసు కలిసినోడ

పక్కెమ్మటి గుండెవాడ

ఎరుపురంగు పావురమా! 

ఎర్రజెండా పావురమా!!


మెచ్చుకుంటే మేరుపర్వతం

కోపంలో కొమ్రెల్లి మల్లన్న

ఊరిని గేరిని ఏకం చేయ కదిలినోడ! పౌరుషమువాడ!!

మన బంధాల పురులు విప్పి ఒలపోస్తుంటే

వెన్నెల డొంకన నెమలి సింగారం

పాలెం సరిహద్దుల్లో నోముల పొలిమేరల్లో

మోహరించిన సైన్యానివి


నకిరేకల్‌ గుండె పొరల్లో ధని పలికిన ధైర్యానివి

ఏ స్థూపానికి తెలియదు నీ అడుగుల చప్పుడు

ఏ స్వప్నానికి తెలియదు నీ మాటల జలధి మోత

గొడుగులు పట్టే దేశాన పిడుగుల వర్షానివి

గోతులు తవ్వే చేతుల్లో బలపాల పాలధారవి

నర్సిమన్నా ఒక మాట చెప్పు!

మళ్లీ నా వ్యాసం చదివి ఎప్పుడు ఫోన్‌ చేస్తావు

మన తాత చెప్పిన పాతకాలపు రహస్యాన్ని 

ఎప్పుడు వింటావు!

(నోముల నరసింహయ్య స్మృతిలో)

డా. కదిరె కృష్ణ

Advertisement
Advertisement
Advertisement