ఎరుక

ABN , First Publish Date - 2021-11-22T07:59:41+05:30 IST

క్షణ కంటకాలు దేహాలని గీరుకుంటూ పోతూ ముళ్లమీది వస్త్రాల్లా నేత్రాలని ఆరేసినపుడు ఎరుక లోకి వస్తుంది ఎరుగని ఉదయం! నలుదిక్కులకీ గుండె శబ్దాలు వ్యాపిస్తాయి...

ఎరుక

క్షణ కంటకాలు

దేహాలని గీరుకుంటూ పోతూ

ముళ్లమీది వస్త్రాల్లా నేత్రాలని ఆరేసినపుడు

ఎరుక లోకి వస్తుంది ఎరుగని ఉదయం!


నలుదిక్కులకీ గుండె శబ్దాలు వ్యాపిస్తాయి

నాలుగు మాటలు విందామని రేపటి పొద్దు గురించి!

నలత కలత ఆలోచనలు తప్ప

నికరం ద్రవించదు నిబ్బరం కనిపించదు!


రైలు కంపార్టుమెంట్లలా

విడివిడి వయసు మంత్రాలు

పొడిపొడిగా పొద్దులని భుజిస్తుంటాయి

ఇంద్రియ వనాల్లో విహరిస్తుంటాయి!


జీడి పాకాల్లా, బబుల్‌గమ్ముల్లా

తలపోతలు తిరగమోత అవుతూ ఉంటాయి

యుద్ధాలూ విందులూ - రెండు పొద్దుల మధ్య

నిద్రపోతూనే ఉంటాయి జీవితాశలు!


విత్తు బద్దలై మొలకెత్తినట్లు

అరచేతులు రెండూ జోడించి మోరెత్తి

నేలతల్లి మీద రెండేసి కన్నీటి చినుకులు జారేస్తాం

జావగారిన జీవితాల్లోని లోకిటుకులు జల్లెడపడతాం!


క్షణమొక రోదన, క్షణమొక శోధనగా

తెలివిడి తడుముతూ ఉంటుంది!

అనంతమేదో అందనంత మేరలో దాగి

శూన్య ఫల దోబూచులాటని ఎరిగిస్తూ ఉంటుంది!

శక్తికేంద్రం చుట్టూ ప్రదక్షిణలుచేయిస్తూ ఉంటుంది!


మౌన పత్రాల మీద

వాగాభ్యాసం పురి విప్పాలి

ఉచ్ఛరింపు అర్చనలతో

నిక్కము నిక్కచ్చిగా నీడలో జూడాలి!

పూసలదారంలా అలంకరించుకున్న

గుణాచ్ఛాదనలన్నీ కొక్కానికి తగిలించాలి

దండాల డెందాన్ని జ్యోతిలా వెలిగించాలి!

ఒబ్బిని

98495 58842


Updated Date - 2021-11-22T07:59:41+05:30 IST