జిల్లా కేంద్రంగా గురజాలకు అన్ని అర్హతలు

ABN , First Publish Date - 2020-08-11T09:43:34+05:30 IST

800ఏళ్ల చరిత్ర కలిగిన పల్నాడును జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆకాంక్షించారు.

జిల్లా కేంద్రంగా గురజాలకు అన్ని అర్హతలు

యరపతినేని శ్రీనివాసరావు 


పిడుగురాళ్ల, ఆగస్టు10: 800ఏళ్ల చరిత్ర కలిగిన పల్నాడును జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ శాసనసభ్యులు  యరపతినేని శ్రీనివాసరావు  ఆకాంక్షించారు.  జిల్లా కేంద్రంగా గురజాలను ప్రకటించి పల్నాడును అన్ని విధాల అభివృద్ధి చేస్తే, పారిశ్రామికంగా ఎంతో మందికి ఉపాధి కల్పించటంతోపాటు సున్నం పరిశ్రమలు, పల్వరైజింగ్‌ మిల్లులు, సిమెంట్‌ కర్మాగారాలు పల్నాడు ప్రాంతంలో ఎన్నో ఉన్నాయని వీటివల్ల ప్రభుత్వానికి చెప్పుకోదగిన ఆదాయం వస్తుందన్నారు. సిమెంట్‌ పరిశ్రమలు మరో పది పెట్టేందుకు ఖనిజసంపద పల్నాడులో విస్తారంగా ఉందని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రైలు మార్గం, నడికుడి- శ్రీకాళహస్తికి కొత్తగా రైల్వేమార్గం రావటం జరిగిందని పల్నాడు ప్రాంతం నుండి దేశ విదేశాలకు రాకపోకల మార్గాలున్నాయని పల్నాడు ప్రాంతంలోని నాగార్జునాసాగర్‌ప్రాజెక్టు, ప్రక్కనే  కృష్ణానది కూడా ఉండటం వల్ల అపారమైన నీటి వనరులు పల్నాడులో ఉన్నాయని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కూడా ఖాళీగా ఉన్నాయని, చదువుకున్ననిరుద్యోగ యువతకు స్మాల్‌ స్కేల్స్‌ ఇండస్ట్రీల కింద కొంత భూమి కేటాయించి  పరిశ్రమలు ఏర్పాటు చేయటం వల్ల నిరుద్యోగ సమస్య పెరగటమే కాకుండా రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగే అవకాశముందని యరపతినేని తెలిపారు.


ఆసియా ఖండంలోనే అతిపెద్ద గుంటూరు మిర్చియార్డుకు పల్నాడు ప్రాంతంలోనే పండిన మిర్చి80శాతం వస్తున్నాయని గుర్తుచేశారు.  పార్లమెంట్‌ను జిల్లాగా చేయాలనే రూలేమీ లేదని, జిల్లాల సంఖ్యను అవసరానికి తగినట్టుగా ఎన్నైనా  పెంచుకోవచ్చని తెలంగాణాలో ఉన్న 10జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలుగా మారాయని, తెలిపారు. పల్నాడుప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంతఫ్యాక్టరీ అయిన సరస్వతి సిమెంట్‌ఫ్యాక్టరీని స్థాపించి పల్నాడులో ఉన్న ఖనిజ సంపదను రూ.50వేలకు లీజుకు తీసుకోవటంతో పాటు కృష్ణానది నుండి నీటిని 50ఏళ్లపాటు ఉపయోగించుకునే విధంగా అనుమతులు తెచ్చుకోవటంతో పల్నాడులో అన్ని వనరులను ఉపయోగించుకోవటమేనా పల్నాడుకు ఉన్న గౌరవాన్ని , గుర్తింపును ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఏరూపంలో ఇస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశంపార్టీ హయాంలో గురజాలను జిల్లా కేంద్రంగా చేసేందుకు కావాల్సిన అన్ని వసతులు కూడా సమకూర్చటం జరిగిందని గుర్తుచేశారు. స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి గురజాలను పల్నాడు జిల్లాగా చేయటంలో కీలకంగా వ్యవహరించాలని యరతినేని కోరారు. పల్నాడును  జిల్లా చేసేందుకు ప్రతి ఒక్కరూ కార్యచరణ ప్రణాళికతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని యరపతినేని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-08-11T09:43:34+05:30 IST