ఏది సారూ నగదు!?

ABN , First Publish Date - 2022-05-19T04:41:55+05:30 IST

ఏప్రిల్‌ 4న రబీ సీజన ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. మే 17వ తేదీ నాటికి 13,380 మంది రైతుల నుంచి 2లక్షల 97వేల 144 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

ఏది సారూ నగదు!?
జలదంకి : ధాన్యం అమ్మి మూడు నెలలైనా ప్రొక్యూర్‌మెంట్‌ చేయలేదంటున్న కోదండరామాపురం రైతులు

ధాన్యం డబ్బు కోసం రైతుల గోడు

రూ.581 కోట్లలో పైసా విదల్చని ప్రభుత్వం

21 రోజుల్లో చెల్లిస్తామన్న సీఎం జగన

50 రోజులు గడుస్తున్నా రైతు ఖాతాల్లో జమ కాని నగదు

ఎప్పుడొస్తాయో కూడా చెప్పలేని దైన్యం

బియ్యం ట్రక్‌షీట్స్‌ విడుదలలో గందరగోళం

వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలోనే కర్షకుల  వేదన


 పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తాం. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం..!  ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అన్న మాటలివి. కానీ జిల్లాలో మాత్రం ఈ మాటలు ఆచరణకు నోచుకోలేదు. కొనుగోలు విషయంలోనే కాదు.. కొన్న ఽధాన్యానికీ డబ్బులు విదల్చడం లేదు. రబీ సీజనకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రారంభించి సుమారు 50 రోజులు అవుతున్నా ఇప్పటివరకు కొన్న ధాన్యానికి నగదు చెల్లించలేదు. మే 17వ తేదీ నాటికి 581 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎప్పుడు చెల్లిస్తారనే విషయంలోనూ క్లారిటీ లేదు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ధాన్యం పండించిన రైతలు దీనగాధ ఇది.


నెల్లూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : ఏప్రిల్‌ 4న రబీ సీజన ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. మే 17వ తేదీ నాటికి 13,380 మంది రైతుల నుంచి  2లక్షల 97వేల 144 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి  580.92 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. ముందుగా ధాన్యం విక్రయించిన 7,786 మంది రైతులకు సంబంధించి రూ.274 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలని జిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు చాలా రోజుల క్రితం ప్రతిపాదనలు పంపారు. అయినా అక్కడి నుంచి స్పందన లేదు. రైతులకు ధాన్యం బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారన్న ప్రశ్నకు సివిల్‌ సప్లయిస్‌ అధికారుల నుంచి ఖచ్చితమైన సమాధానం లేదు. నిధులు విడుదలైన వెంటనే చెల్లిస్తాం అనే సమాధానం తప్ప ఎప్పట్లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందో చెప్పలేకపోతున్నారు. 


మిల్లులో మగ్గుతున్న బియ్యం


మిల్లుల నుంచి గోదాముల్లోకి బియ్యం చేరితే ఎఫ్‌సీఐ నిధులు విడుదల చేస్తుంది. ఇందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నా సివిల్‌ సప్లయీస్‌ శాఖ ట్రక్‌ షీట్లు ఇవ్వడం లేదు. దీంతో మిల్లులో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ఎఫ్‌సీఐ గోదాములకు బియ్యం చేరని కారణంగా నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. అసలు తయారైన బియ్యాన్ని గోదాములకు తరలించడానికి సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ఎందుకు ట్రక్‌ షీట్లు ఇవ్వడం లేదనే ప్రశ్న పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. ఎఫ్‌సీఐతో చేసుకున్న ఒప్పదం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కోటా పూర్తి అయిపోయిందని, ఆ కారణంగానే సివిల్‌ సప్లయీస్‌ మిల్లర్లకు ట్రక్‌షీట్లు ఇవ్వలేకపోతోందనే అనుమానాలు మిల్లు యాజనమాన్యాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే రైతులకు నగదు చెల్లింపు మరింత ఆలస్యం అవుతుంది. 


సివిల్‌ సప్లయీస్‌ చేతివాటం


ఒకవైపు అమ్మిన ధాన్యానికి రైతులకు డబ్బులు అందక, సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించడానికి మిల్లర్లకు మార్గం దొరక్క అల్లాడుతుంటే సివిల్‌ సప్లయీస్‌ చెందిన కొంత మంది ఉద్యోగులు ఈ పరిస్థితులను క్యాష్‌ చేసుకొంటున్నారని మిల్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపాదడపా 5 లేదా 10వేల టన్నులకు పర్మిషన వస్తే దాన్ని రహస్యంగా నిమిషాల్లో తమ చేతులు తడిపిన మిల్లర్లకు మాత్రమే ట్రక్‌షీట్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


ఈ రైతు పేరు పసుపులేటి మల్లిఖార్జున. జలదంకి మండలం కోదండరామాపురం వాసి. రబీ సీజన్‌లో కావలికాలువ ఆయకట్టు కింద సొంత పొలం ఒకటిన్నర ఎకరంతోపాటు 41.5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. మూడుమాసాల క్రితం వరి కోత కోసి 120పుట్లకుపైగా ధాన్యం చినక్రాక రైతుభరోసా కేంద్రంలోవిక్రయించాడు. ఇప్పటికీ నగదు అందలేదు. పెట్టుబడి కోసం చేసిన రూ.10లక్షలకు నెలకు రూ.20వేలు వడ్డీ అవుతోంది. ఇటు వడ్డీ పెరిగిపోతుండగా, రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయని మల్లిఖార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


40 రోజులైనా ఇంకా అందలేదు!

అప్పు తెచ్చి పండించిన సుమారు 16 పుట్ల ధాన్యాన్ని 40 రోజుల క్రితం ఆర్‌బీకేకి తోలాను. ప్రభుత్వం సుమారు 2.25 లక్షలు  చెల్లించాలి. ఇంతవరకు ఒక్క పైసా కూడా జమకాలేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పునకు వడ్డీ పెరుగుతోంది  ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. 

 - కాళహస్తి జయరామయ్య, విడవలూరు



ధాన్యం విక్రయించి రెండు నెలలైంది!

ఇతని పేరు పంగులూరు శ్రీనివాసులు, అల్లూరు మండలం పురిణి పంచాయతీ మందిరం గ్రామం. రెండు నెలల క్రితం ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో 300 బస్తాల ధాన్యం విక్రయించాడు. అయితే, ఇప్పటికీ నగదు జమ కాలేదు. ఇతను ధాన్యం విక్రయించేనాటికి పుట్టి ధర బయటి మార్కెట్లో రూ.14,200 ఉంది. ప్రస్తుతం రూ.17 వేలు నుంచి 18 వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించి నెలలు గడుస్తున్నా లాభం లేదని, నిల్వ చేసుకున్నా ఫలితం దక్కేదని, కొనుగోలు కేంద్రంలో విక్రయించి తప్పు చేశానని శ్రీనివాసులు ఆవేదన చెందుతున్నాడు.


భయపెడుతున్న వాతావరణం


ఇప్పటికే తడిచిన ధాన్యానికి మొలకలు

మిల్లుల వద్ద కుప్పలుతెప్పలుగా వడ్ల బస్తాలు

తడిసిన ధాన్యం కొనుగోలుకు ఒత్తిడి

ససేమిరా అంటున్న మిల్లర్లు

కాదంటే దాడులు తప్పవంటున్న అధికారులు


కావలి, మే 18 :  కావలి, కందుకూరు డివిజన్లలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు, మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈ క్రమంలో బుధవారం మబ్బులు, ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘావృతమైంది. దీంతో ఎక్కడ వర్షం కురుస్తుందోనని రైతులు, మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యం నట్టులకు ఒక పక్క మొలకలు వచ్చాయి. మరో పక్క ధాన్యం కళ్లాల్లో ఆరబోసుకుని ఎండపెట్టుకున్న రైతులు కొనుగోళ్లు లేక అల్లాడుతున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రజాప్రతినిఽధులు, నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు తడిచిన ధాన్యం మిల్లులు దించుకునేట్లుగా చూడాలని  స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మిల్లు వద్ద తడిచిన ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, మళ్లీ ధాన్యం తీసుకోవాలంటే తమ వల్ల కాదని మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. ధాన్యం దించుకోకపోతే మిల్లులపై దాడులు చేసి కేసులు పెట్టాల్సి వస్తుందని అధికారులు  హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఇది కావలి ప్రాంతంలోని రైసుమిల్లర్లు, రైతుల దుస్థితి.


మిల్లర్లకు జేసీ ఆదేశాలు


ఇటీవల కురిసిన వర్షాలకు కావలి డివిజనతోపాటు, కందుకూరు డివిజనలో ఎక్కువగా ధాన్యం తడిచి పోయింది. కందుకూరు ప్రాంతంలో రైస్‌మిల్లులు లేనందున అక్కడ ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత అంతా కావలి మిల్లులపై పడింది, ఇటీవల జేసీ ఉలవపాడు ప్రాంతంలో పర్యటించి అక్కడ తడిచిన ధాన్యాన్ని చూచి వెంటనే వాటిని కావలి మిల్లర్లు దించుకునేలా చూడాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో రైతుల నుంచి నిత్యం పౌరసరఫరాలశాఖ అధికారులకు  ధాన్యం తీసుకోమని ఫోన్లు వస్తున్నాయి. అధికారులు  కూడా మిల్లర్లకు ఫోన చేస్తున్నారు. ఉన్న ధాన్యం ఏమి చేయాలో అర్థం కాక తాము అల్లాడుతున్నామని, మళ్లీ ఆకాశం మేఘావృతమై ఏక్షణాన వర్ష వస్తుందో తెలియక తాము ఆందోళన చెందుతున్నామని మిల్లర్లు వాపోతు న్నారు. తడిచిన ధాన్యం నెల్లూరు బాయిలర్‌ మిల్లులకు పంపకుండా తమను వేధించటమేమిటని మిల్లర్లు వాపోతు న్నారు. మీరు రైతలు వద్ద అనధికారికంగా తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకునే విఽధంగా తాము ట్యాగింగ్‌ ఇచ్చి తాము సహకరిస్తున్నపుడు తాము చెప్పిన ధాన్యాన్ని ఎందుకు దించుకోరని  అధికారులు మిల్లర్లను ప్రశ్నిస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్లలో రైతులు, మిల్లర్లు పరిస్థితి అంతా  అస్తవ్యస్తంగా ఉంది.



Updated Date - 2022-05-19T04:41:55+05:30 IST