ఏది అసలు.. ఏది నకలు

ABN , First Publish Date - 2022-01-15T04:20:22+05:30 IST

జిల్లాలో సింహభాగం వరి సాగవుతోంది. గడిచిన మూడేళ్ల నుంచి గరిష్ఠ విస్తీర్ణంలో సాగు జరుగుతోంది.

ఏది అసలు..  ఏది నకలు
నిషేధిత మిక్సింగ్‌ ఎరువులను పట్టుకున్న విజిలెన్స అధికారులు(ఫైల్‌)

జిల్లాలో విచ్చలవిడిగా నిషేధిత ఎరువులు, మందులు

నూజివీడు టు నెల్లూరుకు రవాణా

తగ్గుతున్న దిగుబడులు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు

మేల్కొనకపోతే అందరికీ ప్రమాదం


జిల్లాలోని రైతాంగానికి నాసిరకం గండం పొంచి ఉంది. నాణ్యత లేని ఎరువులు, పురుగు మందులను రైతులకు అంటగడుతూ కొందరు జేబులు నింపుకుంటున్నారు. ఈ మందులు వాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  మరోవైపు ఆ నాసిరకం ఎరువులు, మందుల ద్వారా పండిన పంటను తిని ప్రజలు అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వరి పంట దిగుబడి దశలో ఉంది. ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రమే ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమార్కుల కన్ను జిల్లాపై పడింది. ప్రభుత్వం నిషేధించిన ఎరువులు, పురుగు మందులను గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు చేరుస్తున్నారు. జిల్లాలోని కొందరు డీలర్లు ఆ నాసిరకం ఫర్టిలైజర్లను రైతులకు అంటగడుతున్నారు. 


నెల్లూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సింహభాగం వరి సాగవుతోంది. గడిచిన మూడేళ్ల నుంచి గరిష్ఠ విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. పుష్కలంగా నీరు కూడా లభ్యమవుతుండటంతో రెండు కార్లు సాగు జరుగుతున్నాయి. దీనిని అక్రమార్కులు అదునుగా మలుచుకుంటున్నారు. నాసిరకం ఎరువులు, పురుగు మందులను కొందరు డీలర్లకు ఎక్కువ పర్సంటేజీ ఇస్తూ వారి చేత విక్రయిస్తున్నారు. గడిచిన కొన్ని సీజన్ల నుంచి ధాన్యం దిగుబడి తగ్గుతోంది. గతంలో ఎకరానికి నాలుగు పుట్ల వరకు దిగుబడి వస్తుండగా ఇప్పుడు మూడు పుట్లు కావడం కష్టంగా మారుతోంది. సాంకేతికత పెరుగుతున్నప్పుడు దిగుబడి పెరగాల్సింది పోయి తగ్గుతుండటం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. నాసిరకమైన ఎరువులు, పురుగు మందుల వాడకం మూలంగా ఆ ప్రభావం ధాన్యం దిగుబడిపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


నూజివీడు టు నెల్లూరు


మూడేళ్ల క్రితం వరకు కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి రాష్ట్రంలో అనుమతులుండేవి. అయితే ఈ మిక్సింగ్‌ ఎరువుల తయారీల్లో నాణ్యత పాటించడం లేదు. పలుచోట్ల అధికారులు మిక్సింగ్‌ ఎరువులను తనిఖీలు చేసి ల్యాబ్‌లలో పరిశీలించినప్పుడు నాణ్యత లేదని తేలింది. ఉదాహరణకు 20-20-11 రకం ఎరువు అంటే అందులో 20 శాతం యూరియా, ఇరవై శాతం ఫాస్పరస్‌, 11 శాతం పొటాష్‌ మిశ్రమం ఉండాలి. కానీ ఆ స్థాయిలో రాష్ట్రంలో తయారవుతున్న కాంప్లెక్స్‌ ఎరువులు ఉండటం లేదు. ఈ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో మిక్సింగ్‌ ప్లాంట్ల అనుమతులు రద్దు చేసింది. దీంతో పదుల సంఖ్యలో ఆ పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల దొంగచాటుగా ఈ నాసిరకమైన ఎరువులను తయారు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కొడవలూరు దగ్గర విజిలెన్స అధికారులు ఓ ఎరువుల లారీని పట్టుకున్నారు. వాటిని పరిశీలించగా నిషేధిత ఎరువులు కావడంతో తయారీదారులు, జిల్లాకు సరఫరా చేస్తున్న డీలర్‌పై కేసు నమోదు చేశారు. ఈ మిక్సింగ్‌ ఎరువులు కృష్ణా జిల్లా నూజివీడులోని సావియో బయో ఆర్గానిక్‌ ఫర్టిలైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో తయారైనట్లు గుర్తించారు. వాటిని కోవూరు మండలం పాటూరుకు చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఫర్టిలైజర్స్‌ డీలర్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి వారిద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే నూజివీడు నుంచి నెల్లూరు వరకు ఆ నిషేధిత ఎరువులు వచ్చాయంటే ఇక ఎన్ని జిల్లాలకు సరఫరా అయ్యాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే జిల్లాకు ఎంత సరుకు చేరిందన్నది ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాగా ఇటీవల దొరవారిసత్రం మండలంలో ఓ రైతు ఓ కంపెనీకి చెందిన పురుగు మందును ఉపయోగించగా పంట మొత్తం దెబ్బతిన్నది. నిషేధిత గ్లైఫోసెట్‌ కలుపు మందును నిషేధించినప్పటికీ గడిచిన మూడేళ్లుగా జిల్లాలో అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమవ్వాల్సిన అవసరముంది. అప్పుడప్పుడు విజిలెన్స అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం దాడులు చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ ఉద్యోగుల నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు తరచూ తనిఖీలు చేస్తేనే నాసిరకం గండం నుంచి రైతులను రక్షించగలుగుతామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-01-15T04:20:22+05:30 IST