వ్యాక్సిన్‌కు ఏడాది

ABN , First Publish Date - 2022-01-18T06:01:17+05:30 IST

కరోనా తొలి దశలో జనం భయం భయంగా బతుకీడ్చారు. అన్ని రంగాలు కుదేలై జనజీవనం అతలాకుతలమైంది. ఈ సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతోపాటు, కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ రూపకల్పన విజయవంతమైంది. రెండో దశ కరోనా సమయానికి వ్యాక్సిన్‌ వచ్చింది.

వ్యాక్సిన్‌కు ఏడాది

నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా తొలి దశలో జనం భయం భయంగా బతుకీడ్చారు. అన్ని రంగాలు కుదేలై జనజీవనం అతలాకుతలమైంది. ఈ సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతోపాటు, కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ రూపకల్పన విజయవంతమైంది. రెండో దశ కరోనా సమయానికి వ్యాక్సిన్‌ వచ్చింది. 2021, జనవరి 16న వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా, ఏడాది పూర్తయింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఊరట చెందారు. ప్రారంభంలో టీకాపై ప్రజలకు అపనమ్మకం, వ్యాక్సిన్‌ వేసుకుంటే రక్తం గడ్డకడుతుందని, ప్రాణాలు పోతున్నాయని ప్రచారం రావడంతో కొంత వెనుకంజ వేశారు. రెండో దశలో కరోనాతో ప్రాణాలు పోవడమేగాక, చాలా మంది పరిస్థితి విషమించడంతో భయాందోళన చెందిన ప్రజలు టీకా వేయించుకునేందుకు పరుగులు పెట్టారు. ఒకానొక దశలో ప్రజలు గంటలకొద్దీ క్యూలో నిలబడి టీకా వేయించుకున్నారు. ఆ తరువాత కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌ టీకా డోసులు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తొలుత కేవలం హెల్త్‌కేర్‌ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి టీకా వేయడం ప్రారంభించి ఆ తర్వాత 60ఏళ్లు పైబడిన వారందరికీ వేశారు. అనంతరం 45 ఏళ్లు దాటిన వారికి టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈనెల 3వ తేదీ నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో పాటు ఈనెల 10వ తేదీ నుంచి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.


ఉమ్మడి జిల్లాలో ఇలా

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా టీకా విషయం లో తొలుత అపనమ్మకంతో కార్యక్రమం మందకొడిగా సాగింది. ఆ తరువాత టీకాపై అవగాహన పెరగడంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో మొదటి డోస్‌ 23,61,962 మంది వేయించుకున్నారు. అందులో యాదాద్రి జిల్లాలో మొదటి డోస్‌ 5,62,311 మంది కి, సూర్యాపేట జిల్లాలో 5,52,318 మందికి, నల్లగొండ జిల్లాలో 12,47,333 మందికి మొదటి డోస్‌ టీకా వేశారు. రెండో డోస్‌ మూడు జిల్లాల్లో 18,18,080 మందికి వేశారు. వీటిలో యాదాద్రి జిల్లాలో 4,45,257 మందికి, సూర్యాపేట జిల్లాలో 5,63,659 మందికి, నల్లగొండ జిల్లాలో 8,09,164 మందికి వేశారు. బూస్టర్‌ డోస్‌ ఉమ్మడి జిల్లాలో 9,623 మందికి వేయగా, అందులో యాదాద్రి జిల్లాలో 1,640, సూర్యాపేట జిల్లాలో 2,765, నల్లగొండ జిల్లాలో 5,218 మందికి వేశారు. ఇదిలా ఉంటే 15-18ఏళ్ల లోపు పిల్లలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,05,020 మందికి టీకా వేశారు.


వైర్‌సను ఎదుర్కొనే శక్తి వ్యాక్సిన్‌కే ఉంది  : కొండల్‌రావు, నల్లగొండ డీఎంహెచ్‌వో

ఎటువంటి వైర్‌సనైనా ఎదుర్కొనే శక్తి వ్యాక్సిన్‌కు ఉంది. వ్యాక్సిన్‌తో 85-90శాతం వరకు రక్షణ ఉంటుంది. మొదటి, రెండో డోస్‌ వేసుకున్న వారు ఆరు నెలల తరువాత బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలి. ఒమైక్రాన్‌ లక్షణాలు గొంతు భాగం వరకే ఉంటాయి. ఈ వైరస్‌ వ్యాప్తి చెందినప్పటికీ ప్రాణాంతకం కాదు. కరోనా పెరిగితేనే టీకా కోసం వస్తున్నారు. అలాకాకుండా రెండు డోసుల వ్యాక్సిన్‌తోపాటు, సకాలంలో బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలి. అప్పుడే రక్షణ కలుగుతుంది.       


ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు టీకా ఇలా..

జిల్లా మొదటి డోస్‌ రెండో డోస్‌ బూస్టర్‌ 15-18 పిల్లలకు

నల్లగొండ 12,47,333 8,09,164 5,218 46,091

సూర్యాపేట 5,52,318 5,63,659 2,765 30,200

యాదాద్రి 5,62,311 4,45,257 1,640 28,729

మొత్తం 23,61,962 18,18,080 9,623 1,05,020

Updated Date - 2022-01-18T06:01:17+05:30 IST