యడ్డి మార్పు ఖాయం?

ABN , First Publish Date - 2021-07-22T07:19:01+05:30 IST

కర్ణాటకలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ..

యడ్డి మార్పు ఖాయం?

  • మారుతున్న పరిణామాలు
  • కర్ణాటకలో గుంభనంగా మారిన రాజకీయం


బెంగళూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 26తో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో 25న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఇది వారం రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే.. హఠాత్తుగా ఈ విందుకు బ్రేక్‌ పడింది. విందు, వినోదాలు వంటివి ఏమీ లేవని తాజాగా ప్రకటన జారీ చేశారు. అంతేకాదు, 26న సోమవారం రెండేళ్ల పాలనపై ‘సాధన’ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నామని.. విధాన సౌధలోని బ్యాంకెట్‌హాల్‌లో ఈ కార్యక్రమం సాదాసీదాగానే జరుగుతుందని చీఫ్‌విప్‌ సునీల్‌కుమార్‌ బుధవారం మీడియాకు తెలిపారు. కాగా, మంత్రి శ్రీరాములుకు అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపువచ్చింది. ఈ నెల 26 తర్వాత సీఎం మార్పు తప్పదనే సంకేతాలు వెలువడుతుండడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎలాంటి పిలుపు లేకుండానే హస్తినబాట పట్టారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య ఢిల్లీ బయల్దేరారు.

Updated Date - 2021-07-22T07:19:01+05:30 IST