వైసీపీవి పోంజీ స్కీమ్‌లు

ABN , First Publish Date - 2022-08-15T08:39:30+05:30 IST

వైసీపీవి పోంజీ స్కీమ్‌లు

వైసీపీవి పోంజీ స్కీమ్‌లు

ప్రజల్ని అత్యాశకు గురిచేసి, ముంచేస్తాయి

ఏపీలో త్వరలో శ్రీలంక పరిస్థితులు: పవన్‌ కల్యాణ్‌


అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘‘మనుషుల్ని అత్యాశకు గురి చేసి, ముంచేసే పోంజీ స్కీమ్‌లను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలన్నీ పోంజీ స్కీమ్స్‌ తరహాలోనివే. అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధం చేస్తామని, వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని, యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉచితంగా ఇసుక అందిస్తామని హామీలు గుప్పించారు. ప్రజల ఆశలతో ఆటలాడుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పోంజీ స్కీమ్‌లను నడిపిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలి’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘నేను ఏదో అద్భుతాలు జరిగిపోతాయని పార్టీ పెట్టలేదు. దెబ్బలు తిన్నా ప్రజల కోసం నిలబడాలని రాజకీయాల్లోకి వచ్చా. మనల్ని వెతుక్కుంటూ పదవి రావాలి తప్ప... దాని వెంట మనం పడకూడదు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదని.. సంక్షేమం పేరుతో అభివద్ధిని విస్మరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తుంది. ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, మరో తరాన్ని మేల్కొల్పడానికి జనసేన పార్టీని స్థాపించా. ఒక ఎలక్షన్‌ కోసమైతే పార్టీలోకి రావొద్దు. ఒకవైపు సుప్రీం కోర్టు.. మరోవైపు కాగ్‌ చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అతి త్వరలో ఏపీలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు. అక్కడ వరకూ రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఐటీ అభివద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. విభజన తర్వాత సీమ యువత హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వలసపోతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఏ ఒక్కరూ బయటకు వలస వెళ్లే పరిస్థితి ఉండదు. ఐటి పరిశ్రమను ఇక్కడే అభివద్ధి చేస్తాం’’ అని పవన్‌ అన్నారు. 

Updated Date - 2022-08-15T08:39:30+05:30 IST