YCP ప్లీనరీకి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-07-07T23:38:40+05:30 IST

వైసీపీ (YCP) ప్లీనరీకి సర్వం సిద్ధం చేశారు. గురువారం ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదుట మైదానంలో ప్లీనరీని నిర్వహిస్తున్నారు. సమావేశ ఏర్పాట్లను

YCP ప్లీనరీకి సర్వం సిద్ధం

అమరావతి: వైసీపీ (YCP) ప్లీనరీకి సర్వం సిద్ధం చేశారు. గురువారం  ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదుట మైదానంలో ప్లీనరీని నిర్వహిస్తున్నారు. సమావేశ ఏర్పాట్లను వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), మంత్రులు పరిశీలించారు. ప్లీనరీ ఏర్పాట్ల కోసం 20 కమిటీలను సీఎం జగన్‌ (CM Jagan) నియమించారు. గ్రామ వార్డు సభ్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ పేరు పేరునా అందరికీ సీఎం లేఖలు పంపారు.  తొలి రోజు ప్రతినిధుల సభ.. రెండో రోజు విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది.  హామీల అమలు, నవరత్నాలు, మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చిస్తారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు విపక్ష టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమౌతున్న నేపథ్యంలో... ఒకవిధమైన ఒత్తిడితో కూడుకున్న వాతావరణంలో వైసీపీ ప్లీనరీ జరగనుంది.


బలవంతపు ‘బస్సులు’

‘మహానాడు’కు ఏమాత్రం తగ్గకుండా... వైసీపీ ప్లీనరీకి కనీసం నాలుగు నుంచి ఆరు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. జనాల తరలింపునకు వాహనాలు ఇవ్వాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపైనా ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కో వార్డు/మండలం/గ్రామానికి బస్సులను పంపించి వాటిల్లో జనాన్ని తరలించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. వైసీపీ తరఫున నేరుగా రవాణా శాఖ అధికారులే రంగంలోకి దిగారు. 700 బస్సులు సేకరించేందుకు వీలుగా సిటీ బస్సు ఆపరేటర్లు, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు ఫోన్లు చేశారు. గుంటూరు నగరంలో ప్రైవేటు సిటీ బస్సులు 50 ఉండగా వాటిని శనివారం ఉదయం రవాణాశాఖ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి అప్పగించాలని యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే భవిష్యత్‌లో కేసులు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పంపారు.

Updated Date - 2022-07-07T23:38:40+05:30 IST