Vamsiతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు: దుట్టా

ABN , First Publish Date - 2022-05-20T03:16:29+05:30 IST

గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుపై తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు

Vamsiతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు: దుట్టా

విజయవాడ: గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుపై తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు గోసుల శివభరత్‌ రెడ్డితోపాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి సుమారు 2 గంటలపాటు ఇరువర్గాల వారితో వేర్వేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా వంశీ అక్రమాలపై దుట్టా వర్గం ఓ నివేదికను సజ్జలకు అందజేసినట్టు సమాచారం. పంచాయతీ అనంతరం దుట్టా రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. గన్నవరం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను సజ్జలకు వివరించామని తెలిపారు. వైసీపీ పాత కేడర్‌ను వంశీ కలుపుకొని పోవడం లేదని, వారిని తొక్కేస్తున్నారని సజ్జలకు తెలిపామని చెప్పారు. వంశీ వల్ల తాము చాలాఇబ్బందులు పడుతున్నామని, కలిసి పనిచేయలేమని స్పష్టం చేశామని దుట్టా వెల్లడించారు. 


తాను 50 ఏళ్లుగా వైఎస్‌తోను ఆయన కుటుంబంతోను కలిసి నడుస్తున్నానని, కానీ ఎప్పుడూ తమ కుటుంబం పదవులు ఆశించలేదని దుట్టా పేర్కొన్నారు. వంశీ వచ్చినప్పటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వంశీతో ఇమడ లేక రెండేళ్లపాటు మౌనంగా దూరంగా ఉండిపోయామన్నారు. కానీ నన్ను నా నియోజకవర్గంలో నిత్యం అవమానాలకు గురి చేస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అణచివేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇన్‌చార్జిగా వంశీని మార్చాలని సజ్జలను కోరామన్నారు. వంశీతో మాట్లాడి మరోసారి పిలుస్తామని సజ్జల చెప్పారని, ఏం జరుగుతుందో.. పార్టీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని దుట్టా తెలిపారు. సీఎం పేషీ నుంచి బయటకు వచ్చిన వెంటనే వంశీ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-20T03:16:29+05:30 IST