ఒత్తిడిలో వైసీపీ!

ABN , First Publish Date - 2022-07-07T07:47:42+05:30 IST

ఒత్తిడిలో వైసీపీ!

ఒత్తిడిలో వైసీపీ!

రేపు, ఎల్లుండి ప్లీనరీ సమావేశాలు

విజయవంతంపై కసరత్తు

నేతల్లో అసంతృప్తి.. శ్రేణుల్లో నైరాశ్యం

అడ్డదారిలో జన సమీకరణకు ఏర్పాట్లు

బలవంతంగా బస్సుల సేకరణ

నియోజకవర్గాలవారీగా టార్గెట్లు

వైసీపీపై ‘మహానాడు’ ప్రభావం!

సీఎం రాక.. పులివెందుల్లోనూ బారికేడ్లు

వేంపల్లెలో సైతం రోడ్లపై కంచెలు

జనం నిలదీస్తారని ముందుజాగ్రత్త


(అమరావతి/గుంటూరు - ఆంధ్రజ్యోతి)

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు విపక్ష టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమౌతున్న నేపథ్యంలో... ఒకవిధమైన ఒత్తిడితో కూడుకున్న వాతావరణంలో వైసీపీ ప్లీనరీ జరగనుంది. వైఎస్‌ జయంతి (జూలై 8)సందర్భంగా శుక్రవారం, శనివారం గుంటూరు జిల్లా కాజ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సన్నాహకంగా నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో ‘ప్లీనరీ’లు జరిపారు. చాలాచోట్ల వేదికలు నేతలతో నిండిపోగా... సమావేశ మందిరాలు కార్యకర్తలు లేక  వెలవెలబోయాయి. వచ్చిన వాళ్లు వెనక్కి తిరిగి వెళ్లకుండా కొన్నిచోట్ల గేట్లకు తాళాలు కూడా వేశారు. చాలా ‘ప్లీనరీ’లలో ఎమ్మెల్యే స్థాయి నేతలు సైతం అసంతృప్తి గళం వినిపించారు. మరీ ముఖ్యంగా... కార్యకర్తలకు బిల్లులు చెల్లించలేకపోవడం, సంక్షేమ పథకాల్లో లొసుగులు, అభివృద్ధి పనులు ఆగిపోవడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చారు. జిల్లా, నియోజకవర్గస్థాయి ప్లీనరీలు విఫలమైన నేపథ్యంలో... రాష్ట్రస్థాయి ప్లీనరీపై వైసీపీ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది. ప్లీనరీకి హాజరు కావాలనే ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో కనిపించడంలేదు.


విజయవంతం చేయడమెలా?

బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్లీనరీ ఏర్పాట్లపై ముఖ్యనేతలతో సమీక్షించారు. ప్రధానంగా జన సమీకరణపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. అధికార పార్టీ హోదాలో జరుగుతున్న ప్లీనరీకి భారీగా జనసమీకరణ జరగాలని జగన్‌ ఆదేశించినట్లు సమాచారం.  పార్టీ అధ్యక్షుడి నుంచి కిందిస్థాయి వరకూ భోజన ఏర్పాట్లు ఒకేలా ఉండేలా చూడాలని జగన్‌ సూచించారు. ఆహార ఏర్పాట్లలో ఏమాత్రం తేడా వచ్చినా దాని ప్రభావం తీ వ్రంగా ఉంటుందని గుర్తించాలని ముఖ్యనేతలకు స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణపై తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రభావం బాగా కనిపిస్తోందని ఆ పార్టీ వర్గా లు పేర్కొంటున్నాయి. ఒక విధంగా మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాల ఆధారంగానే ప్లీనరీలో ఎవరెవరు ఏమేమి మాట్లాడాలన్నది ఖారారు చేశారని చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న విపక్షాలపై ఎదురుదాడి చేయడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు.


బలవంతపు ‘బస్సులు’

‘మహానాడు’కు ఏమాత్రం తగ్గకుండా... వైసీపీ ప్లీనరీకి కనీసం నాలుగు నుంచి ఆరు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. జనాల తరలింపునకు వాహనాలు ఇవ్వాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపైనా ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కో వార్డు/మండలం/గ్రామానికి బస్సులను పంపించి వాటిల్లో జనాన్ని తరలించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. వైసీపీ తరఫున నేరుగా రవాణా శాఖ అధికారులే రంగంలోకి దిగారు. 700 బస్సులు సేకరించేందుకు వీలుగా సిటీ బస్సు ఆపరేటర్లు, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు ఫోన్లు చేశారు. గుంటూరు నగరంలో ప్రైవేటు సిటీ బస్సులు 50 ఉండగా వాటిని శనివారం ఉదయం రవాణాశాఖ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి అప్పగించాలని యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే భవిష్యత్‌లో కేసులు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. ఒక్కో రవాణా ఇన్‌స్పెక్టర్‌కి 50 బస్సులు టార్గెట్‌ పెట్టడంతో వారి పరిధిలో స్కూళ్లు, కళాశాలలు, ప్రైవేటు ట్రావెల్స్‌ ఏజెన్సీల వద్దకు వెళ్లి బస్సులు పెట్టాలని కోరుతున్నారు. ఎలాంటి అద్దె చెల్లించబోమని ముందే స్పష్టం చేస్తున్నారు. మే నెల ఆఖరులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగినప్పుడు సిటీ బస్సులతో సహా విద్యా సంస్థల బస్సులేవీ టీడీపీ కార్యక్రమానికి ఇవ్వకూడదని రవాణాశాఖ అధికారులు తేల్చి చెప్పారు. విద్యా సంస్థల అవసరాలకు కాకుండా మరే ఇతర అవసరాలకు వినియోగించబోమని బాండ్‌లు తీసుకొన్నారు. మరి... ఇప్పుడు వైసీపీ కార్యక్రమానికి బస్సులు ఎలా ఇస్తామని ప్రశ్నించినా ఫలితం లభించడంలేదు. 


ప్లీనరీ... ఇది మూడోసారి!

వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మూ డో ప్లీనరీ ఇది.  తొలుత... 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో  నిర్వహించారు. ఆ తర్వాత ఆరేళ్లకు 2017 జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా కాజ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్లీనరీ జరిగింది. ఈసారి కూడా ఇదే ప్రాంగణంలో పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి... మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విశాఖలో ప్లీనరీని నిర్వహిస్తారని భావించారు. కానీ... నాగార్జున వర్సిటీకి ఎదురుగా గతంలో నిర్వహించిన ప్లీనరీ తర్వాతే అధికారంలోకి వచ్చామన్న సెంటిమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.


ప్లీనరీ జరిగేదిలా... 

ప్లీనరీ అజెండాను బుధవారం ఖరారు చేశారు. దీని ప్రకారం... శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. 10.10 గంటలకు జగన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత  వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగన్‌ పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. 10.50 గంటలకు పార్టీ అధ్యక్షుని ఎన్నిక ప్రకటనను పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేస్తారు. ఉదయం 11 గంటలకు జగన్‌ ప్రసంగిస్తారు. శుక్రవారం మహిళా సాధికారత - దిశ, విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ, వైద్యం, పరిపాలనలో పారదర్శకత... అనే ఐదు అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టి ఆమోదిస్తారు. శనివారం ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి  పాల్గొంటారు. జగన్‌ ముగింపు ఉపన్యాసం చేస్తారు.

Updated Date - 2022-07-07T07:47:42+05:30 IST