వైసీపీలోకి రాకుంటే జేసీబీలే!

ABN , First Publish Date - 2021-06-14T08:29:58+05:30 IST

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్న ఓ వైసీపీ సీనియర్‌ నేతకు మార్గం సుగమం చేయడానికి ఇక్కడి అత్యున్నత విద్యా సంస్థ అధిపతి ఒకరు శతవిధాలుగా

వైసీపీలోకి రాకుంటే జేసీబీలే!

మీ లొసుగులన్నీ మాకు తెలుసు

అవి బయటపెడితే మీకు ఇబ్బందులే!

విశాఖ టీడీపీ కార్పొరేటర్లకు ఉన్నత 

విద్యాసంస్థ అధిపతి బెదిరింపులు?

సీనియర్‌ నేత తరఫున ప్రలోభాలు

వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు

సదరు వైసీపీ నాయకుడి యత్నాలు

ఈ క్రమంలోనే టీడీపీ నేతలకు వల

లొంగకుంటే భవనాల ధ్వంసం

మద్యం వ్యాపారాలు దెబ్బతీసేందుకు అధికారులతో బెదిరింపులు

అక్రమాలున్నాయంటూ కేసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్న ఓ వైసీపీ సీనియర్‌ నేతకు మార్గం సుగమం చేయడానికి ఇక్కడి అత్యున్నత విద్యా సంస్థ అధిపతి ఒకరు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ నేత ఆలోచనలను సాకారం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులను ఎలాగైనా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కార్పొరేటర్లుగా గెలిచిన వారిని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇంకో రెండు సార్లు వైసీపీయే అధికారంలోకి వస్తుందని.. అన్నీ తాను చూసుకుంటానని, వైసీపీలోకి వచ్చేయాలని అడుగుతున్నారు.


అధికారంలో ఉండే పార్టీలో ఉంటే అందరికీ ఉపయోగకరమని, పైగా ఇప్పుడు వైసీపీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇప్పిస్తామని హామీలిస్తున్నారు. అయితే తాము తెలుగుదేశాన్ని వీడి రాలేమని, తమ విజయానికి పార్టీయే కారణమని కొందరు కార్పొరేటర్లు చెబితే.. వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారు. ‘మీరు చేస్తున్న వ్యాపారాలు ఏమిటో.. అందులో లొసుగులు ఏమిటో మాకు తెలుసు. వాటికి సంబంధించిన పత్రాలు అన్నీ మా దగ్గరున్నాయి. వాటిని బయట పెడితే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారు’ అని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఓ కార్పొరేటర్‌ను ఆయన రెండు రోజుల క్రితం ఇలాగే బెదిరించారు. ‘మీరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు కదా! మీరు కట్టిన అపార్ట్‌మెంట్‌కు ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఎందుకు రాలేదో తెలుసా! మేమే ఆపించాం. మీరు వైసీపీలోకి వస్తే.. ఆ సర్టిఫికెట్‌ వస్తుంది. లేదంటే.. అందులో అక్రమాలు ఉన్నాయని చర్యలు తీసుకుంటారు. ఆలోచించుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం’ అని హెచ్చరించారు. ఏం చేయాలో ఆ కార్పొరేటర్‌కు అర్థంకాలేదు. వైసీపీలోకి వెళ్లకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని.. అలాగని ఆ పార్టీలోకి వెళ్లలేమని.. ఇలాంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదని వాపోతున్నారు.


జేసీబీలు సిద్ధం..

గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకురావాలని అధికార పార్టీలో అనేక మంది ప్రయత్నించారు. ఆయన లొంగలేదు. దాంతో ఆయనపై కక్ష కట్టారు. ఆయన గాజువాక జంక్షన్‌లో నిర్మిస్తున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఓ తెల్లవారుజామున జేసీబీతో భవనాన్ని కూలగొట్టారు. అక్కడితో ఆగకుండా ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ మానసికంగా వేధిస్తున్నారు. మొన్నటి జీవీఎంసీ ఎన్నికల్లో గాజువాకలో టీడీపీ తరఫున 8 మంది కార్పొరేటర్లు గెలిచారు.


వారిని ఎలాగైనా వైసీపీలోకి లాగాలని చూస్తున్నారు. వారిలో ఒకరు.. ఎన్నికలైన మర్నాటి నుంచే గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన ఏడుగురినీ సదరు విద్యాసంస్థ అధిపతి ప్రోద్బలంతో ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. వారి వ్యాపారాలు దెబ్బతీసే విధంగా అధికారులతో బెదిరిస్తున్నారు. మద్యం వ్యాపారంలో ఉన్న వారిపై కేసులు బనాయించారు. అయినా దారికి రాకపోవడంతో వారి బార్లకు సమీపంలో కొత్తగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయించారు. ఇలా అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెంచి పార్టీలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.


రాజీనామా చేసి వెళ్లాలన్న కార్యకర్తలు

ఈ వేధింపులు భరించలేక గాజువాకలోని కొందరు టీడీపీ కార్పొరేటర్లు.. సన్నిహితంగా మెలిగే కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీలోకి రమ్మని ఒత్తిళ్లు వస్తున్నాయని.. ఏం చేయమంటారని ప్రశ్నించారు. దానికి వారు ససేమిరా అన్నారు. ‘మీ అంతట మీరు గెలవలేదు. ఇంత వేవ్‌లో కూడా గెలిచారంటే.. అది టీడీపీ బలం. వెళ్లాలనుకుంటే రాజీనామా వెళ్లండి’ అని తెగేసి చెప్పేశారు. వెంట ఎవరూ రారని, ఒక్కరే వెళ్లాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. ‘అయినా.. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. మీరు వెళ్లి ఏం చేస్తారు’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో ఆ కార్పొరేటర్లు పునరాలోచనలో పడ్డారు. అయినా వారిని వైసీపీలోకి లాగేసే యత్నాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-06-14T08:29:58+05:30 IST