నయానో..భయానో!

ABN , First Publish Date - 2021-03-01T05:37:15+05:30 IST

స-కాశీబుగ్గ మునిసిపాల్టీలో వైసీపీ ఆకర్ష్‌ ప్రయత్నాలు సాగాయి. ఇందులో కొంతవరకూ సఫలీకృతమైనా..తెలుగుదేశం నాయకులు అప్రమత్తం కావడంతో ఆ నలుగురితోనే వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు మునిసిపాల్టీలోని అన్ని వార్డులను ఏకగ్రీవం చేసేలా అధికార పక్షం స్కెచ్‌ వేసింది. అందులో భాగంగా తమకు అనుకూలంగా ఉన్న ఆరుగురు

నయానో..భయానో!


వార్డులన్నీ ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ స్కెచ్‌

టీడీపీ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం

మూడు వార్డుల్లో డమ్మీలే అభ్యర్థులు

ఒక్కచోట బీజేపీ అభ్యర్థికి మద్దతు

రసవత్తరంగా పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ పోరు

(పలాస)

‘నేరుగా విపక్ష అభ్యర్థుల ఇళ్లకు వెళ్లడం.. వారిని నయానో భయానో దారిలోకి తెచ్చుకోవడం..ఎదురుతిరిగితే బెదిరింపులకు దిగడం’..ఇలా కొద్దిరోజులుగా పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో వైసీపీ ఆకర్ష్‌ ప్రయత్నాలు సాగాయి. ఇందులో కొంతవరకూ సఫలీకృతమైనా..తెలుగుదేశం నాయకులు అప్రమత్తం కావడంతో ఆ నలుగురితోనే వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు మునిసిపాల్టీలోని అన్ని వార్డులను ఏకగ్రీవం చేసేలా అధికార పక్షం స్కెచ్‌ వేసింది. అందులో భాగంగా తమకు అనుకూలంగా ఉన్న ఆరుగురు టీడీపీ అభ్యర్థులపై గురిపెట్టింది. అందులో నలుగురు వైసీపీ వలకు చిక్కడంతో వ్యూహాత్మకంగా పార్టీలో చేర్చుకుంది. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసి మిగతా టీడీపీ అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన తెలుగుదేశం నాయకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వ్యూహాన్ని మార్చి మిగిలిన తమ పార్టీ అభ్యర్థులతో పాటు వైసీపీ గూటికి చేరిన వారితో పాటు నామినేషన్లు వేసిన డమ్మీ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చి రహస్య ప్రాంతాలకు తరలించారు.  లేకుంటే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకునేది.


‘ఆకర్ష్‌’ బాధ్యతలు ఆరుగురికి..

విపక్ష అభ్యర్థుల ‘ఆకర్ష్‌’కు వైసీపీ ఆరుగురు యువ నేతలను రంగంలోకి దించింది. వారు గత కొద్దిరోజులుగా పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. నేరుగా అభ్యర్థుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేసినట్టు తెలుస్తోంది. అందుకు వారు లొంగకపోతే బెదిరింపులకు దిగడంతో హడలిపోయినట్టు సమాచారం. నలుగురు అభ్యర్థులే కాకుండా మిగతా అభ్యర్థులతో సైతం సదరు వైసీపీ యువ నాయకులు మాట్లాడినట్టు సమాచారం. ఇందులో కొందరు టీడీపీ అభ్యర్థులు తమ పార్టీ నాయకులకు సమాచారమందించారు. దీంతో కుటుంబాలతో సహా వచ్చేయాలని, అండగా ఉంటామని నేతలు హామీ ఇవ్వడంతో వారు రహస్య ప్రాంతాలకు వెళ్లారు. టీడీపీ వ్యూహంతో వైసీపీ నాయకుల ఎత్తులు అంతటితో ఆగిపోయాయి. కానీ ఇంకా హెచ్చరికలు, బెదిరింపులకు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థుల అనుచరుల ద్వారా వారి కోసం ఆరా తీస్తుండడం కొసమెరుపు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థులు స్థానికంగా లేకపోవడంతో ఇదే అదునుగా వైసీపీ ప్రచారాన్ని ప్రారంభించింది. సాధారణంగా నామినేషన్లు ఉపసంహరణ అనంతరం ప్రచారాలు ప్రారంభించాల్సింది. కానీ టీడీపీ అభ్యర్థుల అజ్ఞాతవాసాన్ని వైసీపీ నాయకులు చక్కగా వినియోగించుకుంటున్నారు. 


మారిన టీడీపీ వ్యూహం

వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ అభ్యర్థుల స్థానంలో మూడుచోట్ల డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. వారినే బరిలో దించేందుకు టీడీపీ నేతలు నిర్ణయించారు. 8వ వార్డు నర్సిపురంలో మాత్రం డమ్మీ అభ్యర్థి ఎవరూ లేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఆయనకు  మద్దతు ఇవ్వడం, లేకుంటే పార్టీలో ఆహ్వానించి గట్టి పోటీ ఇచ్చేందుకు టీడీపీ వ్యూహం పన్నుతోంది. ఆదివారం బీజేపీ అభ్యర్థితో టీడీపీ నాయకులు రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.  పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘానికి గతంలో మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా బీ ఫారాలు పొందిన అభ్యర్థులు వేరే పార్టీలో చేరడం అన్నది జరగలేదు. కానీ తాజా ఎన్నికల్లో అధికారపక్ష నాయకులు దూకుడు పెంచి ఏకగ్రీవాలు చేయడానికి భారీస్థాయిలో కసరత్తు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. 


ఆ నలుగురి నుంచి లిఖితపూర్వక వివరణ

పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో టీడీపీ బీ ఫారాలు పొంది వైసీపీలో చేరిన నలుగురు అభ్యర్థుల నుంచి మునిసిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అధికారి డి.రాజగోపాలరావు ఆదివారం లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు. శనివారం ఉదయం టీడీపీ అభ్యర్థులు నలుగురు వైసీపీ గూటికి చేరిస సంగతి తెలిసిందే. దీనిపై వాస్తవాలు పరిశీలించి ఆయా వార్డుల్లో కొత్తవారికి నామినేషన్‌ వేయడానికి అవకాశం కల్పించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. తక్షణం స్పందించిన ఎన్నికల కమిషనర్‌  విచారణకు ఆదేశించారు. దీనిపై వివరణ కోరాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ నలుగురు అభ్యర్థుల నుంచి ఆదివారం లిఖితపూర్వక వివరణను తీసుకున్నారు. సీఐ శంకరరావు సమక్షంలో ఒత్తిళ్లు, ప్రలోభాలు పెట్టారా? భయబ్రాంతులకు గురిచేశారా? అన్న అంశాలపై విచారణ చేపట్టారు. నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి  పంపించారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అధికారి రాజగోపాలరావు విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తాము నివేదిక సమర్పించినట్టు చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం డమ్మీ అభ్యర్థులు టీడీపీ తరుపున నామినేషన్లు వేసి ఉంటే...వారికి బీ ఫారాలు ఇవ్వవచ్చునని.. వారే పార్టీ అభ్యర్థులవుతారని స్పష్టం చేశారు.  


మునిసిపల్‌ ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు

 మునిసిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి ఈ నెల 10న ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పోలింగ్‌ అధికారులకు శిక్షణ ప్రారంభమయ్యిందన్నారు. వివిధ విభాగాలకు నోడల్‌ అధికారులను నియమించామని పేర్కొన్నారు. స్టాటిక్‌ సర్వేలియన్స్‌ టీమ్‌లను, ప్రవర్తనా నియమావళి అమలు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించిందని వివరించారు. నామినేషన్‌ వేసిన నాటి నుంచి చేసే ఖర్చు లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు మూడు రోజులకు ఒకసారి ఖర్చుల వివరాలు పరిశీలకులకు సమర్పించాలని చెప్పారు. దినపత్రికలు, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ఇచ్చే ప్రకటనలు కూడా జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కీలకమని.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కలెక్టర్‌ కోరారు.



Updated Date - 2021-03-01T05:37:15+05:30 IST