గుల్ల చేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-15T05:48:03+05:30 IST

గౌతమి గోదావరి నదీపరివాహక ప్రాంతాల్లో లంక భూములను నిబంధనలకు విరుద్ధంగా ’గుల్ల’ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన కీలక నేతల ప్రమేయంతో పగలు ప్రభుత్వ అవసరాలకు, రాత్రివేళల్లో సొంత విక్రయాలకు యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. మైన్స్‌ అధికారుల ప్రమేయంతో గౌతమి నది మధ్యలో అటు కోటిపల్లి ఇటు ముక్తేశ్వరం మధ్యలో ఉన్న మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో గత కొన్ని నెలలుగా ఇసుక, తువ్వ మట్టి వే

గుల్ల చేస్తున్నారు!
నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలతో నీరు ఉబికి వస్తున్న దృశ్యం

‘మాన్సాస్‌’ భూముల్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ

పగలు హైవే పనుల కోసం తరలింపు

రాత్రివేళల్లో భారీగా లారీల్లో మళ్లింపు

నిబంధనలకు విరుద్ధంగా రెండున్నర మీటర్ల లోతున తవ్వకాలు

మైన్స్‌ అధికారుల ప్రమేయంతో   

గుల్లవుతున్న లంకలు

వైసీపీ కీలక నేతల ప్రమేయంతో అక్రమ రవాణా

పట్టించుకోని అధికార యంత్రాంగం


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గౌతమి గోదావరి నదీపరివాహక ప్రాంతాల్లో లంక భూములను నిబంధనలకు విరుద్ధంగా ’గుల్ల’ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన కీలక నేతల ప్రమేయంతో పగలు ప్రభుత్వ అవసరాలకు, రాత్రివేళల్లో సొంత విక్రయాలకు యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. మైన్స్‌ అధికారుల ప్రమేయంతో గౌతమి నది మధ్యలో అటు కోటిపల్లి ఇటు ముక్తేశ్వరం మధ్యలో ఉన్న మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో గత కొన్ని నెలలుగా ఇసుక, తువ్వ మట్టి వేల లారీల్లో తరలిపోతోంది. నిర్వాహకులు రాత్రివేళల్లో వందలాది లారీల ఇసుకను అమలాపురం పట్టణం మీదుగా వివిధ ప్రాంతాలకు నిబంధనలకు విరుద్ధంగా తరలించుకుపోతున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారు. పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే ఈ దందా వెనుక ఉన్న కీలక వ్యక్తులు ప్రమేయమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు కోటిపల్లి ఇటు ముక్తేశ్వరం మధ్యలో వందలాది ఎకరాల మాన్సాస్‌ ట్రస్టు భూములు రైతుల ఏలుబడిలో ఉన్నాయి. ఇవి మెరక కావడంతో పల్లపు భూములుగా చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ మాన్సాస్‌ ట్రస్టు అధికారులు కలెక్టర్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని రాజకీయ ఏలుబడిలో ఉన్న కీలక వ్యక్తులకు ముఖ్యంగా అధికార పార్టీలో హవా చెలాయిస్తున్న కీలక సామాజికవర్గ పెద్దలకు ఇసుక తవ్వకాల బాధ్యతలను అప్పగించారు. వారితో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఈ ఇసుక అక్రమ తవ్వకాల్లో ప్రఽధాన పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 216 జాతీయ రహదారి అభివృద్ధి, విస్తరణ ముసుగులో కోట్ల రూపాయల విలువైన బంగారం లాంటి ఇసుకను బయటి ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంతో పాటు మైన్స్‌, హెడ్‌వర్క్స్‌ అధికారుల అనుమతి మేరకే ఈ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.


మీటరులోపు మాత్రమే మట్టిని తవ్వుకునేందుకు అటు మైన్స్‌ ఇటు హెడ్‌వర్క్స్‌ అధికారులు నిర్వాహకులకు అనుమతి ఇచ్చారు. అయితే ఇవేమీ పట్టని కాంట్రాక్టర్లు రెండున్నర మీటర్ల పైనే లోతులో లంకలు తవ్వేస్తున్నారు. పగటివేళ బహిరంగంగా ఇసుక రవాణా జరుగుతోంది. ఆ సమయంలో భారీగా ఇసుక నిల్వలు గుట్టలుగా పెట్టి రాత్రివేళల్లో వందలాది లారీల్లో అటు ముమ్మిడివరం, ఇటు అమలాపురం, రావులపాలెం వైపు తరలించేస్తున్నారు. రాత్రి సమయంలో నిరంతరాయంగా లారీల్లో ఇసుక తరలించుకుపోతున్నా ప్రశ్నించే నేతలే కరువయ్యారు. అదేమని అడిగితే వారిపై తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. వేల సంఖ్యలో లారీల్లో మాన్సాస్‌ ట్రస్టు భూముల్లోని ఇసుక తిన్నెలను తరలించుకుపోతున్నా బాధ్యత గల జిల్లా యంత్రాంగం సహా మైన్స్‌, ఇరిగేషన్‌, పోలీసు, రెవెన్యూ అధికారులు షరా మామూలుగానే చోద్యం చూస్తున్నారు. దీనిపై హెడ్‌వర్క్స్‌ విభాగానికి చెందిన గౌతమి సెక్షన్‌ ఏఈ సుబ్బారావును వివరణ కోరగా... ఇసుక తవ్వకాలకు మైన్స్‌ అధికారులు అనుమతిస్తారని, తాము బాట వరకే అనుమతి ఇస్తామని చెప్పారు. పాయింట్‌ 9 మించి ఇసుక తవ్వకాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇసుకను నేషనల్‌ హైవే పనుల కోసం తరలిస్తున్నారని చెప్పారు. 

Updated Date - 2021-05-15T05:48:03+05:30 IST