వైసీపీలో ఇసుకాగ్రహం!

ABN , First Publish Date - 2020-06-03T08:50:38+05:30 IST

రాష్ట్రంలో రేయింబవళ్లు రీచ్‌లలో ఇసుక తవ్వుతున్నారు. లారీలకు లారీలు లోడుతో తరలుతున్నాయి. కానీ ప్రభుత్వం చెబుతున్నట్లు అందులో చాలామటుకు స్టాక్‌ పాయింట్లకు చేరడం లేదు.

వైసీపీలో ఇసుకాగ్రహం!

  • దోసెడైనా దొరకడం లేదని ఆక్రోశం
  • దారిమళ్లుతోందని మండిపాటు
  • గుంటూరు సమీక్షా సమావేశంలో
  • గళమెత్తిన వినుకొండ ఎమ్మెల్యే
  • అమరావతిలో బయల్దేరిన లారీ
  • మధ్యలోనే మాయమవుతోంది
  • కలెక్టర్‌కు చెప్పినా లాభం లేదు
  • బొల్లా బ్రహ్మనాయుడి ఆవేదన


అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేయింబవళ్లు రీచ్‌లలో ఇసుక తవ్వుతున్నారు. లారీలకు లారీలు లోడుతో తరలుతున్నాయి. కానీ ప్రభుత్వం చెబుతున్నట్లు అందులో చాలామటుకు స్టాక్‌ పాయింట్లకు చేరడం లేదు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి దోసెడు ఇసుక కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇసుక సెగ క్రమంగా అధికార పక్ష ప్రజాప్రతినిధులకూ తగులుతోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డికి భయపడి.. ఏడాది కాలంగా నోరెత్తని వీరిలో కొందరికి సహనం నశిస్తోంది. ఇసుక దారి మళ్లిపోతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంటింటికీ ఇసుక పంపిస్తున్నామని ఆర్భాటంగా చెబుతున్నా.. అడుగు కూడా ముందుకు కదలడం లేదని.. చివరకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘నాడూ-నేడూ’ కార్యక్రమం అమలుకే ఇసుక దొరకడం లేదని అంటున్నారు. 


సోమవారం గుంటూరు జిల్లా పరిషత్‌  కార్యాలయంలో ఇసుకపై జరిగిన సమీక్ష సమావేశంలో వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదన్నారు. కలెక్టర్‌కు చెప్పినా ఉపయోగం ఉండడం లేదన్నారు. అమరావతిలో ఇసుకతో బయల్దేరిన లారీ.. వినుకొండ రాకుండానే మాయమవుతోందని చెప్పారు. ఆయన మాటలతో నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఏకీభవించారు. మంగళవారం ఆయన ‘ఆంధ్య్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చుట్టూ కోటరీ కంచె ఉంటుంది. దానిని దాటుకుని వెళ్లి వాస్తవాలు చెప్పేవారు ఉండరు. ఇసుక కొరతపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ ఫోన్‌ చేసి.. ఒక లారీ ఇసుక కావాలని అడిగారు. అంత పెద్దాయన అడిగినా ఇప్పించలేకపోయాను. ఆత్మన్యూనత అనిపించింది’ అని చెప్పారు.


ఇంతకుముందు ఇలా లేదు..

‘గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో యూనిట్‌ ఇసుక రూ.500కి దొరికేది. ఆయన పాలనలో ఏ రోజూ ఒక్క రూపాయి కూడా దాటలేదు. తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి రోజుల్లో కొన్ని రీచ్‌లకు సమస్యలొచ్చి రెండొందలో మూడొందలో పెరిగింది. చంద్రబాబు టైమ్‌లో యూనిట్‌ రూ.2 వేలకు మించలేదు. ఇప్పుడు కొత్త వ్యవస్థ తీసుకురావాలని మా ముఖ్యమంత్రి అనుకున్నారు. అదే సమయంలో వర్షాలు పడ్డాయి. దీనివల్ల కొంత సెట్‌బ్యాక్‌ వచ్చిన మాట వాస్తవమే’ అని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఇసుక కొరతపై ముఖ్యమంత్రికి సవివరంగా లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని.. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, ఇతరత్రా కార్యక్రమాలకు వెయ్యేసి కోట్లు ఖర్చుపెడుతోందని తెలిపారు. 


ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వెయ్యి కోట్ల రూపాయలకు మించదని.. దీనికోసం చెడ్డ పేరు తెచ్చుకోవడం దేనికని ప్రశ్నించారు. ‘పారదర్శకత అంటున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రయత్నిస్తే కంప్యూటర్లు పనిచేయవు.. నా ఏరియాలో దగ్గరలోనే రీచ్‌ ఉంది. కానీ అక్కడ తవ్విన ఇసుకను స్టాక్‌ పాయింట్లకు చేర్చకుండా కొందరు ఇతర మార్గాలకు తరలిస్తున్నారు. మధ్యలో దళారులు తినేస్తున్నారు. ఇసుక సజావుగా సాగుతోందని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కానీ మాకు, పార్టీకీ చాలా చెడ్డపేరు వస్తోంది. ఒక రేటు పెడితే ఇసుక ధర కంట్రోల్‌ అవుతుంది. కానీ మేమే చేస్తాం.. ఇసుకను ఒక చోటకు తెచ్చి మేమే అమ్ముతామంటే.. స్టాక్‌ పాయింట్‌కు తోలకుండా మధ్యలోనే దారి మళ్లిస్తారు. ఇసుకలో ఇంత చెడ్డ పేరు వస్తోందని గానీ.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గానీ ముఖ్యమంత్రికి కచ్చితంగా తెలియదు. తెలిస్తే తప్పక నిర్ణయం తీసుకుంటారు. వెయ్యి కోట్ల కోసం ప్రజల కడగండ్లు ప్రభుత్వానికి భవిష్యత్‌లో చాలా సమస్యలు తీసుకొస్తాయి. తెలిసి ఎంత మంచి చేసినా.. తెలియక జరిగే ఇలాంటి పొరపాట్ల వల్ల  ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని బాధ్యత గల వైసీపీ ఎంపీగా.. సీఎం దృష్టికి తీసుకెళ్తాను. గతంలో వైఎస్‌ అమలుచేసిన విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరతాను’ అని తెలిపారు.

Updated Date - 2020-06-03T08:50:38+05:30 IST