వైసీపీ పాలన.. ఓ వైకుంఠపాళి!

ABN , First Publish Date - 2022-05-14T08:32:42+05:30 IST

వైసీపీ పాలన.. ఓ వైకుంఠపాళి!

వైసీపీ పాలన.. ఓ వైకుంఠపాళి!

నేను అభివృద్ధి చేస్తే వైసీపీ పాతాళానికి పడేసింది

రోజుకో చోట అఘాయిత్యాలు, బెదిరింపులు

వైసీపీ నేతల చేష్టలతో ఓ ఎస్‌ఐ ఆత్మహత్య

ప్రజలు భరించలేక మార్పు కోరుకుంటున్నారు

పొత్తుల గురించి మాట్లాడను.. ఇప్పుడే అక్కర్లేదు

విజయానికి, పొత్తులకు సంబంధం లేదు: బాబు


నిరుద్యోగ భృతిని ఎందుకు తీసేశారో జగన్‌ చెప్పాలి

యువత ముందుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

చంద్రబాబు పిలుపు


కుప్పం, మే 13 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రగతిని పాతాళంలోకి పడేసింది. నేను పైకి తీసుకెళ్లడం.. వాళ్లు పాములు మింగినట్లుగా కిందకు లాగడం.. వైకుంఠపాళిలో మాదిరిగా పరిస్థితి తయారైంది. మళ్లీ నేను మొదటి నుంచీ అభివృద్ధి చేసుకోవాలి’’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడ్రోజుల పర్యటనను శుక్రవారం పూర్తిచేసుకున్న ఆయన.. ఇక్కడి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో స్థానిక పాత్రికేయులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అంతకుముందు పార్టీ బూత్‌, యూనిట్‌, క్లస్టర్‌ కన్వీనర్లతో, యువతతో సమావేశమయ్యారు. ‘ప్రజలు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. రోజుకో చోట అత్యాచారాలు, అఘాయిత్యాలు, బెదిరింపులు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేతల చేష్టలతో ఓ ఎస్‌ఐ కూడా గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని భరించలేక మార్పు కోరుకుంటున్నారు. నేను ఓ విజన్‌తో పనిచేస్తుంటే వీళ్లు వచ్చి నా కలలను నాశనం చేశారు’ అని ధ్వజమెత్తారు. ఈ అరాచక, దుర్మార్గపు పాలనను అంతమొందించాలంటే యువత ముందుకు రావాలన్నారు. అందుకే టీడీపీలో 40 శాతం సీట్లను యువతకు కేటాయించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. యువతను జగన్‌ ప్రభుత్వం నిండా ముంచేసిందని.. జాబ్‌ కేలెండర్‌ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగం పెరిగిపోయి, కనీస స్వయం ఉపాధి ఎంచుకునే మార్గంలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను యువతకు రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చానని, దానిని ఎందుకు తీసేశారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యువత సాంకేతికతను ఉపయోగించుకుని ఎదగాలన్నారు. ఒకవైపు ఆర్థికంగా ఎదుగుతూనే.. రాజకీయాల్లోనూ ముందుకొచ్చి ప్రక్షాళన చేయాలని సూచించారు. రాష్ట్రం మరో శ్రీలంక కాకుండా కాపాడుకునే బాధ్యత యువతపైనే ఉందన్నారు. ‘పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడను. అంత అవసరం కూడా లేదు. నేను ఇప్పుడేదో మాట్లాడి, వైసీపీ వాళ్లు రెచ్చగొడుతూ చెప్పి.. ఇదంతా అవసరం లేదు. గత ఎన్నికల పరిస్థితి చూసుకుంటే, పొత్తులుండీ ఓడిన, గెలిచిన దాఖలాలున్నాయి. ఎన్నికల్లో విజయానికి, పొత్తులకు సంబంధం లేదు. అది ప్రజల నిర్ణయం’ అని తెలిపారు. 


మీడియా పోరాడాలి..

మీడియా కూడా ఆలోచించుకోవాలని, రాష్ట్రం పాతాళంలోకి వెళ్లిపోతోందని, ఈ సమయంలోనే ముందుకొచ్చి పోరాడాలని చంద్రబాబు సూచించారు. ‘నా 14 ఏళ్ల హయాంలో మీడియాపై ఎక్కడా దాడులు జరగలేదు. వైసీపీ వస్తూనే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, వాళ్లకు నచ్చని వార్తలు రాస్తే కేసులు పెట్టేలా జీవోలు తెచ్చింది. అయినా మీడియా ఖండించలేదు. ఈ విషయంలో పాత్రికేయులు పోరాడి, తమ హక్కులు సాధించుకోవాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు తమ సమస్యలను ఆయనతో పంచుకోగా.. సానుకూలంగా స్పందించారు. రెండేళ్లలో అధికారంలోకి వస్తామని.. తొలి ఆర్నెళ్లలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్టింగర్లకు గౌరవ వేతనం, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, బీమా, హెల్త్‌ కార్డులు, జర్నలిస్టులపై దాడులు జరగకుండా కమిటీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కాగా.. మూడ్రోజుల పర్యటనలో ఆయన తొలి రోజు బుధవారం శాంతిపురం, రెండో రోజు గుడుపల్లె, మూడో రోజు కుప్పంలో పర్యటించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి గురించి ప్రతిచోటా ప్రస్తావించారు. నాయకులు కూడా మారాలని.. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు కుప్పం వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడతానని చెప్పారు. ప్రతిచోటా ప్రజలకు మైక్‌ ఇచ్చి మాట్లాడించారు. కాగా.. ఆయన కుప్పంలో  ఇల్లు కట్టుకోనున్నారు. శాంతిపురం మండలం కడపల్లె సమీపంలోని 2.10 ఎకరాలను చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. పావు గంటసేపు అక్కడే గడిపారు. 


18న కమలాపురంలో..

చంద్రబాబు వచ్చే వారం రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 18వ తేదీన ఆయన కడప జిల్లాలోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్‌, 20వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాల్లో పాల్గొంటారు.



Read more