జీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి రెబల్స్‌ బెడద

ABN , First Publish Date - 2021-03-05T06:08:06+05:30 IST

నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి కొన్ని స్థానాల్లో సొంత పార్టీ నాయకుల నుంచే తలనొప్పులు తప్పేలా లేవు.

జీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి రెబల్స్‌ బెడద
ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎదుట నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలు

ఎంపీ మోపిదేవి ఎదుట కార్యకర్తల నిరసన

గుంటూరు, మార్చి 4: నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి కొన్ని స్థానాల్లో సొంత పార్టీ నాయకుల నుంచే తలనొప్పులు తప్పేలా లేవు. టిక్కెట్‌ దక్కక పోవడంతో డివిజన్లలో కొందరు రెబల్‌గా బరిలో దిగారు. తూర్పు నియోజకవర్గంలో రెండు స్థానాల్లో,  పశ్చిమలో ఒక స్థానం, రూరల్‌లో ఒక స్థానంలో వైసీపీ రెబల్స్‌ పోటీలో నిలిచారు. రెబల్స్‌ పోటీతో ఆయా డివిజన్లలో కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. రెబల్స్‌ నుంచి నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 12వ డివిజన్‌లో  మాజీ కార్పొరేటర్‌ షేక్‌ అప్సర్‌, 5వ డివిజన్‌ నుంచి షేక్‌ జానీ బాషా, 21వ డివిజన్‌లో కాండ్రగుంట గువరయ్య, 27వ  డివిజన్‌ నుంచి చల్లా రాజ్యలక్ష్మి, దుగ్గెంపూడి వెంకటలక్ష్మిలు రెబల్స్‌గా బరిలో ఉన్నారు.   వీరంతా తమ బలమేంటో చూపుతాంటూ పార్టీ నేతలపైనే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.  

మైనార్టీ ఆత్మీయ సమావేశంలో నిరసన

టిక్కెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు గురువారం గుంటూరు కన్వెన్షన్‌ హాల్‌లో  జరిగిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఎదుట నిరసన తెలిపారు. డివిజన్‌లో 100 ఓట్లు ఉన్న సామాజికవర్గానికి ఎలా టిక్కెట్‌ కేటాయిస్తారని 34వ డివిజన్‌ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన షేక్‌ రేష్మాసుభాని ప్రశ్నించారు. అందరూ సమష్టిగా పనిచేసుకోవాలని, పార్టీ సరైన సమయంలో న్యాయం చేస్తుందని మోపిదేవి హామీ ఇచ్చారు.   

Updated Date - 2021-03-05T06:08:06+05:30 IST