బందరు లడ్డు.. గుటుక్కు!

ABN , First Publish Date - 2020-10-01T08:29:24+05:30 IST

పాత వాళ్లను తోసెయ్‌! సొంత మనుషులకు దోచెయ్‌!... ఇదే తాజా మంత్రం! ‘కార్పొరేట్‌ - కాంట్రాక్ట్‌’లతో సరికొత్త తంత్రం! కాకినాడ సెజ్‌లో అరబిందో రియల్టీ పాగా వేసినట్లే... బందరు పోర్టు కాంట్రాక్టును ఇద్దరు అస్మదీయులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది...

బందరు లడ్డు..  గుటుక్కు!

  • రంగంలోకి ‘రాంకీ’ రామిరెడ్డి, ‘మేఘా’ కృష్ణారెడ్డి?
  • పోర్టు పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం!?
  • వైఎస్‌ హయాంలో ‘నవయుగ’కు కాంట్రాక్టు
  • ఏళ్ల తరబడి పూర్తికాని భూసేకరణ
  • గత ప్రభుత్వ హయాంలో కొలిక్కి
  • వచ్చీ రాగానే గుడ్లురిమిన వైసీపీ సర్కార్‌
  • పనులు జరగలేదంటూ కాంట్రాక్టు రద్దు
  • ప్రభుత్వమే నిర్మిస్తుందని తొలుత ప్రకటన
  • ఆపై... తెరపైకి అదానీ సంస్థ పేరు
  • ‘పొరుగు’ ఆకాంక్షతో మారిన ఆలోచన
  • అట్నుంచి మేఘా, ఇట్నుంచి రాంకీతో ‘డీల్‌’



పాత వాళ్లను తోసెయ్‌! సొంత మనుషులకు దోచెయ్‌!... ఇదే తాజా మంత్రం! ‘కార్పొరేట్‌ - కాంట్రాక్ట్‌’లతో సరికొత్త తంత్రం! కాకినాడ సెజ్‌లో అరబిందో రియల్టీ పాగా వేసినట్లే... బందరు పోర్టు కాంట్రాక్టును ఇద్దరు అస్మదీయులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు... వైసీపీ ఎంపీ ‘రాంకీ’ అయోధ్య రామిరెడ్డి! మరొకరు... ‘మేఘా’ కృష్ణా రెడ్డి! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

‘బందరు పోర్టు నిర్మిస్తాం. ప్రభుత్వమే పోర్టు నిర్మాణ పనులు చేపడుతుంది’ అని మంత్రి పేర్ని నాని పదేపదే చెప్పిన మాటలు  వట్టివేనా? పోర్టు నిర్మాణ పనులను అస్మదీయులకు అప్పగించేందుకు శరవేగంగా పావులు కదులుతున్నాయా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు ‘ఔను’ అనే సమాధానం చెబుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో... అయోధ్య రామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ సంస్థకు ఈ కాంట్రాక్టు దక్కుతుందని,  కృష్ణా రెడ్డికి చెందిన ‘మేఘా ఇంజనీరింగ్‌’తో కలిసి పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. నిజానికి, వైసీపీ అధికారంలోకి వచ్చేదాకా బందరు పోర్టు కాంట్రాక్టు నవయుగ సంస్థ చేతిలోనే ఉంది. ప్రభుత్వం భూమి సేకరించి ఇవ్వకపోవడంతో పనులు మొదలు కాలేదు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే పనుల్లో ఎలాంటి పురోగతి లేదంటూ నవయుగ సంస్థను పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి తొలగించింది. సుమారు రూ.12వేల కోట్ల విలువైన బందరు పోర్టు నిర్మాణ బాధ్యతలను అస్మదీయ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


భూమి ఇవ్వకముందే పనులు చేయలేదని...

బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల చిరకాల స్వప్నం. 2001నుంచి బందరు పోర్టు ఉద్యమం నడుస్తోంది. 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కరగ్రహారం వద్ద బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కాంట్రాక్టును ‘మేటా్‌స’తో కలిసి నవయుగ సంస్థ దక్కించుకుంది. ‘సత్యం’ స్కామ్‌తో మేటాస్‌ కథ కంచికి పోయింది. ఆ తర్వాత నవయుగ సంస్థే పోర్టు పనులు చేయాలని సంకల్పించింది. కానీ, ఏళ్లు గడిచినా భూసేకరణ కొలిక్కి రాలేదు. 2012 మేలో అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం బందరు పోర్టుకు 5320 ఎకరాలను కేటాయిస్తూ జీవో నెం.11 జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2015 ఆగస్టులో పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14 వేల ఎకరాలను కేటాయించాలని నిర్ణయించి భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రైతులు ముందుకు రాకపోవడంతో 2016 ఆగస్టులో భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు.


పోర్టు అభివృద్ధి కోసం 2016లో మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ముడా) ఏర్పాటు చేశారు. ముడా ఆధ్వర్యంలో భూసేకరణ, సమీకరణకు ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. దీంతో భూసమీకరణ వేగం పుంజుకుంది. భూసమీకరణ చివరి దశకు వచ్చిన తర్వాత... 2019 ఫిబ్రవరి 7న అప్పటి సీఎం చంద్రబాబు తవసిపూడి వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈలోపే ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నాలుగు నెలల్లోనే ‘పనుల్లో పురోగతి లేదు’ అంటూ నవయుగ సంస్థను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బందరు పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కెనరా బ్యాంకు అధికారులతో మాట్లాడి పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేయించేందుకు ఒప్పించారు. సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేస్తుందని అప్పట్లో ఆయన ప్రకటించారు. కానీ, ప్రభుత్వ పెద్దల ఆలోచన మరో విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఎన్ని రుణాలు తెచ్చినా ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం అసాధ్యమని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే అదనుగా... అయిన వారికి పనులు కట్టబెట్టేందుకు చకచకా పావులు కదిపారు. టెండర్లు పిలిచినప్పటికీ... ఈ సంస్థలకే కాంట్రాక్టు దక్కేలా పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


బందరు పోర్టు పనుల నుంచి నవయుగను తప్పించిన తర్వాత... దీనిని అదానీ సంస్థకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ‘ఇంత పెద్ద ప్రాజెక్టు ఎవరికో ఇవ్వడం ఎందుకు? మనమే చూసుకుందాం’ అనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. బందరు పోర్టుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఆసక్తి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంట్రాక్టు పనులు మేఘా సంస్థకు అప్పగించాలంటూ అక్కడి నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ‘పక్క రాష్ట్రం తరఫున ఒకరు ఉండగా, మన తరఫున మరొకరు ఉండాలి కదా!’ అనే ఆలోచనతో... రాంకీని రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. నిజానికి... రాంకీ సంస్థకు భారీ నిర్మాణాల్లో, ముఖ్యంగా భారీ పోర్టులను నిర్మించిన అనుభవం లేదు. కృష్ణపట్నం పోర్టును నిర్మించి, నిర్వహించిన నవయుగ సంస్థకు ఈ రంగంలో మంచి అనుభవం ఉంది. అయినా సరే, ‘అస్మదీయతే’ అర్హతగా నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే తుది ఒప్పందం జరగడమొక్కటే మిగిలినట్లు తెలుస్తోంది.


Updated Date - 2020-10-01T08:29:24+05:30 IST