ఊకదంపుడు ఉపన్యాసాలు

ABN , First Publish Date - 2022-06-29T06:34:14+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, తొలిసారి నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్లీనరీలు తుస్సుమన్నాయి.

ఊకదంపుడు ఉపన్యాసాలు
ప్లీనరీలో కుర్చీలు ఖాళీ

వైసీపీ ప్లీనరీ తుస్‌..

సీఎంను పొగిడి.. సరిపెట్టిన నాయకులు 

కార్యకర్తలకు దక్కని మాట్లాడే అవకాశం

ముఖ్య నేతల్లో నిస్తేజం..శ్రేణుల్లో అసంతృప్తి


అనంతపురం, జూన 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, తొలిసారి నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్లీనరీలు తుస్సుమన్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ఖాళీ కుర్చీలే కనిపించాయి. కార్యకర్తల్లేక వెలవెలబోయాయి. అరకొరగా హాజరైన వారిని సభ నుంచి బయటికి వెళ్లకుండా కాపాడుకునేందుకు నాయకులు నానా తంటాలు పడ్డారు. ముఖ్య నాయకులు దండం పెట్టినా, బుజ్జగించినా.. ప్లీజ్‌ ఆగండి అని అర్తించినా..  కార్యకర్తలు వినుకోలేదు. సమావేశాల్లో కూర్చునేందుకు ఆసక్తి చూపలేదు. చాలామంది ప్లీనరీలకు మొహం చాటేశారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా కార్యకర్తలను ఏ ఒక్క ప్రజాప్రతినిధీ పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆవేదన వ్యక్తమౌతోంది. ప్లీనరీలు వెలవెలబోయేందుకు ఇదే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్లీనరీల్లో ఇదే పరిస్థితి  కనిపించింది. జిల్లాస్థాయి ప్లీనరీలోనూ ఇదే ప్రస్ఫుటమైంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకు ఏ ఒక్కరికీ ప్లీనరీ సమావేశాల్లో అవకాశం కల్పించలేదు. దీనిపట్ల పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్లీనరీలు పేలవంగా సాగడంతో నేతల్లోనూ నిస్తేజం కనిపించింది.


ఊకదంపుడు ఉపన్యాసాలు

జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగనపై ప్రశంసలు కురిపించడం, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడంతోనే సరిపెట్టారు. నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీల్లో పార్టీ కిందిస్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా... ప్లీనరీలో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. కానీ వైసీపీ ప్లీనరీల్లో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు. కార్యకర్తలు తమ లోపాలను ఎత్తిచూపుతారన్న అభద్రతాభావం ప్రజాప్రతినిధుల్లో నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణమని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 


శ్రేణుల్లో అసంతృప్తి

అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టాయి. ఈ అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా నిర్వహించిన ప్లీనరీల్లో కార్యకర్తలకు భరోసా దక్కుతుందని ఆశించారు. గ్రామ, మండల స్థాయి నాయకులు అదే ఆశించారు. కానీ ప్రజాప్రతినిధుల ప్రసంగాలు ఆ దిశగా సాగలేదు. పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారే తప్ప... కార్యకర్తలకు తాము అండగా ఉన్నామని భరోసా ఇవ్వలేదని శ్రేణులు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు వెలవెలబోయాయంటే... అందుకు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలే కారణమని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. 




కూర్చోండి.. ప్లీజ్‌..!

ప్లీనరీలో బతిమాలిన కాపు

సభ పూర్తయ్యేదాకా తంటాలు

700 కుర్చీలు నింపేందుకు ఆపసోపాలు

అనంతపురం క్రైం, జూన 28: ‘అయ్యా.. బాబూ.. దయచేసి సీట్లలో కూర్చోండి. త్వరగా సభ ముగుస్తుంది.. ఓపిక పట్టండి..’ అని వైసీపీ ముఖ్య నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి బతిమాలుకున్నారు. వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీని మంగళవారం శిల్పారామంలో నిర్వహించారు. సభలో సుమారు 700 కుర్చీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ  నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చినా.. ఈ కొన్ని కుర్చీలను నింపేందుకు జిల్లా అధ్యక్షుడి తలప్రాణం తోకకు వచ్చింది. కాపు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్ర్తీ,శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్లీనరీ పరిశీలకులు ఎస్‌వీ మోహనరెడ్డి,  ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఆరంభం కావాల్సిన ప్లీనరీ 12 గంటలకు ఆరంభమైంది. జిల్లా కేంద్రానికి 10.30గంటలకు చేరుకున్న పెద్దిరెడ్డి.. సభా ప్రాంగణానికి 11.50 గంటలకు చేరుకున్నారు. అప్పటికీ నాయకులు రాకపోవడంతో సభ నిండుగా లేదు. ఈ దుస్థితిని చూసి పార్టీ కార్యకర్తలు కొందరు.. ‘పుష్పా.. పార్టీ అంతేనప్పా..’ అని సెటైర్లు వేసుకున్నారు. 


తొందరగా కానివ్వండి.. వెళ్లిపోతున్నారు..

సమావేశం ఆరంభమయ్యాక నిర్దేశించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు మాట్లాడారు. జిల్లా  అధ్యక్షుడు కాపురామచంద్రారెడ్డి వారి పేర్లను ప్రకటిస్తూ మైక్‌లు ఇచ్చారు. వారు మాట్లాడుతున్న సమయంలో ‘మీకు మూడు నిమిషాలే’ అని కొందరికి,  రెండు నిమిషాలే అని మరికొందరికి చెప్పారు. చివరికి ఒక్క నిమిషమే అని సభ ముగించేందుకు సమయం తగ్గిస్తూపోయారు. ఆలస్యం కావడంతో హాల్‌లో ఉన్న వారు ఎక్కడ బయటకు వెళ్ళిపోతారోనన్న ఆందోళన ఆయనలో కనిపించింది. మధ్య మధ్యలో ఆయన వేదిక దిగి.. ముఖ్య నాయకులు, చోటా నాయకులను సైతం బతిమాలి లోనికి రప్పించారు. అయినా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తూ కనిపించాయి. సభ జరుగుతుండగానే కొందరు నాయకులు బయటకెళ్లి పిచ్చాపాటీ మాట్లాడుతూ గడిపారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి వేదికపై ఎక్కువసేపు కూర్చోలేదు. ఈయన మధ్యలో బయటకెళ్లి తన అనుచరులతో మాట్లాడుతూ ఉండిపోయారు. 


పెద్దిరెడ్డి పొగడ్తలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని విధంగా జగన అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  100 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక, అవేవీ కనపడకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కానీ జగన అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, అర్హులందరికీ అందేలా చేస్తున్నారని ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలందరూ సమాయత్తం కావాలని సూచించారు. 


వేరుశనగకు బీమా ఏదీ?: అనంత

జిల్లాలో వేరుశనగకు వాతావరణ బీమా ఉపయోగపడటం లేదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పంట దిగుబడి ఆధారంగా బీమా అందజేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పెద్దిరెడ్డిని కోరారు. 

Updated Date - 2022-06-29T06:34:14+05:30 IST