YCP Plenary.. భోజనాల తర్వాత నేతలు జంప్!

ABN , First Publish Date - 2022-07-08T22:12:27+05:30 IST

వైసీపీ ప్లీనరీ (YCP Plenary)ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేశారు. రెండ్రోజులపాటు జరిగే ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

YCP Plenary.. భోజనాల తర్వాత నేతలు జంప్!

గుంటూరు: వైసీపీ ప్లీనరీ (YCP Plenary)ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేశారు. రెండ్రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా కాజ సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ మైదానంలో ప్లీనరీ నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు ఆర్భాటంగా సభలను ప్రారంభించినా... కార్యకర్తలను నిలుపుకోలేకపోయారు. మొదటి రోజే ప్లీనరీలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం భోజనాల తర్వాత నేతలు, కార్యకర్తలు వెళ్లిపోయారు. అంతకుముందు ప్లీనరీలో భోజనాల దగ్గర తోపులాట జరిగింది. ప్లీనరీకి వచ్చిన వారికి పోలీసులు దగ్గరుండి మరీ ఐస్‌క్రీమ్‌లు పంపిణీ చేశారు. సీఎం జగన్, విజయలక్ష్మి ప్రసంగాలు పూర్తయిన వెంటనే.. భోజనాల కోసం పార్టీ శ్రేణులు ఎగబడ్డారు. వేదికపై ప్రసంగాలు జరుగుతున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే నేతలు జారుకున్నారు. 


భద్రత దృష్ట్యా గుంటూరు-విజయవాడ (Guntur-Vijayawada) జాతీయ రహదారిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. రెండ్రోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్లీనరీ జగన్‌ ప్రసంగంతో ప్రతినిధుల సభ మొదలయింది. మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన, మంత్రులు మాట్లాడతారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం, సాధికారిత మహిళా భద్రత వంటి నవరత్నాల హామీలపై తొమ్మిది తీర్మానాలు ప్రవేశపెడతారు. శనివారం రెండో రోజున పార్టీ, ప్రభుత్వం ఇప్పటి దాకా అనుసరించిన వైఖరి, పాలనా విధానాలతో పాటు.. వచ్చే రెండేళ్లలో అనుసరించే వ్యూహంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారు.


2024 ఎన్నికలు టార్గెట్‌గానే..

2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రతిసారీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై ప్రశాంత్‌ కిశోర్‌ టీం చేపడుతున్న సర్వేలను వల్లె వేస్తూ వచ్చే ఆయన.. ప్లీనరీలోనూ దీనిని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీచేసే 72 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, ప్లీనరీ విజయవంతానికి 20 కమిటీలు వేశారు. ఒక్కో నేతకు ఒక్కో కమిటీ బాధ్యతను అప్పగించారు.

Updated Date - 2022-07-08T22:12:27+05:30 IST