వైసీపీ ప్లీనరీ ఫ్లాప్‌

ABN , First Publish Date - 2022-06-27T06:42:49+05:30 IST

వైపీసీ ప్లీనరీ సమావేశం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

వైసీపీ ప్లీనరీ ఫ్లాప్‌
ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

 అరగంటకే కుర్చీలు ఖాళీ

వేదికపైనున్న వారే కిందకు..

అనంతపురం క్రైం, జూన26 : వైపీసీ ప్లీనరీ సమావేశం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశం ఆరంభమైన అరగంటకే కుర్చీలు ఖాళీ అవ్వడం మొదలయ్యింది.  ఆదివారం అనంతపురం నగర శివారులోని శిల్పారామంలో వైసీపీ అనంతపురం నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది.  ఈసమావేశానికి జిల్లా ప్లీనరీ పరిశీలకులు ఎస్‌వీ మోహనరెడ్డి హాజరయ్యారు. 


ఆలస్యంగా ప్రారంభం 

ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన ప్లీనరీ 11.15గంటలకు ప్రారంభించారు. ఇది కూడా కేవలం సభ నిండలేదనే ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.... రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సంక్షేమ పథకాల రథం విరామం లేకుండా పరుగుతీస్తోందన్నారు. ప్రజాక్షేత్రంలో వైసీపీని ఎదుర్కొనే దమ్ములేని టీడీపీ ఇతర పార్టీలు కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని లెక్క చేయకుండా సీఎం జగన రాషా్ట్రన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. 


నాయకుల మధ్య వాగ్వాదం

అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, వైసీపీ నగరాధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో మాట్లాడటానికి అహుడా చైర్మన ఆహ్వానించారు. అందుకు ఆయన మాట్లాడనని చెప్పారు. కొంతసేపటి తరువాత ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడాలని కోరితే... మహాలక్ష్మి నేను మాట్లాడతానని ముందుకొచ్చారు. దీంతో  సోమశేఖర్‌రెడ్డి మైక్‌ తీసుకుని అప్పుడు మాట్లాడనన్నారు... ఇప్పుడు మాట్లాడుతానంటున్నారు అని ప్రశ్నించారు.  సోమశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి మహాలక్ష్మి మాట్లాడుతూ... పద్ధతి మార్చుకోవాలన్నారు. అహుడా చైర్మన మాట్లాడుతారని చెప్పాలి కానీ చెవిలో వచ్చి మాట్లాడతావా..?అని అడగడం సరికాదన్నారు. 


అరగంటకే కుర్చీలు ఖాళీ....

ప్లీనరీ ఆరంభమైన అరగంటకే కుర్చీలు ఖాళీ అయ్యాయి. పార్టీ ముఖ్యనేతలు మాట్లాడుతున్న సమయంలో సమావేశానికి వచ్చినవారు వెనుదిరగడం కనిపించింది. అయితే మీడియా వాళ్లు ఫొటోలు తీస్తుండటంతో ఖాళీ అయిన కుర్చీలను కొందరు వైసీపీ నాయకులు పక్కన పెట్టే ప్రయత్నం చేశారు.

  చివరికి  వేదికపై ఉన్న ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, సర్పంచులను సైతం కిందకు దిగి ఖాళీ అయిన కుర్చీల్లో కూర్చోమని చెప్పాల్సి వచ్చింది. కార్యక్రమంలో  వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపురామచంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం, అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:42:49+05:30 IST