అసంతృప్తులు, ఇబ్బందులూ వాస్తవమే

ABN , First Publish Date - 2022-07-01T06:52:37+05:30 IST

‘పార్టీ కార్యకర్తల్లో కొన్ని అసంతృప్తులు, ఇబ్బందులు ఉండడం వాస్తవమే,

అసంతృప్తులు, ఇబ్బందులూ వాస్తవమే

వాటిని అఽధిగమించడమెలాగో ప్లీనరీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సందేశం ఇస్తారు

వైసీపీ జిల్లా ప్లీనరీలో ఉమ్మడి విశాఖ 

జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి

విశాఖను పరిపాలనా రాజధానిగానే కాదు...సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

వలంటీర్‌లను, సచివాలయ సిబ్బందినీ పార్టీ సొంతం చేసుకోవలసిన అవసరం ఉంది

జిల్లా పార్టీ ఇన్‌చార్జి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

‘పార్టీ కార్యకర్తల్లో కొన్ని అసంతృప్తులు, ఇబ్బందులు ఉండడం వాస్తవమే, వాటిని ఎలా అధిగమించాలనే దానిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలో సందేశం ఇస్తారు’...అని టీటీడీ చైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన విశాఖపట్నం జిల్లా పార్టీ ప్లీనరీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ కోసం కష్టపడిన వారిలో కొందరికి న్యాయం జరిగిందని, మిగిలిన వారికి కూడా జరుగుతుందని భరోసా ఇచ్చారు. జూలై 8,9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీలో 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన దశ,దిశను సీఎం జగన్‌ నిర్దేశిస్తారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోను అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేశారని కొనియాడారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని భావించి...విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే ప్రతిపక్షాలు, మరికొందరు న్యాయపరమైన చిక్కులు సృష్టించారన్నారు. రాబోయే రోజుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగానే కాకుండా సుందర నగరంగా తీర్చిదిద్దుతామని సుబ్బారెడ్డి ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో 95 శాతం హామీలను అధికారం చేపట్టిన మూడేళ్లలోనే జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేశారన్నారు. అదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విషయానికి వస్తే 2014 ఎన్నికల మేనిఫెస్టోని అధికారం చేపట్టిన తర్వాత వెబ్‌సైట్‌ నుంచి తొలగించేశారని ఆరోపించారు. అదే వైసీపీకి టీడీపీకి తేడా అని కార్యకర్తలు, ప్రజలు గమనించాలని కోరారు. 2024 ఎన్నికల్లో తిరిగి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుపెట్టుకుని పనిచేయాలని కోరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ అనే అంశాలే పార్టీకి మూల సిద్ధాంతమని, దీనిని ఎట్టి పరిస్థితిల్లోనూ ఉల్లంఘించేది లేదన్నారు. అన్నిరంగాల్లోనూ మహిళా సాధికారతే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే సంక్షేమ పథకాలు, పదవుల్లో వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వలంటీరు, సచివాలయ సిబ్బందిని పార్టీ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం వారందరినీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను కలిపేలా ఒక కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పంపించాలని  సుబ్బారెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక, చోడవరం ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌ తదితరులు ప్రసగించారు.


ప్లీనరీపై నేతల పెదవివిరుపు

ఆశించిన స్థాయిలో కనిపించని కార్యకర్తలు

భీమిలి నుంచి స్కూల్‌ బస్సుల్లో జనం తరలింపు

ముఖ్య నేతల ప్రసంగాలకు ముందే సీట్లలో నుంచి లేచివెళ్లిపోయిన జనం


విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి ప్లీనరీకి సన్నాహకంగా గురువారం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్లీనరీపై వైసీపీ నేతలు పెదవివిరుస్తున్నారు. ప్లీనరీకి ఆశించిన స్థాయిలో జనాలను సమీకరించలేకపోయామని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. నగర నడిబొడ్డున వున్న గురజాడ కళాక్షేత్రంలో ప్లీనరీ ఏర్పాటుచేయడంతో కార్యకర్తలు భారీగా తరలివస్తారని నేతలు భావించారు. కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్లీనరీ ప్రారంభ సమయానికి అట్టట్ట...సీట్లు నిండాయి. ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు, ఇతర కార్పొరేటర్లు, భీమిలి నియోజకవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు స్కూల్‌ బస్సుల్లో జనాలను తీసుకురాకపోతే పరిస్థితి ఘోరంగా వుండేదని నేతలు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం. ఇదిలావుండగా ప్లీనరీకి హాజరైన వారిలో ముఖ్య నేతల ప్రసంగాలు ప్రారంభించక ముందే చాలామంది సీట్ల నుంచి లేచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. దీనిని గమనించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు వేదిక పైనుంచే అందరూ కూర్చోవాలంటూ కోరినా పట్టించుకోకపోవడంతో...గేట్ల వద్ద బెంచీలు అడ్డంపెట్టాల్సి వచ్చింది. అయినా సరే వేరే మార్గాల్లో బయటకు వెళ్లిపోవడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని, టీటీడీ చైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడే సమయానికి సగం సీట్లు ఖాళీగా కనిపించాయి.



Updated Date - 2022-07-01T06:52:37+05:30 IST