అంతా తుస్‌!

ABN , First Publish Date - 2022-06-30T06:32:53+05:30 IST

ఆరంభం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. చివర్లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ భావోద్వేగ ప్రసంగం. అంతకుమించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే అవకాశం లేకపోవటం, అన్నిచోట్లా అసమ్మతివాదులు అల్లంత దూరంలోనే ఉండటం లాంటి సన్నివేశాలతో జిల్లాలో అధికార వైసీపీ చేపట్టిన ప్లీనరీల కార్యక్రమం ముగిసింది.

అంతా తుస్‌!
వైసీపీ ముఖ్యనేతలు మాట్లాడే సమయానికి వెలవెలబోయిన జిల్లా ప్లీనరీ ప్రాంగణం (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న మంత్రి సురేష్‌, మాజీ మంత్రి బాలినేని

ప్లీనరీల్లో బహిర్గతమైన డొల్లతనం

బాలినేని, మద్దిశెట్టి వ్యాఖ్యలే దర్పణం   

పెదవి విప్పే అవకాశం దక్కని కార్యకర్తలు 

అల్లంతదూరంగానే అసమ్మతీయులు 

 వై.పాలెం హైలైట్‌, బాగా వెనుకబడ్డ పర్చూరు, గిద్దలూరు 

ఆరంభం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. చివర్లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ భావోద్వేగ ప్రసంగం. అంతకుమించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే అవకాశం లేకపోవటం, అన్నిచోట్లా అసమ్మతివాదులు అల్లంత దూరంలోనే ఉండటం లాంటి సన్నివేశాలతో జిల్లాలో అధికార వైసీపీ చేపట్టిన ప్లీనరీల కార్యక్రమం ముగిసింది. తద్వారా పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో ఉన్న డొల్లతనం బహిర్గతమైంది. ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల సానుకూలత లేదనే అంశం తేటతెల్లమైంది. ప్లీనరీలను భారీగా నిర్వహించేందుకు కొందరు ప్రాధాన్యమివ్వగా, చేశామంటే చేశామన్న రీతిలో కొందరు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితిని చూస్తే వైపాలెంలో ప్లీనరీకి అత్యధికంగా కార్యకర్తలు హాజరుకాగా.. పర్చూరు, గిద్దలూరులలో  అత్యల్ప సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

పార్టీ నిర్మాణ వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ పార్టీలు కిందిస్థాయి నుంచి నిర్వహించే సభలపై ఈ పర్యాయం వైసీపీ కూడా దృష్టిపెట్టింది. అందులో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటుచేసుకుని నియోజకవర్గ ఆపై జిల్లాస్థాయిలో ప్లీనరీలు నిర్వహించుకుని రాష్ట్ర ప్లీనరీకి హాజరుకావాలని ఆ పార్టీ ఆదేశించింది. అవి ఎలా జరుగుతాయని పరిశీలించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటుచేసింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలో కార్యక్రమాల నిర్వహణకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు పూర్తి ప్రాధాన్యమిచ్చారు.


తూతూమంత్రంగా కమిటీల ఏర్పాటు..

గ్రామ, మండల, నియోజకవర్గ పార్టీ కమిటీల ఏర్పాటు వ్యవహారం తూతూమంత్రంగానే నిర్వహించినట్లు వెల్లడవుతోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు జై కొట్టేవారికే ప్రాధాన్యతనిచ్చారు. నియోజకవర్గ, జిల్లాస్థాయి ప్లీనరీల నిర్వహణ పూర్తయినా ఇంతవరకు అనేక నియోజకవర్గాల్లో కమిటీలను వెల్లడించలేదు. రాష్ట్ర కమిటీ ఆమోదానికి పోవాల్సిన జిల్లా కమిటీ కూర్పు ప్రతిపాదన కూడా వెళ్లలేదని తెలిసింది. ఈ కమిటీలను వెల్లడిస్తే కిందిస్థాయిలోని విభేదాలు బహిర్గతమై ఆ ప్రభావం ప్లీనరీల మీద పడొచ్చన్న ఉద్దేశంతో కమిటీల ప్రకటనను చేయటం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. 


బాలినేని, మద్దిశెట్టి వ్యాఖ్యలు దేనికి సంకేతం? 

ఒంగోలు ప్లీనరీలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్లీనరీలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌లు వారి ప్రసంగాల్లో ప్రస్తావించిన అంశాలు కీలకంగా మారాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పార్టీలోని కొందరు నాయకులు, ప్రత్యేకించి ఒకరిద్దరు పెద్ద నాయకులు టీడీపీతో కుమ్మక్కై తనను, తన కుమారుడిని అభాసుపాలు జేసే ప్రయత్నం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రస్థాయిలోనే చర్చనీయాంశంగా మారాయి. బాలినేని ఉద్దేశం ఏదైనా ఆయన మాటలు అలానే సాగాయి. గతం నుంచి ఉన్న అంతర్గత సమస్యలను దృష్టిలో ఉంచుకుని తన బావ అయిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని పరోక్షంగా ఎత్తి పొడిచాడా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే అల్లూరు విషయంలో చీరాలకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి జోక్యం ఉండటంతోనే బాలినేని ఆ విధంగా స్పందించారని ఆ పార్టీలోని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇటీవల బాలినేనిపై తన అనుచరుల వద్ద బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఆయన ఒంగోలులోని ఒకరిద్దరు తెలుగుదేశం స్థానిక నేతలతో టచ్‌లో ఉన్నారని కూడా సమాచారం ఉందని కొందరు చెప్తున్నారు. ఇలాంటి రకరకాల ఊహాగానాలతో బాలినేని మాటలపై జిల్లాలోని ఆ పార్టీశ్రేణుల్లో పెద్దస్థాయిలో చర్చ జరుగుతుండటం విశేషం. ఇక బాలినేని రానున్న రెండేళ్లపాటు కార్యకర్తల కోసమే పనిచేద్దామంటూ చేసిన ప్రసంగం కూడా ఆలోచింపజేసింది.  


వేణుగోపాల్‌ వ్యాఖ్యల కలకలం

ఇంకోవైపు బుధవారం జరిగిన జిల్లా ప్లీనరీలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ చేసిన ప్రసంగం కూడా యావత్తు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మద్దిశెట్టి లేవనెత్తిన అంశాలన్నీ నిజమేనన్న అభిప్రాయాన్ని ఆ పార్టీశ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక ఎమ్మెల్యేలు బలోపేతం కాకుండా సీఎం గ్రాఫ్‌ పెరిగినందున ఉపయోగం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అలాగే కార్యకర్తలు ఏవిధంగా ఆర్థికంగా దెబ్బతిన్నారో కూడా ఆయన తేటతెల్లం చేశారు. అందుకు కూడా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని సూటిగా చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను విస్మరించటం ద్వారా గడపగడపకు వెళ్లినప్పుడు ప్రజలు ఎలా నిలదీస్తున్నారో కూడా తేటతెల్లం చేశారు. అనేక అంశాలపై సూటిగా మాట్లాడిన మద్దిశెట్టి మాటలను ఆపార్టీశ్రేణులు పాజిటివ్‌గా తీసుకుంటుండగా ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలోని ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ఇక అన్ని ప్లీనరీలలో మాట్లాడేందుకు కార్యకర్తలకు పెద్దగా అవకాశం ఇవ్వకపోయినా అడపాదడపా చాలామంది నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆపార్టీలో అంతర్గతంగా సమస్యలు అధికంగా ఉన్నాయని, కార్యకర్తలు సంతృప్తిగా లేరన్న విషయం బహిర్గతమైంది. 


వైపాలెం హైలెట్‌

అన్ని నియోజకవర్గ ప్లీనరీలు, చివరికి జిల్లాస్థాయి ప్లీనరీ కూడా కల్యాణమండపాలు, ఇతర సమావేశ భవనాల్లో జరిగాయి. వైపాలెం ప్లీనరీ మాత్రం మంత్రి సురేష్‌ బహిరంగ వేదికలో నిర్వహించారు. అధికసంఖ్యలో కార్యకర్తలు కూడా అక్కడే హాజరయ్యారు. ఆ తర్వాత అద్దంకి, కొండపి నియోజకవర్గాల ప్లీనరీలలో కార్యకర్తల హడావుడి కనిపించింది. పర్చూరు, గిద్దలూరు ప్లీనరీలకు మాత్రం అన్నింటికన్నా తక్కువసంఖ్యలో కార ్యకర్తలు హాజరయ్యారు.



మాగుంట సందిగ్ధం 

ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన లోక్‌సభలోని అన్ని నియోజకవర్గాల ప్లీనరీలకు హాజరయ్యారు. ప్రతిచోటా స్థానిక ఎమ్మెల్యేను లేక ఇన్‌చార్జిని వచ్చే ఎన్నికలలో కూడా ఆదరించమని కోరిన ఆయన ఒకటి రెండుచోట్ల తనలాగే తన కుమారుడిని, మరోచోట తన కుటుంబాన్ని, కొన్నిచోట్ల తనను మళ్లీ ఆదరించాలని కోరారు. నిజానికి మాగుంట తనయుడు రాఘవరెడ్డి గత ఎన్నికల సమయం నుంచి రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను కలిసి ముందుకుసాగే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి కుమారుడుని రంగంలోకి దించాలన్న ఆలోచనతో ఎంపీ ఉన్నారు. అదే విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాడని తెలిసింది. అయితే ఈ ప్లీనరీ సందర్భంగా అన్నిచోట్లా కుమారుడి పేరుని ప్రస్తావించి ఆదరించాలని కోరకపోవటంతో అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతాలు ఉన్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-06-30T06:32:53+05:30 IST