దొంగ ఓట్లకు వైసీపీ కుట్ర

ABN , First Publish Date - 2022-06-21T05:40:56+05:30 IST

ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌ రోజున దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, ఈ ఎన్నికల్లో సీఆర్పీఎఫ్‌ బలగాలను వినియోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.

దొంగ ఓట్లకు వైసీపీ కుట్ర

ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు

 వలంటీర్ల ఎన్నికల ప్రచారం నిరోధించాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆత్మకూరు, జూన్‌ 19 : ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌ రోజున దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, ఈ ఎన్నికల్లో సీఆర్పీఎఫ్‌ బలగాలను వినియోగించాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. సోమవారం ఆత్మకూరుకు  వచ్చిన చీఫ్‌ ఎన్నికల  అధికారి ముఖేష్‌కుమార్‌మీనాకు ఆయన వినతిపత్రం అందజేశారు.  బీజేపీ అభ్యర్థితో పాటు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌కు భద్రత కల్పించాలని కోరారు. మర్రిపాడు, ఆత్మకూరు తదితర మండలాల్లో రిగ్గింగ్‌ నివారించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. మర్రిపాడులో ప్రస్తుత ఎన్నికల విధులను మరో అధికారికి అప్పజెప్పాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ దొంగ ఓట్లు వేయించేందుకు కుట్రపన్నుతుందని విమర్శించారు. వలంటీర్లు అధికారపార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రచారం చేస్తున్న వలంటీరును అడ్డుకున్న  బీజేపీ అభ్యర్థి భార్యతో ఘర్షణకు దిగిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఓటమి భయంతో ఓటర్లకు డబ్బులు పంచేందుకు పూనుకోవడం హేయమైన చర్య అని  విమర్శించారు. మర్రిపాడు, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాలలో పోలింగ్‌ బూత్‌ల వద్ద భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి ఓటమి భయం

రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహరావు

 ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. స్థానిక త్రికోటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వలంటీర్ల ద్వారా అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు పంపిణి చేయించడం సిగ్గుచేటన్నారు.  తిరుపతి, బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారం ఆత్మకూరులో కూడా కొనసాగబోతుందన్నారు. స్థానికంగా లేని వారు, చనిపోయిన వారి ఓట్లకు సంబంధించి నకిలీ గుర్తింపు కార్డులతో వచ్చి వైసీపీ ఓట్లు వేయించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. అధికారులు బయట వ్యక్తులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి,  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. పి. సురేంద్రరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌,నేతలు జయప్రకాష్‌, మిట్టా వంశీ పాల్గొన్నారు.


 రేషన్‌ అమ్ముకుంటున్నారు..

బీజేపీ జాతీయకార్యదర్శి సునీల్‌ దేవధర్‌ 

 మర్రిపాడు:  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని కూడా పంచకుండా రెండు నెలల నుంచి కృష్ణపట్నం పోర్టు వద్ద అమ్ముకుంటున్నారని బీజేపీ జాతీయకార్యదర్శి సునీల్‌ దేవధర్‌ ఆరోపించారు. ఆత్మకూరు బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ను గెలిపించాలంటూ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   పీఎం గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లకు డబ్బులు ఇస్తే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాహా చేసిందని, శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు రైల్వే లైన్‌ మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వే చేయించలేక చేతులెత్తేసిందని విమర్శించారు. భరత్‌ కుమార్‌ యాదవ్‌కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.

అనంతసాగరం : ఇసుక, మద్యం, గ్రావెల్‌తో అధికార వైసీపీ ప్రజాధనాన్ని దోచేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ ఆభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌తో కలసి సోమవారం సాయంత్రం అనంతసాగరంలో  రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా సత్యకుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కాకురు నాగరాజారెడ్డి, అల్లంపాటి రమణారెడ్డి, మాకిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, కొమ్మి తిరుపతి నాయుడు  పాల్గొన్నారు.

సంగం : రాష్ట్రంలో రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పెద్ద స్కామ్‌కు  పాల్పడడంపై విచారణ చేపట్టాలని ఆహార భద్రత, పౌర సరఫరాలశాఖ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు ఫిర్యాదు చేస్తామని రాజ్యసభ సభ్యుడు జి.వి. నరసింహరావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ తరఫున సంగంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా పుట్టికి 200 కిలోల అదనంగా ధాన్యం తీసుకుని మిల్లర్లు, దళారుల ద్వారా వైసీపీ ప్రభుత్వం పెద్ద స్కామ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఇందులోప్రభుత్వానికి, నాయకులకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షులు కాకు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ నారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

కేంద్రం నిధులతో వైసీపీ పథకాలు 

ఏఎస్‌పేట: ఒక అమ్మఒడి పథకం తప్ప మిగిలిన అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఆర్డీ విల్సన్‌ తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని పలు దళితవాడల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకపాటి కుటుంబానికి ఓటేస్తే సముద్రంలో వేసినట్టేనని, ప్రజలకు అందుబాటులో ఉండరని ఎద్దేవా చేశారు. ప్రతిఒక్కరు బీజేపీకి ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు దర్శికుంట వాసు, నాయకులు హుస్సేన్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-21T05:40:56+05:30 IST