ఫలించని వ్యూహం

ABN , First Publish Date - 2021-03-04T07:02:40+05:30 IST

ఏకగ్రీవ ఎంపికల ద్వారానే చైర్మన్‌ పదవులను చేజిక్కించుకోవాలనుకున్న అధికారపార్టీ ఆశలకు ప్రతిపక్ష టీడీపీ బ్రేక్‌ వేయగలిగింది.

ఫలించని వ్యూహం
నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు పరుగు పెడుతున్న అద్దంకి 8వ వార్డు వైసీపీ అభ్యర్థి పరుశురాం (ఎర్రచొక్కా వ్యక్తి)

అధికార ఏకగ్రీవాలతో పురాల కైవసానికి బ్రేక్‌ 

మార్కాపురంలో మళ్లీ బరిలోకి దిగిన టీడీపీ

చీరాలలో రెబ ల్స్‌గా ఆమంచి అనుచరులు 

ఒంగోలులో ఒక్క డివిజన్‌లోనే ఏకగ్రీవం 

గిద్దలూరు, కనిగిరిలో ఏడేసి వార్డులకే పరిమితం 

అద్దంకిలో ఏకగ్రీవాలు నిల్‌ 


ఏకగ్రీవాలతోనే మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలనుకున్న అధికార పార్టీ ఆశలకు బ్రేక్‌ పడింది. ముఖ్యంగా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరులలో వైసీపీ నాయకులు అలాంటి ఎత్తుగడలు వేసినా అవి ఫలించలేదు. కొద్దిపాటి వార్డులను మాత్రమే దక్కించుకోగలిగారు. చీరాలలోనూ ఆ ప్రయత్నం వికటించింది. అద్దంకిలో ఒక వార్డుని ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నానికి చివర్లో అడ్డుకట్ట పడింది. ఒంగోలులో ఒక్క డివిజన్‌ని మాత్రమే ఏకగ్రీవంగా సాధించుకోగలిగారు. చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి అనుచరులు రెబల్‌ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ఒకరిద్దరైతే ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం పలికారు. మొత్తంగా జిల్లాలో మున్సిపోల్స్‌ రసవత్తరంగా మారాయి.


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

ఏకగ్రీవ ఎంపికల ద్వారానే చైర్మన్‌ పదవులను చేజిక్కించుకోవాలనుకున్న అధికారపార్టీ ఆశలకు ప్రతిపక్ష టీడీపీ బ్రేక్‌ వేయగలిగింది. ఎన్నికల బహిష్కరణకు సిద్ధ మైన మార్కాపురం టీడీపీ నేతలు చంద్రబాబు జోక్యంతో తిరిగి అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఇటు ఎమ్మెల్యే బలరాం, అటు మాజీ ఎమ్మెల్యే ఆమంచిల మధ్య సయో ధ్యతో చీరాలలోను ఏకగ్రీవాలతో విజయం సాధించాలను కున్న అధికారపార్టీ ప్రయత్నం ఫలించలేదు. పైగా అక్కడ రెబల్స్‌ బెడద తప్పకపోవచ్చనిపిస్తోంది. కనిగిరిలో అధికారపార్టీ నాయకులు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా  టీడీపీ నేత డాక్టరు ఉగ్రనరసింహారెడ్డి సారథ్యంలో వారి ప్రయత్నాలకు బ్రేక్‌ వేయగలిగారు. గిద్దలూరులోను ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. నామినేషన్‌ వేసిన విపక్షాల వారిని ప్రలోభపెట్టడం, బెదిరించటం ద్వారా ఏకగ్రీవంగా మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవాలని భావించిన అధికారపార్టీకి నిరాశే మిగిలింది. ఎక్కడికక్కడ విపక్ష టీడీపీ, జనసేన తరపున నామినేషన్లు వేసినవారు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సమరానికి సన్నద్ధమయ్యారు.   నామినేషన్ల ఉపసంహరణ, ఇతర పరిస్థితులను పర్యవేక్షిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ విజయాలను సాధించకపోతే ఇబ్బందిపడతారంటూ స్థానిక నేతలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.  తెలుగుదేశం పక్షాన సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే జోక్యం చేసుకుని నాయకులు వెనుకడుగు వేయకుండా ధైర్యాన్ని నింపుతుండటం విశేషం.


మార్కాపురంలో పోటీకి దిగిన టీడీపీ

పోటీని బహిష్కరించిన మార్కా పురం టీడీపీ నేతలు బుధవారం మనసు మార్చుకు న్నారు. పోటీకి సిద్ధమై నామినేషన్లు వేసిన ఆ పార్టీ వారికి బీ ఫాంలు ఇచ్చేశారు. ఆపార్టీ నేత నారాయణరెడ్డి మార్కాపురంలో టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. నారాయణరెడ్డితో నేరుగా చంద్రబాబే మాట్లాడినట్లు తెలిసింది. బహిష్కరణ  నిర్ణయం ఎందుకు తీసుకున్నామనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేయగా.. మేం అన్ని విషయాలు తెలుసుకున్నాం, పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండాల్సిందే. గెలుపు ఓటములే ప్రామాణికం కాదంటూ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా జనసేన, బీజేపీ కూటమి రమారమి 20 డివిజన్ల లో పోటీకి సిద్ధంకావటం కూడా టీడీపీ స్థానిక నాయకుల వైఖరి మారటానికి కారణంగా భావిస్తున్నారు. టీడీపీ పోటీకి దిగటంతో ఏకగ్రీవాలతోనే చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న వైసీపీ ప్రయత్నం బెడిసికొట్టింది. మొత్తం 35వార్డులకు గాను కేవలం 5 వార్డుల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగలిగారు. 


చీరాలలో.. 

చీరాలలో అధిష్ఠానం తరపున మంత్రి బాలినేని ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా పార్టీ పరిశీలకులే అభ్యర్థుల ను ఎంపిక చేసి వారికి బీఫాంలను అందజేశారు. మిగిలిన వైసీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించాలని ఇటు ఎమ్మెల్యే బలరాం, అటు మాజీ ఎమ్మెల్యే ఆమంచికి సూచించారు. అయితే అధిష్ఠానం ఆశించిన ఫలితం రాలేదు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి మిగిలిన అభ్యర్థుల నామినేషన్లను ఉపసం హరించే విషయంలో ఆ ఇద్దరు నాయకులు సఫలమైతే ఏకగ్రీవంగా మున్సిపా లిటీని కైవసం చేసుకోవాలని భావించిన అధిష్ఠానం స్థానిక నాయకుల పోకడతో తీవ్ర అసంతృప్తికి గురైంది. కాగా అధికారికంగా వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో గతంలో కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత వైసీపీలో ఆరంభం నుంచి ఉన్న పలువురికి చోటు దక్కడంతోపాటు మొత్తంపై ఎమ్మెల్యే బలరాం, ఇతర వైసీపీ నాయకుల మద్దతుదారులే ఎక్కువమంది అభ్యర్థులు కాగలిగారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి నుంచి పలువురు వైసీపీ నాయకులు విడుదలైన జాబితా పట్ల హర్షం ప్రకటించారు. ఆ నాయకులు, ఎమ్మెల్యే బలరాం కలిసి ఎన్నికల పనిలో పడిపోయారు. అయితే ఆమంచి అనుచరులు మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆమంచి మద్దతుతో చైర్మన్‌ కావాలని భావిస్తున్న నాయకులకు వార్డులో పోటీచేసేందుకు వైసీపీ తరపున అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. దీంతో నామినేషన్‌ వేసిన వారిలో ఆమంచి అనుచరులుగా ఉన్న కొందరు స్వతంత్రులుగా రంగంలో ఉండాలని నిర్ణయించుకున్నా రు. రెండు మూడు వార్డుల్లో వారైతే  గుర్తులు కేటాయింపు జరిగిన వెంటనే ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అయితే తమ పోటీకి, ఆమంచికి సంబంధం లేదని చెప్తున్నారు. టీడీపీ అవకాశం ఉన్న మేరకు 15 వార్డుల్లో తన అభ్యర్థులను రంగంలోకి దించి బీఫాంలను అందజేసింది. మొత్తంపై 3 వార్డుల్లో ఏకగ్రీవ ఎంపికలు జరగ్గా రెండు చోట్ల బలరాం అనుచరులు, ఒక చోట ఆమంచి మద్దతుదారుడు ఎన్నికయ్యారు. 


  ఒంగోలులో..

ఒంగోలులో ఒక్క డివిజన్‌లో మాత్రమే వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణ కు సిద్ధపడినా సమయం దాటిపోవటంతో కుదరలేదు. అయితే టీడీపీ ఐదుచోట్ల నామినేషన్లు పరిశీలనలోనే కోల్పోవటంతో 45స్థానాలకే పరిమితమైంది. వైసీపీ 49 స్థానాల్లోనూ పోటీలో ఉంది. అయితే జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు కూడా పోటీలో ఉన్నాయి. అభ్యర్థులు లేనిచోట్ల టీడీపీ జనసేనకు మద్దతిస్తోంది. వైసీపీలో మూడు నాలుగు వార్డుల్లో అసంతృప్తుల బెడద కనిపిస్తోంది. ప్రధానంగా 15వ డివిజన్‌లో మాజీ కౌన్సిలర్‌ చింతపల్లి గోపి రెబల్‌ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. అక్కడ వైసీపీ తోటకూర శ్రీకాంత్‌ని తమ అభ్యర్థిగా రంగంలో నిలిపింది. 


కనిగిరి, గిద్దలూరులో..

కనిగిరి, గిద్దలూరుల్లో  ఏడేసి వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ప్రధానంగా కనిగిరిలో 10కిపైగా వార్డులను ఏకగ్రీవం చేయాలని ఆ పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇటు పార్టీ నేతలు, అటు అధికారులు సకల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత డాక్టరు ఉగ్రనరసింహారెడ్డి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీశ్రేణులను నిలబెట్టుకోగలిగారు. ఫలితంగా 13 వార్డుల్లో అక్కడ పోటీ జరగబోతోంది. గిద్దలూరులోను ఏడు వార్డులకే ఏకగ్రీవ ఎంపికలు పరిమితమయ్యాయి. అయితే బెదిరింపుల కన్నా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకే ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రాధాన్యమిచ్చారు. మరోవైపు టీడీపీ నేత అశోక్‌రెడ్డి, టీడీపీ క్యాడర్‌కి వెన్నుదన్నుగా నిలవటంతో 13వార్డుల్లో పోటీ అనివార్యమైంది.


అద్దంకిలో ఫలించని ప్లాన్‌

ఏకగ్రీవ ఎంపికల కోసం అద్దంకిలో వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వైసీపీ తరపున కృష్ణ చైతన్య ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా పంచాయతీ ఎన్నికల అనంతరం టీడీపీ పక్షాన ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చారు. టీడీపీ నుంచి ప్రారంభమైన వలసలకు బ్రేక్‌ వేసుకోగలిగారు. చివర్లో 8వవార్డు ఏకగ్రీవంగా వైసీపీకి దక్కినట్లే కనిపించింది. టీడీపీ పక్షాన నామి నేషన్‌ వేసిన ఇద్దరి చేత వైసీపీ నేతలు ఉపసంహ రింపజేయగలిగారు. మిగిలిన ఇద్దరు వైసీపీ వారిలో ఒకరిచేత నామినేషన్‌ ఉపసంహరింపజేసిన నాయకులు అప్పటికే టీడీపీ వారి చేతిలో ఉన్న మరో అభ్యర్థి తరపున పార్టీ బీఫాంను ఇచ్చారు.  అందుకో సం వేచి కూర్చున్నారన్నట్లుగా ఎమ్మెల్యే రవికుమార్‌ చివరి నిమిషంలో తన కారులో వైసీపీ తరపున నామినేషన్‌ వేసిన అభ్యర్థిని అధికారుల ముందు ప్రవేశపెట్టారు. ఒక్క నిమిషం ముందుగా ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారు. దీంతో వైసీపీకి ఏకగ్రీవంగా దక్కాల్సిన 8వవార్డు దక్కలేదు. దీంతో అక్కడ 19 వార్డుల్లో పోటీ జరుగుతుండగా అన్నిచోట్టా వైసీపీ అభ్యర్థులు, 18చోట్ల టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు.






Updated Date - 2021-03-04T07:02:40+05:30 IST