పెద్దాపురం Ycpలో ముసలం..ఇంఛార్జి దొరబాబు తీరుపై కేడర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-27T23:49:44+05:30 IST

వైసీపీలో చిచ్చు రాజుకుంది. పెద్దాపురం (peddapuram) నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌ దవులూరి దొరబాబుపై పార్టీ కేడరే మండిపడుతోంది...

పెద్దాపురం Ycpలో ముసలం..ఇంఛార్జి దొరబాబు తీరుపై కేడర్ ఆగ్రహం

పెద్దాపురం: వైసీపీ (Ycp)లో చిచ్చు రాజుకుంది. పెద్దాపురం (Peddapuram) నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌ దవులూరి దొరబాబు (Davuluri Dorababu)పై పార్టీ కేడరే మండిపడుతోంది. దొరబాబును ఇన్‌చార్జ్‌ నుంచి తప్పించాలంటూ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొరబాబు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దొరబాబు అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వాస్తవానికి గత ఎన్నికల్లో పెద్దాపురం వైసీపీ టిక్కెట్‌ దొరబాబుకే వస్తుందనుకున్నారు. కానీ భంగపాటు ఎదురైంది. అయితే ఈసారి ఎలాగైనా టిక్కెట్‌ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ సమయంలో సొంత పార్టీ నేతలనుంచి అసమ్మతి రేగడంతో  దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో తన గాడ్ ఫాదర్ వైవీ సుబ్బారెడ్డి(Subbareddy)ని ఆశ్రయించారు. 



దాంతో దొరబాబుకు వ్యతిరేకంగా పార్టీ కేడర్  ప్రత్యేకగా సమావేశం అయ్యారు. పెద్దాపురంలో వైసీపీకి  దొరబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రాజప్పతో కుమ్మక్కయి...పార్టీని సమాధి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో దొరబాబుకు టిక్కెట్  ఇస్తే పార్టీ నామ రూపాల్లేకుండా పోతుందనే నిర్ణయానికి వచ్చారు. తక్షణం దొరబాబును ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించాల్సిందేనని తీర్మానించారు. 


అయితే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కన్నబాబు, జిల్లా పార్టీ పర్యవేక్షకుడు ఎంపీ బోస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి విడివిడిగా అస్మతి నేతలందరినీ  బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ అవీ బెడిసికొట్టాయి. పెద్దాపురం వైసీపీలో ముసలంపై పార్టీ అధినేత జగన్ సీరియస్‏గా ఉన్నారని, ఏవిషయంపైనా నేతల రోడ్డెక్కొద్దని పార్టీ పెద్దలంతా అసమ్మతి నేతలకు సూచించారు. 


అయినా వారెవరు వెనక్కు తగ్గడంలేదు. దొరబాబును తప్పించే వరకు ఉద్యమం చేస్తామని తేల్చిచెప్పేశారు. దీంతో తాత్కాలికంగా ఆందోళనను సద్దుమణిగేలా చేయడానికి దొరబాబును తప్పిస్తామని పార్టీ పెద్దలు మాట ఇచ్చారు. అయితే దీన్ని నెరవేర్చకపోతే మళ్లీ  ఉద్యమిస్తామని హెచ్చరించడంతో మాజీ మంత్రి కన్నబాబు (Ex Minister Kannababu)... రాజ్యసభ సభ్యుడు బోస్ (MP Bose) తలపట్టుకుంటున్నారు. మరో పక్క దొరబాబు అనుకూల వర్గం మాత్రం.. ఇది అక్కసుతో చేస్తున్న పని అని కొట్టి పారేస్తున్నారు. దీంతో ఇప్పుడు దొరబాబు అనుకూల, వ్యతిరేక వర్గాల సోషల్ మీడియా (Social Media) యుద్ధంతో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.



Updated Date - 2022-06-27T23:49:44+05:30 IST