అవును అనలేరు.. కాదనలేరు... YS Jagan నిర్ణయంతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..!

ABN , First Publish Date - 2022-02-07T18:08:02+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుపై కొంత మంది వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే... మరి కొంతమందికి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో

అవును అనలేరు.. కాదనలేరు... YS Jagan నిర్ణయంతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..!

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. కొత్త జిల్లా పేరుతో దూర ప్రాంతాలకు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలిపారని అధికార పార్టీ నేతలపై జనం ఫైర్ అవుతున్నారు. మీకు చేతకాకుంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతతో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై అసంతృప్తి గళం వినిపించాల్సి వస్తోంది. మరికొందరు నేతలు నియోజకవర్గంలో ముఖం చాటేస్తున్నారు. అసలు వైసీపీ నేతలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


ప్రకాశం జిల్లాలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతం

కొత్త జిల్లాల ఏర్పాటుపై కొంత మంది వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే... మరి కొంతమందికి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఏం మాట్లాడాలో అర్థంకాక ప్రకాశం జిల్లాలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతం అయిపోతున్నారట. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. ప్రజలు ఛీ కొడతారని బెదిరిపోతున్నారట. ఇప్పటికే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


కొత్త జిల్లాల లిస్ట్‌లో ఒంగోలు

ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీలు, నెల్లూరు పార్లమెంట్‌లో ఒక అసెంబ్లీ, బాపట్ల పార్లమెంట్‌లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన లిస్ట్‌లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోకి.. బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న సంతనూతలపాడుని కలిపారు. అయితే బాపట్ల పార్లమెంట్ జిల్లాలోకి వెళ్లిన అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.


ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న ఒంగోలు అద్దంకి నియోజకవర్గానికి దగ్గరగా ఉంది. పర్చూరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఒంగోలుకి దగ్గరగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు అధికార పార్టీ నేతలపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలో కలిపితే జిల్లా హెడ్‌క్వార్టర్ దూరం అవుతుందని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటూ అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణ చైతన్య ప్రభుత్వానికి లేఖ రాశారు.


వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ 

ఒంగోలుకి దగ్గరగా ఉన్న  కందుకూరుని వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న నెల్లూరులో కలపడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న కందుకూరుని కావలి రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. దీంతో కందుకూరులో రెవెన్యూ డివిజన్ కూడా లేకుండా పోయింది. కందుకూరు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చలేకపోతే వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి స్పందించక తప్పలేదు. ప్రభుత్వ  నిర్ణయంపై కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి బహిరంగంగా తనదైన శైలిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కందుకూరు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.


మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎమ్మెల్యేపై స్థానికుల ఒత్తిడి 

పశ్చిమ ప్రకాశంలో ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ మంత్రి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డి, బుర్రా మధుసూదన్‌ పరిస్థితి కూడా ఇలానే ఉందట. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మార్కాపురం రెవెన్యూ డివిజన్‌ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మార్కాపురంను కూడా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తారని ప్రజలు భావించారు. కానీ ప్రజల ఆశలపై జగన్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీంతో మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేయించాలని వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎమ్మెల్యేపై స్థానికుల నుండి ఒత్తిడి పెరిగింది. 


వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి

అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేయలేక... ప్రజలకు మద్దతు తెలపలేక వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైసీపీకి కాస్త బలంగా భావించే నియోజక వర్గాల నుండి ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో నేతలు సతమతమైపోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఉన్నా... నియోజక వర్గాల్లో పార్టీకి నష్టం వాటిల్లుతుందంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారట. మరి కొత్త జిల్లా ఏర్పాటుపై నియోజకవర్గాల్లో జనం నుండి వస్తున్న వ్యతిరేకతను వైసీపీ నేతలు ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి. 

Updated Date - 2022-02-07T18:08:02+05:30 IST