ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని వైసీపీ ఎంపీలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా లేఖ ద్వారా ఏపీ సీఎం జగన్ మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారని తెలిపారు. అదుపు, ఆజ్ఞ లేని ప్రైవేటీకరణ దేశ వినాశనానికి దారితీస్తుందన్న మాజీ ప్రధాని అటల్ సూచించారని గుర్తుచేశారు. అటల్ సూచనను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఏపీ విభజన తర్వాత మనకు కేంద్రం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ రూపంలో అతి పెద్ద దెబ్బ తగిలిందని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉభయసభలలో పెద్దఎత్తున ఆందోళన చేసి సభా కార్యక్రమాలను స్తంభింప చేసామని తెలిపారు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని, జగన్ మార్గదర్శకంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో మంది చేసిన ప్రాణత్యాగాలను కేంద్రం అవహేళన చేస్తుందని ఎంపీలు తప్పుబట్టారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదం కోసం వైసీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.