టీడీపీ నేతలకు ఫోన్లు.. ఆపరేషన్ ఆకర్ష్‌ను మళ్లీ మొదలుపెట్టిన వైసీపీ..!

ABN , First Publish Date - 2020-05-20T19:25:18+05:30 IST

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వైసీపీ మళ్లీ ప్రారంభించిందా? టీడీపీ ముఖ్య నేతలపై గురి పెట్టిందా? అన్న ప్రశ్నలకు జరుగు తున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది.

టీడీపీ నేతలకు ఫోన్లు.. ఆపరేషన్ ఆకర్ష్‌ను మళ్లీ మొదలుపెట్టిన వైసీపీ..!

టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీలపై వైసీపీ గురి

పలువురితో మంతనాలు.. నో అంటున్న కొందరు..

మొహమాటంతో మాట్లాడుతున్న మరికొందరు

పార్టీ మార్పుపై విస్తృత చర్చ 

ముఖ్య నాయకులకు టీడీపీ అగ్రనేత ఫోన్‌


ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వైసీపీ మళ్లీ ప్రారంభించిందా? టీడీపీ ముఖ్య నేతలపై గురి పెట్టిందా? అన్న ప్రశ్నలకు జరుగు తున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది.  ప్రతిపక్షానికి చెం దిన ప్రజాప్రతినిధులు, ఒకరిద్దరు మాజీలను తమవైపు రాబట్టుకునేందుకు అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీలో కొందరు నాయకులు వైసీపీ నేతలకు దూరంగా ఉంటుండగా, ఒకరిద్దరు నాయకులు మాత్రం మాటలు కలుపుతున్నారు. దీంతో జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ క్యాడర్‌లో నేతల పార్టీ మార్పు వ్యవహారంపై విస్తృత చర్చ నడుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్ఠానం కూడా పార్టీ జిల్లా నాయ కులకు ఫోన్లు చేసి మాట్లాడటం ప్రారంభించింది.  


జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు 

గత ఎన్నికల్లో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఒకట్రెండు జిల్లాల్లో మన జిల్లా కూడా ఉంది. వారిని లాక్కునే ప్రయత్నాలకు వైసీపీ గతేడాది డిసెంబర్‌లోనే శ్రీకారం పలికింది. చీరాల ఎమ్మెల్యే బలరాంను చేర్చుకోవవడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో కలకలం సృష్టించింది. ఇప్పుడు మిగిలిన నాయకులపై దృష్టి సారించింది. జిల్లాలో మిగిలిన టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీలు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వీరిలో గుంటూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యేతో సన్నిహిత సం బంధాలు ఉన్న ఎమ్మెల్యేను వైసీపీలోని కొందరు ముఖ్య నాయకులు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై జిల్లాలో వైసీపీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి ఆ నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్ల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయడంతో విషయం ఒక్కసారిగా బయటకు పొక్కింది. ఇది ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. 


మైండ్‌గేమ్‌తో గందరగోళం

జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, మరో ఒకరిద్దరు యువనేతలే లక్ష్యంగా వైసీపీ నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిద్దరిని చీరాల ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌ ద్వారా రాబట్టుకోవాలన్న ప్రయత్నిస్తున్నారు. మరో ఇద్దరు నాయకులకు వ్యాపారపరమైన స మస్యలు చూపించి బెదిరించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే వైసీపీ నాయకులు అనుకుంటున్నట్లు టీడీపీలోని ముఖ్య ప్రజా ప్రతినిధులు ఆ ఆలోచనతో లేరని తెలుస్తోంది. వైసీపీ నాయకులు ఒకరకమైన మైండ్‌గేమ్‌కు ప్రాధాన్యం ఇవ్వగా, టీడీపీ నేతలు మరోరకమైన వ్యూహంతో ముందుకు వెళ్తూ క్యాడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నారని పరిశీలకుల అంచనా. 


ముఖ్యుల రంగప్రవేశం

వైసీపీకి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేత ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన మన జిల్లాతోపాటు, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుల్లో ఒకరిద్దరితో కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు జిల్లాకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి కుటుంబ, వ్యాపార భాగస్వామ్య సభ్యులు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అగ్రనేతలు రెండ్రో జులుగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. కీలకనేత ఒకరు ఒక మాజీ ప్రజా ప్రతినిధితో 45 నిమిషాలు మాట్లాడినట్లు తెలిసింది. ఇదంతా వైసీపీ మైండ్‌గేమ్‌ తప్ప పార్టీ మారే ఆలోచనలో తమ నాయకులు లేరని టీడీపీ వారు అంటున్నారు. 

Updated Date - 2020-05-20T19:25:18+05:30 IST