వైసీపీ మల్లగుల్లాలు

ABN , First Publish Date - 2022-08-06T08:01:34+05:30 IST

వైసీపీ మల్లగుల్లాలు

వైసీపీ మల్లగుల్లాలు

మాధవ్‌కు పార్టీ భయపడుతోందా?

వేటేశాక ఎదురుతిరిగితే!.. ఇప్పటికే బీసీ కార్డుతో ఎంపీ 

ఆయనపై చర్యలు తీసుకుంటే మిగతావారి సంగతేంటి?

మాధవ్‌పై వేటుతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ!

అధిష్ఠానం యోచన.. రెండో రోజూ జగన్‌తో సజ్జల భేటీ

మాధవ్‌ ఎపిసోడ్‌ను చూసీ చూడనట్లు వదిలేయాలని 

పెద్దల యోచన.. మౌనమే ఉత్తమమని నిర్ణయం?


జగన్‌ సర్కారు మహిళా పక్షపాతి అన్నారు.. మహిళలను కించపరిస్తే సహించేది లేదన్నారు.. రాసలీలల వీడియోతో ఎంపీ గోరంట్ల మాధవ్‌పై సస్పెన్షన్‌ ఖాయమని అనుకూల మీడియాకు లీకులిచ్చారు.. కాసేపట్లో వేటు వేయబోతున్నామని  సన్నిహిత చానళ్లలో ప్రచారం కూడా చేయించుకున్నారు.. కానీ 48 గంటలైనా ఆ ఊసేలేదు. మాధవ్‌ బీసీ కావడంతో ఆయనపై చర్య తీసుకుంటే.. గతంలో ఇలాంటివాటికే పాల్పడిన వారిని ఎందుకు వదిలేశారన్న విమర్శలు వస్తాయని.. అందుకే మౌనంగా కాలయాపన చేద్దామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు కనబడుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకునే విషయంలో వైసీపీలో హైటెన్షన్‌ మొదలైంది. రెండ్రోజులుగా ఆ పార్టీ అధిష్ఠానం చర్చోపచర్చలు సాగిస్తున్నా.. ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఆయనపై వేటు వేస్తే.. పార్టీకి జరిగే మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుందేమోనని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు వైసీపీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి. మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్నట్లుగా.. ఒకవేళ మాధవ్‌ పార్టీపై ఎదురుతిరిగితే పరిస్థితి ఏమిటని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. రాసలీలల వీడియో నిజమేనంటూ ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయించినా.. భవిష్యత్‌లో ఇతరులపైనా ఆరోపణలొస్తే ఇదే ఒరవడి కొనసాగించి.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందేమోనని భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన వర్గానికి చెందినందునే తనపై వీడియో లీక్‌ చేశారంటూ మాధవ్‌ ఇప్పటికే బీసీ కార్డు ప్రయోగించారు. ఇది ప్రతిపక్షాలపై కంటే.. వైసీపీపైనే బాగా ప్రభావం చూపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో కొందరు వైసీపీ నేతల వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తాయని.. బీసీ కాబట్టే ఇప్పుడు మాధవ్‌పై వేటు వేశారని అంతా భావిస్తారని.. ఇది రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. మాధవ్‌ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.


సస్పెండ్‌ చేస్తామని లీకులిచ్చి..

ఎంపీ మాధవ్‌ రాసలీలల వీడియో గురువారం ఉదయం బయటకు రాగానే నానా రచ్చ జరగడంతో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. వెంటనే.. మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశం ఉందంటూ వైసీపీ వర్గాలు తమ అనుకూల మీడియాకు లీకులిచ్చాయి. దీంతో ఆయా చానళ్లు కాసేపట్లోనే ఆయనపై వేటు పడబోతోందని ఊదరగొట్టాయి. సజ్జల కూడా మీడియాతో మాట్లాడుతూ.. వీడియో నిజమైనదేనని తేలితే మాధవ్‌పై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. అలాగే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన వెంటనే ఎంపీని పార్టీ నుంచి బహిష్కరిస్తారంటూ వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన కొందరు శుక్రవారం పోస్టులు కూడా పెట్టారు. వీడియో నిజమేనంటూ నిఘా వర్గాలు సీఎంకు నివేదిక అందించినట్లు వైసీపీ వర్గాలూ లీకులిచ్చాయి. దరిమిలా.. ఇక అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని రాజకీయ పార్టీలు భావించాయి. ఇదే సమయంలో సజ్జల శుక్రవారం ఉదయం జగన్‌ను కలిశారు. మధ్యాహ్నం రెండు గంటల దాకా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. బయటకు వచ్చాక మాధవ్‌ అంశంపై నిర్ణయాన్ని మీడియాకు వివరిస్తారని భావించారు. కానీ ఆయన విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో మాధవ్‌పై చర్యలకు ప్రభుత్వ పెద్దలు జంకుతున్నారని.. వేటు వేయడం కంటే మౌనంగా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ కాలహరణం చేయడమే ఉత్తమమన్న యోచనలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజాగ్రహం మరింత తీవ్ర స్థాయికి చేరితే.. అప్పుడు ఫోరెన్సిక్‌ నివేదికలో ఏమొచ్చిందో వెల్లడించి.. నిర్ణయాన్ని ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చిన వెంటనే రాజకీయ పక్షాలు వేరే చర్చకు తావివ్వకుండా తక్షణమే ఆయా నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమో.. పదవికి రాజీనామా చేయించడమో చేస్తాయి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలకూ ఉపక్రమిస్తాయి. చట్టపరంగా ఎలాంటి తప్పూ జరగలేదని తేలితే.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటాయి. కానీ గోరంట్ల మాధవ్‌ విషయంలో వైసీపీ మౌనం పాటించడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-08-06T08:01:34+05:30 IST