ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చేదు అనుభవం!

ABN , First Publish Date - 2021-07-18T04:12:05+05:30 IST

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు..

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చేదు అనుభవం!

‘పది’వుల పండుగ!

రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా ఆరుగురు

నలుగురికి జిల్లాస్థాయి పదవులు

కొన్నింట భర్తలకు బదులు భార్యలకు చోట

అనుకున్నది సాధించుకున్న నేతలు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు నామినేటెడ్‌ పోస్టుల జాబితా అధికారికంగా వెలువడింది. జిల్లా నుంచి తొమ్మిది మందికి పదవులు దక్కాయి. మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వాలన్న నిబంధనల క్రమంలో కొన్ని పదవులకు భర్తల పేర్లకు బదులు భార్యల పేర్లు చేరాయి. జిల్లా పరిధిలోని నుడ, డీసీసీబీ, సీడీఎంఎస్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లతోపాటు ఆరు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు జిల్లావాసులకు దక్కడంతో మెజారిటీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. కార్పొరేషన్ పదవుల్లో కూడా రెండు బీసీ, ఒక ఎస్సీ, మూడు అగ్రవర్ణాలకు కేటాయించారు. అయితే పదవులు దక్కించుకునే విషయంలో ముగ్గురు ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాలేదని ప్రచారం. అలాగే పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు దక్కకపోవడంతో పలువురు నాయకులు లోలోన కుమిలిపోతున్నారు. మరోవైపు పదవులు చేపట్టనున్న వారంతా కొత్తవారు కావడం, వారికి కేటాయించిన శాఖల్లో కనీస అవగాహన కూడా లేనివారు కావడంతో వీరివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో ఆసక్తికర చర్చకు తెర లేచింది. 


రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం దక్కింది. ఏపీ సీడ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పేర్నాటి సుస్మితను నియమించారు. గూడూరు డివిజన్‌కు చెందిన వైసీపీ నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి సతీమణి ఈమె. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా గూడూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్ పొనకా దేవసేనను నియమించారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మేరగ మురళి నియమితులయ్యారు. గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇనచార్జిగా ఈయన పని చేశారు. సంగీత నృత్య అకాడమి చైర్‌పర్సన్‌గా జడ్పీ మాజీ వైస్‌ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీషను నియమించారు. ఏపీ ఔట్‌సోర్స్‌ ఎంప్లాయీస్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి చెందిన షేక్‌ సైదాని నియమితులు అయ్యారు. ఈమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన మెట్టుకూరు చిరంజీవిరెడ్డిని ఏపీ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. 


జిల్లా పదవులకు ముగ్గురు

నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడ) చైర్మన్‌గా ముక్కాల ద్వారకానాథ్‌ నియమితులయ్యారు. వాస్తవానికి ఈ పదవికి కొంతకాలంగా పలువురి పేర్లు ప్రచారం జరిగినా చివరి నిమిషయంలో ద్వారకానాథ్‌ పేరు ఖరారయ్యింది. ఈయన నెల్లూరు కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్‌గా పని చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా నాయుడుపేట నియోజకవర్గానికి చెందిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. తొలుత నుడ చైర్మన్‌గా ఈయన పేరు పరిశీలనకు వచ్చినా చివరి నిమిషంలో డీసీసీబీ చైర్మన్ పదవికి మార్పు చేశారు. జిల్లా మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్ పదవి కోవూరు నియోజకవర్గానికి చెందిన వీరి చలపతిని వరించింది. ఈయన రెండవసారి సీడీసీఎంఎస్‌ చైర్మన్‌గా నియమితులు కావడం విశేషం. వెంకటగిరి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్ దొంతు శారదకు గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ పదవి దక్కింది.


కొందరికి మోదం.. 

నామినేటెడ్‌ పదవుల సాధనలో కొంతమంది నాయకుల మాట చెల్లుబాటు కాగా కొంతమంది నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఏపీ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పేర్నాటి సుస్మితకు పదవి దక్కడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. వాస్తవానికి ఈమె భర్త పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి పదవి దక్కాల్సి ఉంది. అయితే 50శాతం మహిళలకు చోటు కల్పించాలనే క్రమంలో శ్యాంప్రసాద్‌ రెడ్డి పేరుకు బదులు ఆయన సతీమణిని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ పదవి పట్ల, పేరు మార్పుపట్ల పేర్నాటి కుటుంబం సంతృప్తిగా లేదనే ప్రచారం సాగుతోంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మేరిగ మురళికి పదవి దక్కడం వెనుక మేకపాటి రాజమోహనరెడ్డి ప్రమేయం ఉందని సమాచారం. మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, పొట్టేళ్ల శిరీషలకు పదవి వరించడం వెనుక రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇక సైదాని పదవి వెనుక నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సిఫార్సు ఉంది. నుడ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్‌ పదవి వెనుక మంత్రి అనిల్‌తో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుల సిఫార్సులు పని చేసినట్లు చెబుతున్నారు. సీఎం ఆసక్తి, వీపీఆర్‌ మద్దతుల క్రమంలో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని డీసీసీబీ చైర్మన్ పదవి వరించిందని చెబుతున్నారు. పార్టీలో చేరే క్రమంలో అధినేత జగన్ ప్రతినిధిగా మంత్రి అనిల్‌ ఇచ్చిన హామీలో భాగంగా పొనకా దేవసేనకు పదవి దక్కిందని అంటున్నారు. 


కొందరికి ఖేదం..

జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలకు పదవులు దక్కగా, దక్కిన వాటిలో సైతం మూడు పదవులు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జరగడం మరో విశేషం. కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల ప్రాతినిధ్యం నామినేటెడ్‌ పదవుల జాబితాలో లేవు. ఓసీ జనరల్‌ అయితేనే పదవి ఇవ్వండి లేకుంటే వద్దు అని కండీషన్ పెట్టిన క్రమంలో సర్వేపల్లికి పదవి దక్కలేదని సమాచారం. కావలి ఎమ్మెల్యే తన అనుచరుల పేర్లు ప్రతిపాదించినా ఫలితం దక్కలేదు. మరోవైపు పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యతిరేకులకు పదవులు దక్కడం మరో విశేషం. పేర్నాటి శ్యాంప్రసాద్‌కు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు మధ్య సత్సంబంధాలు లేవు. కానీ పేర్నాటి కుటుంబాన్ని స్టేట్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి వరించింది. మెట్టుకూరు చిరంజీవి రెడ్డికి,  ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అయినా ఎమ్మెల్యే ప్రమేయంతో పని లేకుండా చిరంజీవిరెడ్డికి పదవి దక్కింది. అలాగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక్కడా ఎమ్మెల్యే అభిప్రాయంతో సంబంధం లేకుండా సత్యనారాయణరెడ్డిని పదవి వరించడం విశేషం. 


ఇద్దరు మినహా అందరూ కొత్తవారే 

జిల్లా నుంచి నామినేటెడ్‌ పదవులు పొందిన పది మందిలో అత్యధికులు ఆ పదవులకు కొత్తవారు కావడం గమనార్హం. పేర్నాటి సుస్మిత ఇప్పటివరకు కుటుంబ వ్యవహారాలు మినహా మరెందులోనూ జోక్యం చేసుకునే వారు కారని అంటున్నారు. పొట్టేళ్ల శిరీష జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది కాని నృత్య, సంగీత కళల్లో ఆమెకు ప్రవేశం లేదు. పొనకా దేవసేన గతంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన పట్ల కొంత సులభంగా అవగాహన కల్పించుకోవచ్చు. పదవులు పొందిన నాయకులందరూ రాజకీయల పట్ల అనుభవం ఉంది కానీ వారికి కేటాయించిన సంస్థల పట్ల కొత్తగా అవగాహన కల్పించుకోవాల్సిందే. వీరి చలపతి మాత్రం రెండవసారి డీసీఎంఎస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాతికేళ్ల కిత్రం సహకార సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు 


స్వచ్ఛాంధ్రను సాధిస్తా

నాకు దక్కిన ఈ పదవిని బాధ్యతగా భావిస్తున్నా. ప్రజలందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ను సాధించేందుకు కృషి చేస్తా. గతంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేసిన అనుభవం నాకు ఉంది. ప్రతి ఒక్కరు పరిసరాలను, ప్రకృతి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి స్వచ్ఛత విషయంలో ఎక్కువ అవార్డులు వచ్చేలా కృషి చేస్తా. 

- పొణకా దేవసేన, చైర్‌పర్సన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్


కళలను ప్రోత్సహిస్తా

రాష్ట్రంలో కళలను ప్రోత్సహించేలా కృషి చేస్తా, కళల్లో నైపుణ్యం వారిని గుర్తించి సహకరిస్తా. జాతీయ స్థాయిలో కళలకు గుర్తింపు వచ్చేలా పని చేస్తాను. సీఎం నాపై ఉన్న నమ్మకంతో ఇచ్చిన పదవికి వన్నె తెచ్చేలా క్రమశిక్షణ, నిస్వార్థంతో పని చేసి మంచి గుర్తింపు తీసుకొస్తా.

- పొట్టేళ్ళ శిరీషా, సంగీతం, నృత్యం అకాడమీ చైర్‌సర్సన్


శక్తివంచన లేకుండా పని చేస్తా

నేను ఎప్పుడూ పార్టీ విధేయుడినే. నాపై ఏ బాధ్యత ఉంచినా శక్తివంచన లేకుండా న్యాయం చేస్తా. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది.

- మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్ చైర్మన్


అన్ని వర్గాల అభివృద్ధికి కృషి

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. ప్రధాన పారిశ్రామికంగా ఎదిగేందుకు, సన్న, చిన్నకారు రైతులకు, వివిధ కుల వృత్తులు చేసేవారికి రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటాను. అందరి  సలహాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు ఆర్థిక  స్వావలంభన సాధించేందుకు బాధ్యతతో వ్యవహరిస్తా.

- మేరిగ మురళీధర్‌రావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్


నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తున్న నన్ను గుర్తించి పదవి ఇచ్చారు. నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా. ప్రజలకు పెద్దఎత్తున సేవలందించేందుకు కృషి చేస్తా. 

- ఎస్‌కే.సైదాని, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్


పూర్తిస్థాయిలో పనిచేస్తా

వ్యవసాయానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు చేరుస్తా. నాపై నమ్మకంతో సీఎం జగన్ ఈ బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయిలో పని చేసి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తా. 

 - పేర్నాటి హేమసుస్మిత, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్


రైతులకు అందుబాటులో ఉంటా

డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికవడం ఆనందంగా ఉంది. రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తా. ప్రభుత్వ పథకాలతోపాటు సకాలంలో రుణాలు మంజూరు చేయిస్తా.

- వీరి చలపతిరావు, డీసీఎంఎస్‌ చైర్మన్


నిజాయితీగా పనిచేస్తా

నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా పని చేస్తా. జిల్లాని గ్రంథాలయాలను అభివృద్ధి వైపు నడిపిస్తా. 

- దొంతు శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్


నుడా బలోపేతంపై ప్రత్యేక దృష్టి 

గత ప్రభుత్వం నుడాను ఏర్పాటు చేసినా అన్ని వనరులను సమకూర్చలేదు. దీంతో కష్టాల్లో ఉన్న నుడాని ప్రభుత్వ సహకారం, మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో అన్ని విధాలా బలోపేతం చేసి ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తా. 

 - ముక్కాల ద్వారకానాథ్‌, నుడ చైర్మన్


అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యంగా పనిచేశా.. 

జగన్‌మోహనరెడ్డి నిర్ణయమే శిరోధార్యంగా భావించి పార్టీ అభివృధికి పనిచేశా.. అందరి సహకారంతో ఎనడీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. పార్టీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పించింది. 

 - కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి


Updated Date - 2021-07-18T04:12:05+05:30 IST