YSRCPలో సోషల్‌ వార్‌.. ఆయనకు ఎవరితోనూ పడదట.. ఆయన అంటే ఎవరికీ గిట్టదంట..!

ABN , First Publish Date - 2022-01-11T05:59:08+05:30 IST

YSRCPలో సోషల్‌ వార్‌.. ఆయనకు ఎవరితోనూ పడదట.. ఆయన అంటే ఎవరికీ గిట్టదంట..!

YSRCPలో సోషల్‌ వార్‌.. ఆయనకు ఎవరితోనూ పడదట.. ఆయన అంటే ఎవరికీ గిట్టదంట..!

  • పొన్నూరులో పోస్టింగ్‌ల యుద్ధం
  • ఒక వర్గం నాయకులపై ఎమ్మెల్యే అనుచరుల కేసు
  • ఆ కేసు అక్రమమని హైకోర్టులో బాధితులు రిట్‌ పిటిషన్‌ 
  • ఎమ్మెల్యే రోశయ్య సహా..
  • ముగ్గురికి న్యాయస్థానం నుంచి నోటీసులు


గుంటూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో సోషల్‌ వార్‌.. క్రిమినల్‌ కేసు నుంచి హైకోర్టుకు వరకు వెళ్లింది. పొన్నూరు నియోజకవర్గ నాయకుల మధ్యన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న పోస్టింగ్‌ల యుద్ధం వివాదాస్పదంగా మారింది.  ఇది అంతటితో ఆగకుండా పోలీసుస్టేషన్‌లో క్రిమినల్‌ కేసు వరకు వెళ్లగా అది అక్రమమని, దానిని కొట్టి వేయాలని బాధితులు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై హైకోర్టు స్పందించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ప్రతివాదుల్లో రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి, పెదకాకాని పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వోతో పాటు స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, పెదకాకాని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు బండారి సురేష్‌బాబు, ఉప్పలపాడు గ్రామానికి చెందిన శివబత్తుని దయానందబాబు ఉన్నారు. హైకోర్టు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు ప్రతివాదులుగా ఉన్న ఈ ఐదుగురు ఏమి జవాబు ఇస్తారోనన్న ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో నెలకొన్నది.


నాలుగు నెలల క్రితం వైఎస్‌ఆర్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గం పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో ‘ఆయనకు ఎవరితోనూ పడదట.. ఆయన అంటే ఎవరికీ గిట్టదంట..’ అనే సందేశాన్ని ఓ వ్యక్తి పోస్ట్‌ చేశారు. ఈ మెసేజ్‌ తెలుగు డాట్‌కాంలో ఉండగా దానిని వైఎస్‌ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గం గ్రూపులోకి ఫార్వార్డ్‌ చేశారు. దీనిపై ఉప్పలపాడుకు చెందిన శివబత్తుని దయానందబాబు పెదకాకాని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ పొన్నూరు నియోజకవర్గం వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ షేక్‌ ఖాదర్‌బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు.  వైసీపీ ఐటీ వింగ్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఇతడిపై పోలీసులు ఐపీసీ 504, 504(2), 153ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఖాదర్‌బాషాతో పాటు వైసీపీకే చెందిన జమ్ముల లక్ష్మీప్రసాద్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమపై పెట్టిన కేసు అక్రమమని, దానిని కొట్టివేయాలని కోరారు. వీరి తరపున అడ్వొకేటు ప్రభునాథ్‌ వాసిరెడ్డి వాదనలు వినిపించారు. రిట్‌పిటిషన్‌, అఫిడవిట్‌లు పరిశీలించిన న్యాయమూర్తి రిట్‌పిటిషన్‌ని ఎందుకు అనుమతించకూడదో తెలియజేయాలని ఎమ్మెల్యే రోశయ్య, బండారి సురేష్‌బాబు, శివబత్తుని దయానందబాబుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా వైసీపీలో ఇరువర్గాలు మధ్య న్యాయపోరాటం జరుగుతున్నది. ఈ వివాదం ఎటు వైపునకు దారి తీస్తుందోనన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో కొనసాగుతున్నది.

Updated Date - 2022-01-11T05:59:08+05:30 IST