ఏదైనా చేస్తాం.. మా ఇష్టం

ABN , First Publish Date - 2022-08-18T05:33:35+05:30 IST

ఏదైనా చేస్తాం.. మా ఇష్టం నువ్వెవరివి అంటూ మాజీ హోం మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సమక్షంలో వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తపై వీరంగం చేశారు.

ఏదైనా చేస్తాం.. మా ఇష్టం
సుచరితను ప్రశ్నిస్తున్న సాంబశివరావు

సుచరిత సమక్షంలో వైసీపీ నేతల వీరంగం

చినపలకలూరులో జనసేన కార్యకర్తపై దౌర్జన్యం

సాంబశివరావును స్టేషన్‌కు తరలించిన పోలీసులు

గడప గడపకు కార్యక్రమాన్ని ఆపేసి వెళ్లిన ఎమ్మెల్యే


ప్రత్తిపాడు, ఆగస్టు 17: ఏదైనా చేస్తాం.. మా ఇష్టం నువ్వెవరివి అంటూ మాజీ హోం మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సమక్షంలో వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తపై వీరంగం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో బుధవారం గుంటూరు రూరల్‌ మండలం చినపలకలూరులో సుచరిత పర్యటించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన జనసేన నాయకుడు సాంబశివరావు ఎమ్మెల్యేను చెరువుకు సంబంధించి గతంలో తీసుకున్న సంతకాల విషయమై ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నాయకులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నువ్వెవరివి అడగడానికి... హేయ్‌.. మా ఇష్టమొచ్చినట్టు చేస్తాం... అంటూ సాంబశివరావుపై విరుచుకు పడ్డారు.  మేడమ్‌ను అడుగుతున్నాం అని ఆయన అనగా మేడమ్‌ను అడిగేటంతటోడివా.. నువ్వెంతా.. నీ బతుకెంత అంటూ చిందులు వేశారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులను కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు స్టేషన్‌కు వెళ్లడంతో సాంబశివరావుపై కేసు నమోదు చేయకుండా పంపేశారు. గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో సుచరిత గడపగడపకు కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేసి వెనుతిరిగారు.


చెరువు పేరుతో సంతకాలు.. విలీనం చేయాలని అర్జీ

ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలోని చెరువు అభివృద్ది కోసం గతంలో గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించిన నాయకులు  దాని ఆధారంగా గ్రామాన్ని కార్పొరేషన్‌లో కలపాలంటూ అర్జీ పెట్టి ఎన్నికలు జరగకుండా ఆపారన్నారు. ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, తాము ఓటమి పాలవుతామనే ఉద్దేశ్యంతో వైసీపీ నాయకులు ఈ విధంగా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై సుచరిత వద్దకు గతంలో వెళ్లగా  మాయమాటలు చెప్పి తప్పుకున్నారన్నారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన ఆమెను ఇదే విషయాన్ని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారన్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-08-18T05:33:35+05:30 IST