ప్లీనరీ నుంచే ఎన్నికల యుద్ధభేరి

ABN , First Publish Date - 2022-07-04T06:06:45+05:30 IST

నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈనెల 8వ తేదీన జరుగనున్న వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశంలోనే ఎన్నికల యుద్ధభేరి మోగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

ప్లీనరీ నుంచే ఎన్నికల యుద్ధభేరి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు, వేదికపై ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు

మూడేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.లక్షా 51వేల కోట్లు  

లంచం లేకుండా సంక్షేమ పథకాల అమలు

కాపులు పవన్‌ను నమ్ముకోవద్దంటూ పునరుద్ఘాటన

జిల్లా ప్లీనరీలో మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు

గుంటూరు, జూలై 3: నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈనెల 8వ తేదీన జరుగనున్న వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశంలోనే ఎన్నికల యుద్ధభేరి మోగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మాజీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు వైసీపీ ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ మూడేళ్ళలో రూ.లక్షా 51వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించటం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. కాపులు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకోవద్దని మరోసారి పునరుద్ఘాటించారు. ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ నాయకత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. ఎమ్మెల్సీ, ప్లీనరీ పరిశీలకుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌ సామాజిక సమానత్వం దిశగా పాలన చేస్తున్నారన్నారు. నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ఎంత మంది ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీయే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి ప్లీనరీ వేదికగా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ఎండీ ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్‌, కిలారి రోశయ్య, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి ప్రసంగించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మురుగుడు హనుమంతరావు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్ర గిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్‌ సజీల, మాజీ డిప్యూటీ మేయర్‌ తాడిశెట్టి మురళి, పలు కార్పొరేషన్‌ల చైర్మన్లు మండేపూడి పురుషోత్తం, కోలా భవానీ, ఆతుకూరి ఆంజనేయులు, మెట్టు వెంకటప్పారెడ్డి పలువురు నేతలున్నారు. 

 దమ్మున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

’గుంటూరు పార్లమెంటులో ఏడు నియోజకవర్గాల నుంచి ఏడుగురి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చి గెలిపించారని, ఇంత దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబునాయుడే’ అంటూ వైసీపీ నేత, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నూతలపాటి హనుమయ్య వ్యాఖ్యానించారు. ప్లీనరీ వేదికలో మాట తడబడి తరువాత నాలుక్కరుచుకున్నాడు. దాంతో సమావేశంలోని కార్యకర్తలు ఈలలతో కొద్దిసేపు గోల చేశారు. అంతలో మేయర్‌ కావటి సైగలు చేయటంతో కార్యకర్తలు మిన్నకుండిపోయారు. 

 

Updated Date - 2022-07-04T06:06:45+05:30 IST