ఎమ్మెల్యేలపై పట్టు సడలిందా.. YS Jaganపై భయం పోయిందా..?

ABN , First Publish Date - 2022-05-17T08:31:46+05:30 IST

వైసీపీ ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టు సడలిందని.. అధికారం చేపట్టి మూడేళ్లవుతున్న ఈ సమయంలో.. ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అధికార పక్ష

ఎమ్మెల్యేలపై పట్టు సడలిందా.. YS Jaganపై భయం పోయిందా..?

  • సీఎం ఆదేశాలను పట్టించుకోని వైసీపీ ప్రజాప్రతినిధులు
  • ‘గడప గడప’కు డుమ్మా
  • నియోజకవర్గాల్లో పెత్తనమంతా వలంటీర్లదేనని గుర్రు
  • జనం వారి వద్దకే వెళ్తున్నారని బాధ
  • తమకు విలువ లేదని ఆవేదన
  • పైగా ఎక్కడికక్కడ నిలదీతలతో జంకు
  • తాజాగా రైతు భరోసాకూ దూరం
  • ప్రజల్లోకి వెళ్తేనే టికెట్లు ఇస్తానని ముఖ్యమంత్రి స్పష్టీకరణ
  • అయినా లెక్కచేయని నేతలు


ఇన్నాళ్లూ వైసీపీలో సీఎం జగన్‌ మాటకు తిరుగులేదు. ఆయన ఏ కార్యక్రమం నిర్ణయించినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు విజయవంతం చేసి తీరాల్సిందే. కానీ గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’, తాజాగా రైతు భరోసా తొలి వాయిదా చెల్లింపు కార్యక్రమాలకు చాలా మంది డుమ్మా కొట్టారు. సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రమేయం ఏ మాత్రం లేకపోవడం.. గ్రామ/వార్డు వలంటీరుకున్న గౌరవం కూడా తమకు లేకపోవడం దీనికి కారణమన్న అభిప్రాయం వినవస్తోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టు సడలిందని.. అధికారం చేపట్టి మూడేళ్లవుతున్న ఈ సమయంలో.. ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అధికార పక్ష నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. సీఎం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం తుస్సుమనడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, ఇతర ముఖ్య నేతలూ హాజరుకావడం లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే చాలా చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి.


రైతు భరోసాలోనూ అంతే..

రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం-2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమం సోమవారం జరిగింది. జగన్‌ ఏలూరులో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని మం త్రులు, ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. అయితే వారెవరూ సీరియ్‌సగా తీసుకోలేదు. సోమవారం చాలా మంది డుమ్మా కొట్టారు. లబ్ధిదారుల ఎంపికలో తమ మాటకు విలువ లేనప్పుడు పాల్గొని ప్రయోజనం ఏమిటని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అమరావతిలో సమావేశం ఉందంటూ చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆర్‌కే రోజా హాజరుకాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం పాల్గొన్నారు. అయితే సమావేశాన్ని త్వరగా ముగించుకుని అమరావతికి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాత్రమే హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో పాలకపక్ష ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు.


కాకినాడ జిల్లా కేంద్రం బదులు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దొరబాబు మాత్రమే వచ్చారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మంత్రి రాజా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి తప్ప మిగిలినవారెవరూ రాలేదు. వైఎ్‌సఆర్‌ జిల్లాలో జగన్‌ మేనమామ నియోజకవర్గమైన కమలాపురంలో కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సుధ, రాచమల్లు ప్రసాదరెడ్డి హాజరు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని సింగంపల్లిలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, కలెక్టరు మాత్రమే హాజరయ్యారు. జిల్లా మంత్రి తానేటి వనిత, ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. కోనసీమ జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ చింతా అనూరాధ హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌, నలుగురు ఎమ్మెల్యేలురాలేదు.


రోడ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు తదితర సమస్యలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, వలంటీర్లు హాజరవుతున్నా.. ప్రజాప్రతినిధులు డుమ్మా కొడుతుండడంతో వారిలో జగన్‌పై భయభక్తులు సన్నగిల్లాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఉగాది (ఏప్రిల్‌ 2) నుంచి గడప గడపకూ తీసుకు వెళ్లాలని బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ ఏడాది మార్చి 15వ తేదీన నిర్వహించిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ఆదేశించారు. అయితే.. ఆ రోజు కాదని.. ఏప్రిల్‌ పదో తేదీ నుంచి చేపడతామని పలువురు ప్రజాప్రతినిధులు చెప్పారు. వారి విముఖతను గమనించిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార సామగ్రి రాలేదన్న నెపంతో వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ నెలలో ఎట్టకేలకు చేపట్టినా.. తూతూ మంత్రంగానే కొనసాగుతోంది. జగన్‌ మాట శాసనమైనా ఇప్పుడు ఆలకించేవారే కరువయ్యారు. గడప గడపకూ వెళ్లి ప్రజాదరణ పొందితే తప్ప మళ్లీ అధికారంలోనికి రాలేమని.. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు కాలేరని ఆయన హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.


పునర్వ్యవస్థీకరణ దెబ్బా!

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేసిన సమయంలో.. రెండున్నరేళ్ల తర్వాత వారిలో 90 శాతం మందిని తొలగించి కొత్తవారికి అవకాశమిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. దాంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ గత నెలలో జరిగిన పునర్వ్యవస్థీకరణలో 11 మంది పాతవారినే కొనసాగించడంతో.. కొత్తగా 14 మందికే అవకాశం దక్కింది. దీంతో అసంతృప్తి జ్వాలలు రేగాయి. సీఎం స్వయంగా జోక్యం చేసుకుని అసంతుష్టులను బుజ్జగించారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా మంత్రి పదవులిస్తానని వారికి మాటిచ్చారు. తీరాచూస్తే ఆ హామీలు కేబినెట్‌ పరిమితిని దాటేశాయి. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మెల్యేలు గుర్రుగానే ఉన్నారు. దీనికితోడు నియోజకవర్గాల్లో తమ మాట చెల్లడం లేదన్న అసంతృప్తి వారిలో ఉంది. గతంలో నియోజకవర్గంలో ఏ చిన్న పని ఉన్నా జనం ఎమ్మెల్యే వద్దకు వెళ్లేవారు.


ఇప్పుడా పరిస్థితి లేదు. ఊళ్లలో పెత్తనమంతా వార్డు/గ్రామ వలంటీర్లదే. సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారని అడిగితే.. ప్రజలు సీఎం జగన్‌ పేరు చెప్పకుండా వలంటీర్లు ఇస్తున్నారని చెప్పడం వరకు పరిస్థితి వెళ్లింది. వారు ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ పని పడినా వలంటీరు వద్దకే పోతున్నారు. ఇక రోడ్ల దుస్థితిపై జనం ఆగ్రహంతో ఉన్నారు. ఇళ్ల పట్టాల్లో అన్యాయం జరిగిందన్న బాధ, పెన్షన్ల మంజూరులో వివక్ష చూపుతున్నారన్న ఆవేదన కూడా ఉన్నాయి. ఇది గ్రహించే చాలా మంది ఎమ్మెల్యేలు ‘గడప గడపకు’ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. పైగా వెళ్లినవారిని జనం నిలదీస్తుండడంతో.. తర్వాత వెళ్దామనుకున్నవారు కూడా జంకుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాదరణ పొందాల్సిందేనని.. లేదంటే ఎన్నికల్లో గెలవలేరని.. సర్వేల ఆధారంగానే 2024లో టికెట్లు ఇస్తానని.. ఓడిపోయేవారికి ఇచ్చే ప్రసక్తే లేదని జగన్‌ పదే పదే హెచ్చరిస్తున్నా.. వారు పట్టించుకోవడంలేదు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-05-17T08:31:46+05:30 IST