హైకోర్టు ఆదేశాలను రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయి

ABN , First Publish Date - 2020-09-17T17:43:15+05:30 IST

మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది.

హైకోర్టు ఆదేశాలను రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయి

అమరావతి/న్యూ ఢిల్లీ : గత ప్రభుత్వ పాలకులను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేసిన జగన్‌ సర్కారుకు హైకోర్టు కళ్లెం వేసిన విషయం విదితమే. మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది. అయితే ఈ మొత్తం విషయాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తారు. హైకోర్టు ఆదేశాల గురించి మాట్లాడిన ఆయన.. ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని.. ఈ ధోరణి మానుకోవాలన్నారు.


ఇది అసాధారణమైనది!

న్యాయ వ్యవస్థ కారణంగా ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది. మీడియా, సోషల్ మీడియాపై ఏపీ హైకోర్టు నిషేధం విధించింది. మాజీ అడ్వకేట్ జనరల్‍పై ఎఫ్‌ఆర్‌ను రిపోర్ట్ చేయవద్దని నిషేధం విధించింది. ఈ చర్యలను సమర్థించుకునే ఏ ఆధారమూ లేదు. ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది, బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి మరో కేసుపైనా స్టే విధించారు. టీడీపీ హయాంలో తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలా వ్యవహరిస్తున్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. జుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని రాజ్యసభలో విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.


రాజ్యసభలో వైసీపీ వర్సెస్ టీడీపీ..

అంతకుముందు.. ఇదే రాజ్యసభలో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం సాగింది. కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల ఎండగట్టారు. కనకమేడల తర్వాత మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అమరావతిపై సిట్ దర్యాప్తుకు హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సభలో ప్రస్తావించారు. న్యాయస్థానం ముందున్న అంశాలను సభలో ప్రస్తావించొద్దని టీడీపీ ఎంపీ కనకమేడల అడ్డుపడ్డారు. విజయసాయి వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి.. ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలను ప్రస్తావించారు. దీనిపై కనకమేడల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనవసర అంశాలపై ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదన్న కనకమేడల అన్నారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ  కోర్టుల పరిధిలోని అంశాలపై చర్చించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో  మాట్లాడడం ద్వారా కోర్టులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-17T17:43:15+05:30 IST