స్వామీజీ వ్యాఖ్యలు బాధాకరం

ABN , First Publish Date - 2021-10-20T09:08:45+05:30 IST

గణపతి సచ్చిదానంద స్వామిజీతో ముఖ్యమంత్రి భేటీ అయిన సందర్భంగా స్వామీజీ చేసిన వ్యాఖ్యలను నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆక్షేపించారు. బ్రాహ్మణులను, పూజారులను ముఖ్యమంత్రి గౌరవిస్తున్నారని,

స్వామీజీ వ్యాఖ్యలు బాధాకరం

  • బీసీ కార్పొరేషన్‌లో బ్రాహ్మణ సంస్థ విలీనం
  • 150 హిందూ దేవాలయాలపై దాడులు
  • అన్యమతాల విషయమై సీఎంపైనే విమర్శలు
  • పొరుగున గొప్పగా యాదాద్రి పునరుద్ధరణ
  • ఏపీలో ఆ పరిస్థితి లేకున్నా సీఎంపై ప్రశంసలా?
  • వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆక్షేపణ


న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గణపతి సచ్చిదానంద స్వామిజీతో ముఖ్యమంత్రి భేటీ అయిన సందర్భంగా స్వామీజీ చేసిన వ్యాఖ్యలను నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆక్షేపించారు. బ్రాహ్మణులను, పూజారులను ముఖ్యమంత్రి గౌరవిస్తున్నారని, చక్కగా చూసుకుంటున్నారని, దేవాలయాల పునరుద్ధరణకు అత్యద్భుతంగా కృషి చేస్తున్నారని స్వామీజీ ప్రశంసించడం బాధాకరమన్నారు. అన్యమతాలకు ముఖ్యమంత్రి ప్రాఽధాన్యతనిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో స్వామీజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ‘‘బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌ కు అనుసంధానం చేసారన్న విషయం స్వామీజీకి తెలియదా? స్వామీజీ మైసూర్‌లో ఉంటారు. దానివల్ల రామతీర్థం, అంతర్వేది ఆలయాలతోపాటు 150 హిందూ దేవాలయాల్లో జరిగిన ఘటనల గురించి తెలియకపోవచ్చు. ఆలయాల కోసం ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిపై ఏం తెలుసునని స్వామీజీ కితాబిచ్చారు?  తెలంగాణలో యాదాద్రి ఆలయాన్ని అక్కడి సీఎం గొప్పగా పునరుద్ధరించారు. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు’’ అని రఘురామ ఆక్షేపించారు.


కాగా, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి మనసు మార్చుకుని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా దిగజారిపోయింది. అప్పులఊబిలో కూరుకుపోయింది. గోతులను పూడ్చడానికి డబ్బులు లేవు బిల్లులు కావడం లేదని కోర్టు గదులు కట్టడానికి సైతం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యయ ప్రయాసలతో కూడిన మూడు రాజఽధానులను ఏర్పాటుచేయడం అసాధ్యం’’ అని అభిప్రాయపడ్డారు. కాగా, రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై నిర్మించిన నాల్గో వంతెనకు అనుసంధానం చేస్తూ విజయవాడవరకు నిర్మించిన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశానని రఘురామ చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు జరుగుతోందని అన్నందుకు టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీలో క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడే లేనప్పుడు తనపై చర్యలు ఎలా తీసుకుంటారనీ, తానంటే ఇష్టం లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించాలని రఘురామరాజు అన్నారు. ‘‘మా పార్టీ ఎన్నికల విధానం, క్రమశిక్షణాసంఘం వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద లేకపోవడం విచారకరం. మా పార్టీ రాజ్యసభ ‘రెడ్డి‘కి, లోక్‌సభ ‘రెడ్డి‘కి ఇటీవల ముఖ్యమంత్రి దర్శనం అరుదుగా దొరుకుతున్నట్లు  తెలుస్తోంది’’ అని రఘురామ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-20T09:08:45+05:30 IST