Abn logo
Apr 17 2021 @ 02:42AM

షర్మిలకు ఒక రూలు..అమరావతి మహిళలకు ఒక రూలా?

రాజధానిలో జరిగిన దాడులపై విజయమ్మ నిరసన వ్యక్తం చేయాలి

వైసీపీ ఎంపీ రఘురామ డిమాండ్‌


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘‘షర్మిలకు ఒక రూలు.. అమరావతి మహిళలకు ఒక రూలా?’’ అని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాజధాని అమరావతి మహిళలపై ఏపీ ప్రభుత్వం చేసిన దాడులపై విజయమ్మ నిరసన వ్యక్తం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం రఘురామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షర్మిల చేపట్టిన దీక్ష సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో జాకెట్టు చిరగడం బాధనిపించింది. మహిళా పోలీసులు అయినప్పటికీ అలా చేయడం తప్పు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఆ సంఘటన పట్ల చలించారు. అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అమరావతిలో మహిళలను మగ పోలీసులే తన్ని, కొట్టి హింసిస్తే విజయమ్మ మాట్లాడకపోవటం ప్రజలు చూస్తున్నారు. నిజంగా ఇది దురదృష్టకరం. సన్ని(జగన్‌) ప్రభుత్వంలో అమరావతి మహిళలను కనీసం ఇళ్ల నుంచి కూడా బయటికి రానివ్వడంలేదు. కాబోయే సీఎం అనుకుంటున్న షర్మిలను చక్కగా నిరసన తెలియజేయనిచ్చారు. కానీ, అమరావతి మహిళలను సన్ని నిరసన కూడా తెలియజేయనివ్వడం లేదు. దీనిపై ఎందుకు ప్రశ్నించలేదు. షర్మిలకు ఒక రూలు.. అమరావతి మహిళలకు మరో రూలా? అని ప్రజలు అనుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అమరావతి మహిళలకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోలను తెప్పించుకొని చూడాలని, కనీసం దానిపై నిరసన ప్రకటించాలని కోరారు. విజయమ్మ అలా చేస్తే పార్టీ ఇమేజ్‌ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 


ఆ ఎంపీ మామూలోడు కాదు!

‘మదర్‌ ఫ్లోరా ఫెయిత్‌ మినిస్ర్టీస్‌’ అనే క్రిస్ట్రియన్‌ సంస్థ నిధుల విషయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ పాత్రపై దర్యాప్తు చేయాలని సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. మదర్‌ ఫ్లోరాకు క్రిస్టియన్‌ సంస్థల నుంచి దాదాపు రూ.13.73 కోట్లు విరాళాలు వచ్చాయని, అందులో ఉన్న చిరునామా దగ్గర బోర్డు కూడా లేదన్నారు. ఆ నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరినట్టు తెలిపారు. ఎస్సీ వ్యక్తులు మతం మారితే రిజర్వేషన్లు వర్తించబోవని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని, అయినప్పటికీ నందిగం సురేశ్‌ ఎస్సీ సర్టిఫికేట్‌తో రిజర్వు సీటులో పోటీ చేసి వ్యవస్థను మోసం చేశారని అన్నారు. ఈ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. ‘‘రెడ్లకు మించిన పెద్ద నాయకుడు నందిగం సురేశ్‌ అని అందరు అనుకుంటున్నారు. ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఇచ్చారు. కష్టపడి ఆయన కోటి రూపాయల విలువైన కారును కొనుకున్నారు. ఒక సాధారణ విస్తరాకులు అమ్ముకొనే వ్యక్తిని కోటి రూపాయల కారు కొనుక్కొనే స్థాయికి తీసుకెళ్లినందుకు సీఎం జగన్‌కు అభినందిస్తున్నా. చెప్పిన వారిని తిట్టి, చెప్పిన పనులు చేస్తే మాకు కూడా కార్లు ఇస్తారు. బంగళాలు ఇస్తారు’’ అని ఎద్దేవా చేశారు. 


ఆరోపణలు సరికాదు

తాను ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నానని సీఏ నాగార్జునరెడ్డి అనే వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదని ఎంపీ రఘురామ సూచించారు. పార్టీకి రాజీనామా చేయాలని కూడా అన్నారని, తనను రాజీనామా చేయాలని ఏ రెడ్డికి ప్రభావితమై అడిగారని ప్రశ్నించారు. తనకు వెదవ సలహాలు ఇవ్వవద్దన్నారు. ‘‘నన్ను తిట్టే వాళ్లలో ఎక్కువగా పేర్ల పక్కన రెడ్డి ఉంటుంది. రాయలసీమ రెడ్లలో 70% కాపులేనని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి గతంలో అన్నారు. రకరకాల కులాల వారు ‘రెడ్డి’ అని పెట్టుకుంటారు. ఏ రెడ్డిది ఏ కులమో ఎవరికి తెలుసు? రెడ్డి అంటే అదేదో కులమనుకొని తిట్టేయడం అసహ్యంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పూర్తయినా కరోనా పేరుతో జగన్‌ మీడియాలో ప్రకటన ఇవ్వడం నైతికంగా సరికాదని రఘురామ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా గురించి పట్టించుకోవడం లేదని, చాలా మందిని ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. 

Advertisement
Advertisement
Advertisement