అమరావతి రైతులకు.. 80 వేల కోట్లు ఎలా చెల్లిస్తారు?

ABN , First Publish Date - 2020-08-08T08:48:12+05:30 IST

అమరావతిలో రాజధానిని కొనసాగించనప్పుడు... భూములిచ్చి ఇపుడు రోడ్డున పడ్డ రైతుల కష్టాలు, ఇబ్బందులను ప్రభుత్వం ఎలా తీరుస్తుందని వైసీపీ

అమరావతి రైతులకు.. 80 వేల కోట్లు ఎలా చెల్లిస్తారు?

  • రాజధాని లేకుండా వారి కష్టాలెలా తీరుస్తారు?
  • పేదలకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారు
  • ఉద్యోగులకు జీతాలూ చెల్లించలేకపోతున్నారు
  • 3 రాజధానులకే ప్రజలు కన్నీరు పెడుతున్నారు
  • 13 రాజధానులని వీర్రాజు అని ఉంటే బాధాకరం
  • వైసీపీ ఎంపీ రఘరామకృష్ణమరాజు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో రాజధానిని కొనసాగించనప్పుడు... భూములిచ్చి ఇపుడు రోడ్డున పడ్డ రైతుల కష్టాలు, ఇబ్బందులను ప్రభుత్వం ఎలా తీరుస్తుందని వైసీపీ  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పోనీ వారికి పరిహారమిచ్చి న్యాయం చేయాలన్నా.. సుమారు రూ.80వేల కోట్లు అవసరమని చెప్పారు. కనీసం పేదలకు పింఛను ఇవ్వలేక,  ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతున్న సర్కారు.. ఇంత భారీ మొత్తం ఎక్కడ నుంచి తీసుకొస్తుందని అడిగారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘రాజధాని కోసమే అమరావతి రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించి ఎంతో త్యాగం చేశారు.


ప్రభుత్వం ఇప్పుడు మాటతప్పి అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుంచి రాజధానిని వేరే చోటకు తరలిస్తే వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు? అమరావతే రాజధానిగా ఉంటుందని భావించిన అనేక మంది చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు కూడా ఆ చుట్టుపక్కల ఇంటి స్థలాలను, చిన్నచిన్న ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధానిని వేరే చోటకు తరలించడం ఎంతవరకు సబబు’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఖర్చుచేసిన డబ్బంతా ప్రజల డబ్బే‘ అని హైకోర్టు వ్యాఖ్యానించడం శుభపరిణామమని తెలిపారు. ‘తరలింపుపై హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. ఈ సమయంలో వెంట్రుకలు కూడా పీకలేరని ఒకరు, కోర్టును ధిక్కరిస్తూ మరికొందరు వ్యాఖ్యలు చేయడం మంచిదికాదు. కోర్టు తీర్పు వచ్చే వరకు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలందరికీ హితబోధ చేయాలి’ అని సూచించారు. 3 రాజధానులకే ప్రజలంతా కన్నీరు పెడుతుంటే.. బీజేపీ-జనసేన కూటమి 2024లో అధికారంలోకి వస్తే 13 జిల్లాల్లో 13 రాజధానులను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక వేళ అనిఉంటే బాధాకరమన్నారు.


సంభాషణ బయటపెట్టడం మంచిదికాదు..

ఒక మాజీ జడ్జి సంభాషణను బయటపెట్టడం మంచిది కాదని, న్యాయస్థానాలను అందరూ గౌరవించాలని రఘురామరాజు అన్నారు. ‘న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కించపరిచే సంస్కృతి పునరావృతం కాకుండా సీఎం జగన్‌ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం న్యాయవ్యవస్థను గౌరవించినప్పుడే ప్రభుత్వానికి మరింత గౌరవం లభిస్తుంది’ అని తెలిపారు.

Updated Date - 2020-08-08T08:48:12+05:30 IST