బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: అవినాష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-04T17:59:42+05:30 IST

బద్వేల్ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సుధాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేశారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు.

బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: అవినాష్ రెడ్డి

కడప: బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సుధాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేశారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కుందు నది నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మం సాగర్‌కు నీటిని తరలించి కరవు పరిస్థితిలో కూడా బద్వేలు ప్రాంత రైతాంగానికి నీరు అందించబోతున్నామని చెప్పారు. వ్యవసాయనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టబోతున్నామన్నారు.  బద్వేలు చెరువుకు నీరు అందించేందుకు ఎల్‌ఎస్పీ కాలువ విస్తరణ చేపడుతున్నామని ఎంపీ చెప్పారు.


బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న బద్వేలు రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. పెద్దఎత్తున బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ రాబోతోందన్నారు.  పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేసి భారీ మెజారిటీతో డాక్టర్ సుధాను గెలిపించాలని ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-04T17:59:42+05:30 IST