అక్రమాలు ‘అనంత’o.. ఈయన పేరు చెబితే ఏజెన్సీలో వణుకు.. ఎదిరించారో..!

ABN , First Publish Date - 2022-05-24T08:03:02+05:30 IST

ఉమ్మడి తూర్పు గోదావరి ఏజెన్సీలో ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన అనంత ఉదయభాస్కర్‌ (47)..

అక్రమాలు ‘అనంత’o.. ఈయన పేరు చెబితే ఏజెన్సీలో వణుకు.. ఎదిరించారో..!

  • ఏజెన్సీలో వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ హవా!
  • కలప స్మగ్లింగ్‌, రంగురాళ్ల క్వారీలతో అక్రమార్జన
  • గంజాయి, సారా అక్రమ రవాణా కూడా..
  • బినామీలతో రొయ్యల చెరువులు.. సాగునీరు మళ్లింపు
  • ఎదిరిస్తే పుట్టగతులుండవ్‌ .. అడ్డొస్తే అట్రాసిటీ కేసులే
  • సీఎం జగన్‌తో ఐదేళ్లుగా సాన్నిహిత్యం
  • అందుకే మూడేళ్లలో రెండు పదవులు!


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు గోదావరి ఏజెన్సీలో ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన అనంత ఉదయభాస్కర్‌ (47).. తన ఎదుగుదలకు ఎంతకైనా తెగిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ జీవితం ప్రారంభించిన రోజే 1998లో ప్రత్యర్థులపై నడిరోడ్డుపై దాష్టీకానికి దిగిన వైనం ఇప్పటికీ ఏజెన్సీ ప్రజలకు గుర్తుంది. అప్పటి కాంగ్రెస్‌ నేత జక్కంపూడి రామ్మోహనరావు అడ్డతీగల ప్రధాన రహదారిపై ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. అదే సమయంలో ప్రత్యర్థులు తారసపడ్డారు. వారి సంగతి చూడండని జక్కంపూడి ఉసిగొల్పితే అనంతబాబు కర్రలతో ప్రత్యర్థుల తలలు పగిలేగా దాడులు చేశాడు. తన మాట వినని వారిని, ఎదురు తిరిగిన వాళ్లను దారికి తెచ్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని.. ప్రత్యర్థులను భయపెట్టి ఎదగడం ఆయన వృత్తి అని.. ఒకరకంగా చెప్పాలంటే తాను అధికారంలో ఉన్నా లేకపోయినా ఇరు పార్టీల్లో ఉండే బంధువుల అండతో అనేక ఆగడాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా ఏజెన్సీ, ఒడిసాల్లో ఉదయభాస్కర్‌ గంజాయి సామ్రాజ్యాన్ని బాగా విస్తరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయిస్తూ డబ్బు సంపాదించాడని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది.


నియోజకవర్గంలో దందాలు..

2014లో రంపచోడవరం (ఎస్టీ) నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా అనంతబాబును ప్రకటించడంతో నామినేషన్‌ వేశాడు. ఆయన ఎస్టీ కాదని ఎన్నికల అధికారి నామినేషన్‌ తిరస్కరించారు. దాం తో.. డమ్మీ అభ్యర్థి వంతల రాజేశ్వరి అధికారిక అభ్యర్థిగా మారి విజయం సాధించారు. ఆమెను అడ్డుపెట్టుకుని ని యోజకవర్గవ్యాప్తంగా అనంతబాబు దం దాలు మొదలు పెట్టారని.. గిరిజన ఉద్యోగులను బెదిరించి.. తన దారికి రాకపోతే సస్పెండ్‌ చేయిస్తారని.. తనకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే అనుచరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తారని ఆరోపణలున్నాయి. ఉదయభాస్కర్‌ అక్రమాలు తట్టుకోలేకనే ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలో చేరారని అంటారు. దీంతో తెరపైకి నాగులపల్లి ధనలక్ష్మి అనే మహిళను తీసుకొచ్చి టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేయించి.. 2019లో ఎన్నికల బరిలో నిలబెట్టారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జగన్‌ అనంతబాబుకు డీసీసీబీ పదవి కట్టబెట్టారు. ఆ సమయంలో ఏజెన్సీలో తన చేపల చెరువును ఆనుకుని మరో 70 ఎకరాలపు ఉదయభాస్కర్‌ కొన్నారు. మద్దిగెడ్డ రిజర్వాయర్‌ కింద ఉన్న ఆయకట్టు భూములు వ్యవసాయానికి మాత్రమే వాడాలి. కానీ ఉదయభాస్కర్‌ తన అధికార బలంతో 100 ఎకరాల్లో బినామీ పేర్లతో చెరువులు తవ్వించారు. అందులో 15 ఎకరాలు ఆక్రమించిన ప్రభుత్వ భూమే. మూడు నెలల కింద ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. గడచిన ఐదేళ్ల నుంచీ జగన్‌తో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మూడేళ్ల వ్యవధిలో డీసీసీబీ చైర్మన్‌, ఎమ్మెల్సీ.. రెండు పదవులూ ఇవ్వడం వారి సాన్నిహిత్యానికి తార్కాణమని అంటున్నారు.


మెట్ట ప్రాంతం నుంచి వలస..

కొన్ని దశాబ్దాల కింద ఉదయభాస్కర్‌ కుటుంబం తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం నుంచి ఏజెన్సీకి వలస వచ్చింది. అతడి తండ్రి అనంత చక్రరావు అడ్డతీగలలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యాడు. అధికార బలంతో అప్పట్లో గిరిజనుల భూముల వివాదాల్లో తలదూర్చి వాటిని కైవసం చేసుకోవడంతో మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించారు. ఆ తర్వాత హత్య చేశారు. తండ్రి చనిపోయాక ఉదయభాస్కర్‌ కాంగ్రె్‌సలో చేరారు. జడ్పీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆయన పేరు సూచించారు. తనకు ఆర్థిక స్తోమత లేదనడంతో అడ్డతీగల మండల కాంగ్రెస్‌ నేతలు చందాలు వేసుకుని డబ్బు ఇచ్చారు. దీంతో 2004 తర్వాత ఉదయభాస్కర్‌ జడ్పీటీసీ అయ్యారు. మెట్ట ప్రాంతంలో అనేక కాంట్రాక్టు పనులు చేసి.. భారీగా సంపాదించారని.. అక్రమ కలప రవాణాలోనూ రూ.కోట్లు ఆర్జించి అందనంత ఎత్తుకు ఎదిగారని అంటుంటారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని కుదిపేసిన బోగస్‌ పింఛన్లు వ్యవహారంలో ఈయన సూత్రధారి కూడా. గిరిజనుడు కాదనే వివాదం ముసురుకోవడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ గోపాలకృష్ణ ద్వివేది.. ఉదయభాస్కర్‌ కుల ధ్రువీకరణ పత్రం బోగస్‌ అని తేల్చి, గిరిజనుడు కాదని నిర్ధారించారు.


ఆయన పేరు చెబితే  రంపచోడవరం ఏజెన్సీ వణికిపోతుంది. అక్కడ ఎవరూ ఆయన్ను ఎదిరించరు. ఎదిరించినవారు ప్రాణాలతో ఉండరు. నిలదీసిన వారికి పుట్టగతులుండవు. అధికారం అండతో ఇష్టానుసారం చెలరేగి ఏజెన్సీలో సొంత సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. తనకు తెలియకుండా, ఆదేశాలు లేకుండా అధికారులు ఏ పనీ చేయకూడదు. నదిలో ఇసుక, గుట్టపై గ్రావెల్‌.. ఏది తవ్వాలన్నా తన ఆదేశాలుంటేనే. ఆయనే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌. మాజీ డ్రైవర్‌ హత్య కేసులో సోమవారం అరెస్టయిన ఆయన రాజకీయ నేపథ్యమంతా అక్రమాల పుట్ట అన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.


అదే ఆయన ఆదాయం..

ఏజెన్సీలో కొన్ని వేల అటవీ భూముల్లో కలపను నరికి స్మగ్లింగ్‌ చేసి ఉదయభాస్కర్‌ కోట్లకు పడగెత్తారని అంటారు. అటవీ అధికారులను, సిబ్బందిని లోబరచుకుని గడచిన 20 ఏళ్లలో ఊహకు అందనంత సంపాదించారని చెబుతారు. అడ్డతీగలలోని ఏజెన్సీ కొండలపై రంగురాళ్ల వ్యాపారులను ప్రోత్సహించి అమాయక గిరిజనుల ప్రాణాలను పణంగా పెట్టి వారికి రోజుకూలీ ఇచ్చి రంగురాళ్ల వ్యాపారాన్ని తన ఆదాయ వృద్ధికి.. తద్వారా రాజకీయ అభివృద్ధికి వాడుకున్నాడని, తవ్వకాలను ఆపడానికి వెళ్లిన ఎందరో అధికారులపై రాళ్ల దాడి చేయించారని, చాలా మందిని బదిలీ చేయించారని ప్రచారంలో ఉంది. రంపచోడవరం మండలం చొప్పరిపాలెం క్వారీలో పనులు జరగాలంటే తనకు భాగస్వామ్యం కావాలని.. లేకుంటే పనులు చేయకూడదని ఓ వ్యాపారిని అనంతబాబు గతంలో బెదిరించారు. కోట్లు అర్జించే అక్రమ పశు రవాణాకు సైతం ఆయన అనుమతులు ఉండాల్సిందే. ఆయన ఊ అంటేనే ఏజెన్సీలో చెక్‌పోస్టుల గేట్లు తెరుచుకుంటాయి. మరోపక్క.. గిరిజన రైతుల పంట పొలాలకు వెళ్లే సాగునీటిని సైతం ఆయన తన అధికార బలంతో తన చేపల చెరువులకు మళ్లించుకున్నారు.


రంపచోడవరం ఏజెన్సీలోని ఏడు మండలాల్లో ఎవరైనా పేకాట ఆడాలంటే ఆయనకు కానుకలు సమర్పించుకోవలసిందే. అప్పుడే పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు. ఇవన్నీ ఒక ఎత్తయితే అక్రమ గంజాయి రవాణాకు, గ్రానైట్‌ తవ్వకాలకు ఆయన అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. వీటిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని.. అడ్డుకున్నవాళ్లు మరుసటి రోజు కనిపించరని అంటారు. 2013లో తన చేపల చెరువుకు అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను కూల్చడంతో 20 గ్రామాల్లో 15 రోజులపాటు అంధకారం నెలకొంది. ఘటనపై విచారణ చేపట్టిన విద్యుత్‌ శాఖ రూ.6 లక్షలు జరిమానా విధిస్తే ఉదయభాస్కర్‌ రూపాయి కూడా కట్టలేదు. ఎంపీపీగా ఉన్నప్పుడు తన అనుచరుల ద్వారా ఐవోబీ(ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌)లో దొంగ పాస్‌ పుస్తకాలతో రూ.20 కోట్లు వ్యవసాయ రుణాలుగా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అడ్డతీగల ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు అనంతబాబు అండతో పేకాట, కోడిపందేలు జోరుగా సాగిస్తున్నా అధికారులు నోరుమెదపరు. ఏజెన్సీ ప్రాంతంలో ఆయన అనుచరులు గంజాయి, సారా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నెలలో రంపలో స్కార్పియోలో గంజాయితో దొరికిన వైసీపీ వార్డు సభ్యుడు ఈయన అనుచరుడే.

Updated Date - 2022-05-24T08:03:02+05:30 IST