గడపలోకి వెళ్లి గద్దింపు

ABN , First Publish Date - 2022-05-15T07:55:29+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆగ్రహించినా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి జగన్‌.. మంత్రులు,

గడపలోకి వెళ్లి గద్దింపు

సమస్యలు చెబితే నారాయణస్వామి ఫైర్‌

జనం వద్ద సంయమనంతో  ఉండాలన్న  సీఎం

పారే డ్రైనేజీని చూపిన వ్యక్తిపై కన్నెర్ర

ఎందుకు పోస్టులు పెడుతున్నావంటూ

మరో వ్యక్తిపై చిత్తూరు జిల్లాలో ఆగ్రహం

కడపలో వికలాంగ జంటపై ఎమ్మెల్యే నిర్దయ

పట్టా లాగేసుకున్నారని సుధీర్‌రెడ్డికి వినతి

పట్టా తిరిగిచ్చి ఇల్లు కట్టించాలని కోరగా

ఇల్లు మీరే కట్టుకోవాలని విసురుగా బదులు


చిత్తూరు (ఆంధ్రజ్యోతి), పెద్దముడియం, మే 14: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆగ్రహించినా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి జగన్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. కానీ, ఇందుకు భిన్నంగా చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ‘గడప గడప’లో గద్దించారు. సమస్యలపై నిలదీసినవారిపై ఎదురుదాడికి దిగారు. శనివారం నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని కార్వేటినగరం మండలం, సురేంద్రనగరం పంచాయతీ పరిధిలో పర్యటించారు. రోడ్డుపై పారుతున్న డ్రైనేజీని చూపిస్తూ..ఆయనను ప్రజలు గట్టిగా నిలదీశారు. ‘మా గ్రామంలో సీసీ రోడ్లున్నాయి. కానీ డ్రైనేజీ వ్యవస్థ లేదు. వర్షం పడితే రోడ్ల మీదే నీళ్లు నిలబడుతున్నాయి. ఇబ్బందిగా ఉంది. మా సమస్యను తీర్చండి’ అంటూ గట్టిగా అడిగారు. నిజానికి, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నారాయణస్వామి పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ‘సర్‌ ఎదుట పథకాల గురించి మంచిగా మాట్లాడాలి. ఫిర్యాదులు చేయొద్దు’ అని అభ్యర్థించారు. అయినా, సురేంద్రనగరం పంచాయతీలోని దాసరిగుంట గ్రామంలో ప్రజలు తమ సమస్యలపై నారాయణస్వామిని గట్టిగా ప్రశ్నించారు. డ్రైనేజీపై ప్రశ్నించిన వ్యక్తిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటి ముందు మట్టి అడ్డంగా పెట్టుకున్నారు. లేకుంటే రోడ్డు మీద నీళ్లు నిలబడేవి కావు’ అని గదమాయించారు. ఈ సమస్య గురించి ఫేస్‌బుక్‌లో ఎందుకు పోస్ట్‌ చేశావంటూ మరో వ్యక్తిని గట్టిగా మందలించారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నం చేసిన విలేకరులను నారాయణస్వామి అనుచరులు అడ్డుకున్నారు.


వస్తున్నారు.. పోతున్నారు... 

కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం పెద్దముడియం మండలం భీమగుండం, భూతమాపురం గ్రామాల్లో ‘గడప గడపకు.. ’ నిర్వహించారు. ఇల్లు కట్టుకోలేదన్న నెపంతో ఇచ్చిన పట్టాను వెనక్కి లాక్కున్నారని ఓ వికలాంగ జంట ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వారికి పట్టా ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అయితే తాము ఇల్లు కట్టుకోలేమని, ప్రభుత్వమే కట్టించాలని ఆ దంపతులు మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే మాత్రం.. ‘మీరే ఇల్లు కట్టుకోవా’లంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటి బిల్లు రావడం లేదని ఓ వృద్ధుడు వాపోగా.. గత ప్రభుత్వం చేసిన మోసాలవల్లే అలా జరుగుతోందని ఎమ్మెల్యే బదులిచ్చారు. తమ ఇంటి పట్టా లాక్కున్నారని కొందరు ఫిర్యాదు చేస్తే.. వస్తున్నారు, పోతున్నారుగానీ.. మాకేమీ ఒరగలేదంటూ కొందరు మహిళలు ఎమ్మెల్యే ముఖం మీదే అనేశారు.

 

అభివృద్ధి చేయకుండా.. గడప తొక్కేదెలా!

బొబ్బిలి వైసీపీ నేత ఆవేదన

బొబ్బిలి, మే 14: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అభివృద్ధి చేయకుండా ప్రజల వద్దకు ఎలా వెళ్లగలం? అంటూ వైసీపీ ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ మరిశర్ల రామారావు నాయుడు శనివారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, మునిసిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల గడపను ఎలా తొక్కగలమని ప్రశ్నించారు. ‘వివిధ కాలనీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. వాటితో ఏ పనులూ జరగలేదు. ఆ నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. సమ్యలను పరిష్కరించకుండా వెళితే వార్డు ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-15T07:55:29+05:30 IST