Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ఎమ్మెల్యేల ధనదాహం వల్లే వరదలొచ్చాయ్‌

జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌ 


తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 4: వైసీపీ ఎమ్మెల్యేల ధనదాహం వల్లే కృత్రిమ వరదలు సృష్టించబడ్డాయని జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌ ఆరోపించారు. శనివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఇలాంటి వరదలు చూడలేదని తిరుపతిలో ఎవరిని అడిగినా చెబుతున్నారన్నారు. పేరూరు, తుమ్మలగుంట చెరువులు దురాక్రమణకు గురైన కారణంగానే వరదలు దక్షిణ తిరుపతిని ముంచేశాయన్నారు.  ప్రకృతి వైపరీత్యంతో వరదలు రాలేదని కేవలం వైసీపీ ఎమ్మెల్యేల ధనదాహంతోనే వరదలు వచ్చాయని అన్నారు. వరదలకు కారణాలపై ఆరా తీయకుండా ముఖ్యమంత్రి అఽధికారులను శభాష్‌ అని ఎలా అంటారని ప్రశ్నించారు. తమ నాయకుడు త్వరలో తిరుపతి పర్యటనకు వస్తారని, వీరి దౌర్జన్యాలపై నిలదీస్తారన్నారు. వరదనష్టాల వాస్తవ లెక్కలను త్వరలో విడుదల చేస్తామన్నారు. కడప జిల్లా రాజంపేటలో  సకాలంలో గేట్లు తెరిచివుంటే అన్నమయ్య ప్రాజెక్టు తెగేది కాదన్నారు. గేట్లు ఎత్తకపోవడానికి ప్రధాన కారణం అధికారపార్టీ ఎమ్మెల్యేల ఇసుకదందా అని ఆరోపించారు. వరదలొచ్చి దాదాపు మూడువారాలు గడుస్తున్నా ఎలాంటి సహాయ చర్యలు లేవని విమర్శించారు. జనసేన తరపున వైద్యశిబిరాలు నిర్వహించి బాధితులకు దుస్తులు, నిత్యవసరాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.  తిరుపతి అసెంబ్లీ ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో విహారయాత్ర తరహాలో పర్యటించడం దారుణమన్నారు. వచ్చిన సందర్భం మరచి ముద్దులు పెట్టడం, సెల్ఫీలు తీసుకోవడం ఏంటనీ ప్రశ్నించారు. సీఎం తిరుపతి పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జనసేన నాయకులు రాఘవరెడ్డి, రాజేశ్‌యాదవ్‌, హేమకుమార్‌, సుమన్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement