వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. గట్టి షాక్!?

ABN , First Publish Date - 2021-02-27T19:31:58+05:30 IST

ఆ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఎంపీ వర్సెస్ ఎమ్యేల్యే మధ్య వార్ నడచినంత పనైందా?

వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. గట్టి షాక్!?

ఆ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఎంపీ వర్సెస్ ఎమ్యేల్యే మధ్య వార్ నడచినంత పనైందా? తన మద్దతుదారుల గెలుపు కోసం ఎమ్మెల్యే రచించిన వ్యూహాలు ఎలా బెడిసికొట్టాయి? అక్కడ రెబల్స్ విజయం సాధించడం వెనుక ఎవరి హస్తం ఉంది? రెబల్స్ ఘనవిజయం ఎమ్మెల్యేకు ఎలాంటి షాక్ ఇచ్చింది.? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఎంపీనే కారణమా..!?

పంచాయతీ పోరు ముగిసినా మదనపల్లె నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది. గెలుపు ఓటములపై పోస్ట్ మార్టమ్ చేసుకుంటున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా తన మద్దతుదారుల ఓటమికి ఎంపీ మిథున్ రెడ్డే కారణమంటూ... ఆరోపిస్తున్నారట. పంచాయతీపోరులో ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని ఎంపీ మిథున్ రెడ్డి సపోర్ట్ తో బరిలో నిలిచిన రెబల్స్ అంతా విజయం సాధించడంతో ఈ విభేదాలు భగ్గుమంటున్నాయి.


ఏరికోరి ఎంపిక చేసి..!?

మదనపల్లె నియోజకవర్గంలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 54 గ్రామ పంచాయతీలు ఉండగా 7 గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులను ఎమ్మెల్యే నవాజ్ బాషా ఏరికోరి ఎంపిక చేసి నామినేషన్ వేయించారు.‌ దీంతో సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలనుకున్న బలమైన వైసీపీ నాయకులు రెబల్ అభ్యర్థులుగా పోటీకి దిగారు. రామసముద్రం, మదనపల్లె మండలాల్లో 10 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులకు పోటీగా రెబల్స్ క్యాండెట్స్ బరిలో నిలిచారు. వారిలో 8 మంది రెబల్స్ ఘన విజయం సాదించారు. అలానే మరో రెండు మూడు పంచాయితీల్లో ఎమ్మెల్యేను కాదని ఎంపీ ద్వారా పోటీలో ఉన్నవారు సైతం విజయఢంకా మోగించారు.


అయినా రెబల్‌దే గెలుపు..

రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రయత్నాలు కూడా చేశారు. అయినా వారు పోటీ నుంచి తప్పుకోలేదు. మదనపల్లె మండలంలోని కోళ్ళబైలులో ఎమ్మెల్యే నిలబెట్టిన అనిల్ కుమార్ రెడ్డికి రెబల్‌ అభ్యర్థి ఆనందరెడ్డి గట్టిపోటీగా మారారట. దాంతో ఆనందరెడ్డి ఓట్ల కోసం డబ్బులు ,చికెన్ పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణతో.. పోలీస్‌ కేసులు పెట్టించి ఎమ్మెల్యే భయబ్రాంతులకు గురిచేసారట. రెబల్ అభ్యర్థి గెలవకుండా అడ్డుకోవడానికి కౌంటింగ్‌ను కోళ్ళబైలు నుంచి బయ్యారెడ్డి కాలనికి మార్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినా రెబల్ అభ్యర్థి ఆనందరెడ్డి విజయం సాధించారు.


ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. 

అలాగే దుబ్బిగానిపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణపై రెబల్‌గా బుడ్డయ్య పోటీకి దిగడంతో.. ఆయన మద్యం పంపిణీ చేస్తున్నట్లు పోలీసు కేసులు పెట్టించారట. ఇలా ఎమ్మెల్యే వర్గీయులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రెబల్ అభ్యర్థి బుడ్డయ్య ఘన విజయం సాధించారు. ఇక కొత్తవారిపల్లె పంచాయితీ, వలసపల్లె పంచాయతీల్లో ఎంపీ మిథున్ రెడ్డి మద్దతుతో రంగంలోకి దిగిన మహేష్ కుమార్, సరస్వతమ్మ కూడా విజయకేతనం ఎగరేశారు. ఈ రెండు పంచాయతీల్లో కొత్తవారిపల్లె పంచాయతీ ఏకగ్రీవం కాగా.. వలసపల్లెలో తిరుగుబాటు అభ్యర్థి సరస్వతమ్మ విజయం సాధించారు.


నువ్వా.. నేనా..!?

ఇక మదనపల్లె పట్టణం శివారులోని కురవంక పంచాయతీలో ఎమ్మెల్యే నవాజ్ బాషా సపోర్ట్ తో ఫర్వింతాజ్ పోటీకి దిగారు. ఇక్కడ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే ఏకంగా 15 మంది కౌన్సిలర్ల టీమ్‌ను ప్రచారంలోకి దించారు. ‌ఇక్కడ రెబల్ అభ్యర్థి చిప్పిలి చలపతి, వైసీపీ మద్దతుదారు పర్వింతాజ్ మధ్య నువ్వా నేనా‌ అన్నట్లు పోటీ జరిగింది. చివరికి తిరుగుబాటు అభ్యర్థి చలపతి 697 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఫర్వింతాజ్‌కు కేవలం 400 ఓట్లు‌ మాత్రమే వచ్చాయి. 


చర్చ ఏం జరుగుతోందంటే..!

మరో వైపు రామసముద్రం మండలం కేసీపల్లె పంచాయితీలోనూ రెబల్‌ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. మాలెనత్తం పంచాయతీలో రెబల్ అభ్యర్థి శ్రీనాథరెడ్డి,  ఎలకపల్లె పంచాయితీలో రెబల్ అభ్యర్థి చరణ్ కుమార్ గెలిచారు. ఇక అరికెల పంచాయితీలో తిరుగుబాటు అభ్యర్థి లక్ష్మీదేవి విజయం సాందించారు. మానెపల్లె పంచాయతీలోనూ రెబల్ అభ్యర్థి బాలప్ప విజయం సాదించారు. ఇలా రెబల్స్ అంతా ఎమ్మెల్యే నవాజ్ బాషా నిలబెట్టిన అభ్యర్ధులపైనే ఘనవిజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ మిథున్ రెడ్డినే రెబల్స్‌కు బ్యాక్ సపోర్ట్‌గా ఉంటూ గెలిపించారనే ప్రచారం జరుగుతోంది.


వైసీపీలో ‌ముసలం! 

మరో వైపు తన అనుచరులంతా రెబల్స్ చేతిలో ఓడిపోవడంతో ఎమ్మెల్యే నవాజ్ బాషా షాక్ తిన్నారట. కోళ్లబైలు రెబల్ అభ్యర్థి ఆనందరెడ్డిని, అక్కడి ఓటర్లను దూషిస్తూ మదనపల్లె జెడ్పీటీసీ అభ్యర్థి ఉదయకుమార్ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పంచాయతీపోరుతో మదనపల్లి వైసీపీలో‌ముసలం పుట్టిందని‌ పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. 10 స్థానాలలో రెబల్స్ పోటీ చేయగా 8 స్థానాలలో విజయం సాధించడం ఎమ్మెల్యే నవాజ్ బాషాకు గట్టి షాక్ ఇచ్చినట్లయిందని ఆ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.

Updated Date - 2021-02-27T19:31:58+05:30 IST