ఆ ఓటు పైనే అభ్యంతరాలు: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

ABN , First Publish Date - 2021-11-24T21:16:46+05:30 IST

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే

ఆ ఓటు పైనే అభ్యంతరాలు: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

విజయవాడ: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ అన్నారు. టీడీపీకి చెందిన 16వ ఓటు పైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఫలితాలను ప్రకటించలేదన్నారు. ఆ ఓటు చెల్లుబాటు కాదని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. రేపు కోర్టు తీర్పు వస్తుందన్నారు. 16వ ఓటు చెల్లదని అనుకుంటున్నామని కృష్ణప్రసాద్‌ అన్నారు. 




కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయిన విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు.


పూర్వపరాలు ఇవీ..

కొండపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నప్పటికీ వారి బలం 15కే పరిమితం అయింది. టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర సభ్యురాలి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ కేశినేని నానీకి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడుతూ వచ్చి ఇవాళ్టితో ఫుల్‌స్టాప్ పడింది.





Updated Date - 2021-11-24T21:16:46+05:30 IST